నాకూ నవ్వులేరుకోవాలనున్నా
లోకం చెట్టు రాలుస్తుంటే,
నిన్ను తాకి మిగిలిన చేతులవంటుకోనంటుంటే,
నాకూ మాటలందుకోవాలనున్నా
స్నేహపు సంగీతం రవళిస్తుంటే,
నువ్ తట్టి విడిచిన నిశ్శబ్దమే, నా గీతమౌతుంటే
నాకూ కలలాహ్వానించాలనున్నా
మోహపు సాంగత్యం విరులిస్తుంటే,
నువ్ తీగ నిలిపిన మైకమే ఇంకా కమ్ముకుంటుంటే,
నాకూ బ్రతకాలనున్నా
రేపటి ఊహ రమ్మంటుంటే,
నువ్ తీయగా తీసిన ప్రాణమెప్పుడో కనుమరుగై ఉంటే,
స్వాంతన కోరుతున్న కాలిన అక్షరం
పుస్తకాల్ని దాచుకున్న మస్తకాల మూటలో,
సాక్ష్యమడుగుతున్న కూలిన ఆ క్షణం
నిజాల్ని నిక్షిప్తించుకున్న అస్థిత్వపు దాగుడుమూతలో,
సాయం రమ్మంటున్న శిలాజ స్ఫటికపు ఏకాంతం
మాట మింగిన మౌనమాడిస్తున్న ఆటలో,
సర్వం కోల్పోతున్న విరాగస్ఫోరక జీవితాంకం
ఆశాసమాధిని రాలే ఎండుటాకుల మోడు నీడలో,
జీవం కోసం ఆత్మలా,
ఙ్నానం కోసం తృష్ణలా,
ఆధారం కోసం మొక్కలా,
ఆవృతం కోసం భూమిలా,వెతుకుతూ,
కనిపించని కాంతిరేఖకై తపిస్తూ,
వినిపించని ఆకాశవాణిని ఊహిస్తూ,
వికసించని పసిమొగ్గల్ని జోకొడుతూ,
ముంచేసిన చిక్కటి చీకటిని ఛీకొడుతూ......
ఎప్పట్లాగే నాలో నేను...
"ఆవృతం కోసం భూమిలా" దీని వెనుక మీ భావమేంటో కాస్త వివరంగా చెప్తారా...?
ReplyDeleteకానీ చాలా బావుంది.... నిజంగానే 'ఎప్పట్లాగే' మాటలకందని భావాలని మాటల్లో ఎలా చెప్పాలో తెలియని పరిస్థితిలో పడిపోయాను...
thank you very much priyaa garu...ఆవృతం కోసం భుమిలా, మరో మారు కక్ష్యలో పరిభ్రమించడానికెదురుచూస్తున్న భూమిలాగా అని, ఆవృతం అంటే, పరిభ్రమణమనే అర్ధంలో వాడాను..
ReplyDelete