కవితా మిత్రులకు, నమస్కారం

నా భావాల్ని, భాషని, కలల్ని, కలవరింతల్ని, ఆనందాల్ని, ఆరని తడినీ, ఉద్వేగాల్నీ, ఉద్దేశాల్ని, ఉద్రేకాల్నీ, ఉన్న స్థితిని, మీతో పంచుకొవాలనుకునే నా ఈ చిన్న ప్రయత్నాన్ని ఆదరించి, అభినందిస్తారని, ఆస్వాదించి ఆహ్లాదిస్తారనీ, తప్పిదాలుంటే, దిద్దుకునే అవకాశమిస్తారనీ ఆశిస్తూ, మిమ్మల్ని "కవన వనం"లోకి, ఆహ్వానిస్తూ, మీ వంశీ..

Sunday 16 December 2012

నీ నవ్వు


నీ నవ్వు,
ఎక్కడో పువ్వు పుట్టిన పరిమళంలా,
ఎవ్వరో వెన్ను తాకిన పరవశంలా,
ఎన్నడో నన్ను పిలిచిన నీ స్వరంలా,
ఎందుకో మదిని వీడని ఓ క్షణంలా,
ఎప్పుడో దేవుడిచ్చిన తొలి వరంలా,

నీ నవ్వు,
నవ్వునే నవ్వించేట్టు,
ఏడుపునీ జోకొట్టేట్టు,
కష్టాన్నీ కవ్వించేట్టు,
కవుల్నీ కదిలించేట్టు,
వేసవిలో వానొచ్చేట్టు,
జాబిలికే వయసిచ్చేట్టు,
జాములనే ఆపేసేట్టు,
జ్యోతులకే వెలుగిచ్చేట్టు,

నీ నవ్వు,
అన్నింటినీ మరిపించేట్టు,
అమృతం కురిపించేట్టు,
అద్భుతం అనిపించేట్టు,
అమాయకత్వం కనిపించేట్టు,
డోపామిన్ లో మునిగించేట్టు,
ఎండార్ఫిన్స్ మింగించేట్టు,
గుండె వేగం పెంచినట్టు,
గాఢ మైకం పొంచినట్టు,

నీ నవ్వు,
బెంజీన్ ని పొలీమరీకరించేట్టు,
బజ్జీలకు ఘాటు రుచినిచ్చేట్టు,
డీ.ఎన్. ఏ కొత్త ప్రొటీన్ పుట్టించేట్టు,
ఎవడికీ దొరకని "డాన్"గాడ్నీ పట్టించేట్టు,
వెన్నెల్లో వెనీలా తింటున్నట్టు,
వేడి కాఫీకి మూతి కాలినట్టు,
ఫస్ట్ బాల్ కి సచిన్ సిక్స్ కొట్టినట్టు,
ఫాస్ట్ కార్ కి బ్రేకుల్లేక దూసుకెల్తున్నట్టు,
ఏజ్ బార్ కీ కొత్త ఆశలు పుట్టించేట్టు,
చాకో బార్ కంటే తియ్యగా అన్పించేట్టు,

నీ నవ్వు,
గుడి గంటంత భక్తిగా,
బడి పలకంత కొత్తగా,
వరిపొలమంత బరువుగా,
చిగురాకంత మెత్తగా,
నీ నవ్వే.....

Saturday 14 July 2012

* "బాపు" *



కొట్టంల సజ్జ మీద 
ఎల్లిగడ్డల గుత్తులెన్కపొంటి, దాక్కున్నా, 
చేతిల ముల్లుగర్రతోని నన్ను దేవులాడుకుంట 
"
బాపు", 

-"
కీసల పైసల్దాస్తె ఎత్కపోతాండని, 
నడింట్ల తనాబిల పెట్టి బేడమేస్తె, 
అవి కుడ్క దెంకపోతావ్ రా, 
కొడ్క సచ్చినవియ్యాల నా శేత్ల, 
తాల్లల్ల కల్లు తాక్కుంట, 
ఊర్లె తీన్ పత్తాడుకుంట, 
పట్నంల శోకు పడుకుంట, 
లంగ కాయికాలిడుస్తవా లేదా, 
పొలగా, 
ఇత్తనాలగ్గొడ్లమ్మితిమి, 
బోర్ బాయికి భూమి తన్కవెడ్తిమి, 
పురుగుసొచ్చి రేగడి పత్తంతా పాయె, 
సద్దామని ఎండ్రిన్ కొన్నీకి పైసల్దాస్తె నువ్వెత్కపోతివి, 
ఎట్ల సావాలింకా....."

నా జిందగీల , బాపేడ్సుడు నేన్జూసుడు గదే మొదాలు, 
యే, ముసలోడు, గట్లె ఒర్రుతడు, 
సస్తడా, పీక్తడా తీయ్, 
బాపుకు దొర్కకుంట కోమటి దుక్నంల బీర్ తాగి, సల్లవడ్డ, 
మాపటికింటికిపోక, 

పొద్దుగాల్ల, 
"
మీ అయ్య, పొద్మీకి రేగడి భూమమ్మి నీకీ 
లిపాప, పైసలీమనె. గాభర గాభరుండె, 
బిరాన పో ఇంటికి" 
బొంగురుగొంతు శావుకార్, 
నా నిద్రమబ్బు దులిపి, ఏదో ఇవుసం దాసుకుంట, 

లిపాపల, బాపు రాశ్న కారట్, 
"
ఎవుసం పిరమైందిరా
నాతోని గాదింక, పైసల్దీస్కని పట్నంపో, 
లగ్గం జేస్కో, పిలగాల్లను సదివియ్యి, 
నేన్నీకు జేశినట్టు చేయకు, 
మందెక్కువ తాగకు, 
పెయ్యి నాశనం, 
నా పీనుగ మీ అమ్మ బొంద పక్కన్నే పె...
పోతున్నా బిడ్డా, 
పైలం....

Friday 13 July 2012

*తను *




తనే, నిజంగా, తనే..నా...
ఎనిమిదేళ్ళ క్రితం వొదిలి పోయిన
మంచువర్షం తిరిగి కురుస్తూ,
మంచిముత్యం మరల మెరుస్తూ,

ప్రేమలన్నింటికీ పెళ్ళవదు, అలాగే,
అన్ని పెళ్ళిళ్ళూ ప్రేమల్ని మరిపించలేవేమో,
"
ఎలా ఉన్నావ్, పిల్లలూ? ఆయన?"
ఇలాంట్రోజొకటొస్తే చావాలనుకున్నా, కానీ,
తన్తో మాట్లాడాకా బ్రతకాలన్పిస్తూ,

దిగులు మొహంతో, వొణికే వేళ్ళతో,
నిన్నటి నా దేవత, శవంలా నేడు
-"
బావున్నాను, పిల్లల్లేరు"
కాల్చిన గాయాల చేతిని చీరతో కప్పేస్తూ,
కూలిన ఆశల చెట్టుని, రాని నవ్వుతో, చిగురించేందుక్కష్టపడ్తూ,
నిజమేనా అన్న నా చూపుకి,
నిజంచెప్పాలనుకుంటూ,
-"
వాడో శాడిశ్ట్, ఇంపొటెంట్,
పరిస్థితులకు భయపడి నిన్నొదులుకున్నందుకు....."
ఎప్పుడూ ఏడవన్నన్నేడిపిస్తూ,
కురిసిన తన కళ్ళు,
-"
చేసిన తప్పుకు, నన్ను చూడలేక,
జారిన నా కలల్ని తిరిగివ్వలేక,
అమ్మ, నాన్న, కాలంతో ఓడి పో..యా..రు..
నాకంటూ మిగిలింది నా నీడ, నాటి నువ్వు,
ఇన్నాళ్ళకు రాగలిగాను బంధాల బందీలోంచి,
నిన్ను నమ్మించాలని కాదు, నిజం నమ్ము,"
నల్లకోటు లేని న్యాయంలా నా తను,

"
నాన్నా" పరిగెత్తుకొస్తూ, నాలుగేళ్ళ నా కూతురు
అమ్మ దగ్గరికెపుడు తీస్కెళ్తావ్ అన్నన్నడుగుతూ,
ఆశ్చర్యంగా, ఏమైందని కళ్ళతో అడుగుతున్న "తన"కి,
చూపులాకాశానికి చేర్చి బదులిస్తూ,
అదిగోరా అమ్మ అంటూ , "తన"ని చూపించిన్నేను..,

పాపని హత్తుకుని వెచ్చగా విచ్చుకున్న తన నవ్వు,
పాప బుగ్గ మీదుగా నా నుదుటిని తాకి వేడి చెమ్మ మిగిల్చి...
రాదనుకున్న వసంతం వరించినట్టు,
లేదనుకున్న సమస్తం స్వాగతించినట్టు...

Thursday 12 July 2012

* ఆక్సిడెంట్ *



కరీంనగర్ హైవే
శామీర్ పేట్ దాటి నిమిషాలంతే,, 
మంద్రంగా పాట
"
క్విట్ ప్లేయింగ్ గేమ్స్ విత్ మై హార్ట్" బాక్ స్ట్రీట్ బాయ్స్
వెంటనే "సంబడీస్ మీ" ఎన్రిక్ ఎగ్లేసియా
ఒంటరితనాన్ని, ఓటమిని 
మరింత గుర్తుచేసే పాటల పీక తొక్కి
నిశ్శబ్దంలో, నీలాలు నిండిన కళ్ళతో
అబ్సొల్యూట్ వోడ్కాతో, గుండెని మండిస్తూ
స్టీరింగ్ తిప్పుతూ

"
ఐ లవ్ యూ, కానీ, నా వాళ్ళ ప్రాణం, నీ ప్రేమనోడించి....." 
మూడ్నెల్లుగా... ప్రతిద్వనిస్తూ తన మాటలు, చెవుల్లో
కోపాన్ని కార్ ఆక్సెలరేటర్ మీద చూపేలా చేస్తూ
120.. 130... 140...
స్పీడోమీటర్ మాటవినకుండా
ఎదురుగా ఏముందో కనపడనంత వేగంతో

ఏదో విస్ఫోటించిన స్వనం
ఎక్కడో ఆర్తనాదం ధ్వనించిన క్షణం
మత్తులో, చీకటి ముసుగులో
ఎలాగో ఆరో అంతస్థులో ఇంటికి చేరి

తర్వాతి రోజు సాయంత్రం
ఫోన్రింగ్.. కలల్ని చీలుస్తూ, నాన్న.
-"
అక్షయ..ఆక్సిడెంట్రా...
పోయింది, మూడ్నెల్ల కడుపుతో
ఎవరికీ తెలీదు, పొస్ట్ మార్టమైందిపుడే
పెళ్ళై రెణ్ణెల్లేగా, ఐ నో దట్ యూ వర్ ఇన్ లవ్
రాత్రెవడో తాగుబోతు..శామీర్ పేట్ దగ్గరే అట
హలో.. హలో, రేయ్, మాట్లాడు, ఏమైంది, హల్...." 
జనరలాస్పత్రిలో ఫోరెన్సిక్ ప్రొఫెసర్

వాలెట్లోని అక్షయ ఫోటో పిడికిట్లో పట్టుకుని
తనని చేరడానికి ఆరో అంతస్థు 
బాల్కనీని, పైకి దారడుగుతూ
నిర్వేదంతో కళ్ళుమూసి..