కవితా మిత్రులకు, నమస్కారం

నా భావాల్ని, భాషని, కలల్ని, కలవరింతల్ని, ఆనందాల్ని, ఆరని తడినీ, ఉద్వేగాల్నీ, ఉద్దేశాల్ని, ఉద్రేకాల్నీ, ఉన్న స్థితిని, మీతో పంచుకొవాలనుకునే నా ఈ చిన్న ప్రయత్నాన్ని ఆదరించి, అభినందిస్తారని, ఆస్వాదించి ఆహ్లాదిస్తారనీ, తప్పిదాలుంటే, దిద్దుకునే అవకాశమిస్తారనీ ఆశిస్తూ, మిమ్మల్ని "కవన వనం"లోకి, ఆహ్వానిస్తూ, మీ వంశీ..

Saturday, 31 March 2012

"వి" "డు" "ద" "ల"


చలి చేతలకు ముడుచుకున్న
చెలి చేతులనందుకునే ఆనందంలో,
చీకటి చీర చుట్టిన రేయికి
వెలుగుల మాల మోసే ఆరాటంలో,
కళ్ళడిగే కలల కోర్కెలకి
కాలంతో జవాబిప్పించే ఆవేశంతో,
మనుషుల దూరాన్ని మరిపించే
మంత్రాక్షరానికై ఆరాధనతో,
ఉనికిని నమ్మని అందరికీ,
ఉన్నానని తెలియచెప్పే ఆలోచనతో,

కప్పేసిన వల్మీకాన్ని బద్దలు చేసుకుని,
కమ్మేసిన విలయాల భారం దించేసుకుని,
రెప్పవేయని కలత నిద్ర దూరం చేసుకుని,
రెమ్మ దాచిన సుమ సౌరభం శ్వాసలోనింపుకుని,
చెప్పలేని అవలోకనా స్రవంతుల్ని దరికి తీసుకుని,
చూడలేని గతాల గతాల దారికి తోసుకుని,

విడుదలయ్యాడు,
నాలోంచి నేను,
నిన్నలొంచి నేడు.....

Friday, 30 March 2012

- అ"క్షరం" -


అక్షరాలంటుకున్నాయి, ఆర్పకండి,
మండనివ్వండలాగే,
ఏళ్ళుగా మౌనాల్లో సమాధి కట్టుకుని,
చాన్నాళ్ళుగా మానవుల గాయాలు తట్టుకుని,
చచ్చాయనుకున్నక్షరాలు కాల్చడానికొస్తున్నాయి,
పారిపోకండి,

ఎర్రగా వేడెక్కినక్షరాలెప్పటికీ కరగని గుర్తులు పెడుతుంటే,
ఏమార్చనక్షరాలు మార్పుకి సంకేతమిస్తుంటే,
తట్టుకోండి,
తిట్టుకోకండి,
నల్లగా కముల్తున్న చర్మప్పొరలు పాలిపోయి,
పొక్కులొచ్చినవయవాలు చూసి భయపడకండి,
కొత్త కవచమొస్తోంది
అక్షరాల శరాల వరాలతో,

ఎప్పుడూ వసంతమైతే వాడిపోవడమెలా తెలుస్తుంది
ఎన్నడూ వినోదమేనా, వీడుకోళ్ళెవరు నేర్పుతారు,
తిరుగుబాటు కాదండోయ్,
పొగరుమాటా కాదు,
విప్లవం తేదండోయ్,
వీరావేశమూ లేదు,

ఎవరది,
మంటలార్పి అక్షరాల మతి పోగొడ్తోంది
మాయచేసక్షరం దారి మళ్ళిస్తుంది,
నిన్నే..... ఎవర్నువ్వు,

యుగాల పోరాటంలో చచ్చి పుట్టినక్షరాల్ని,
క్షరమవమంటుందెవరు,
జాగృతినుండి సుధీర్ఘ సుషుప్తికి తిరిగి తోస్తుందెవరు,

"మనిషిని",
మనసు లేని మస్తిష్కాన్ని,
మస్తిష్కాన నింపుకున్న మాయా అస్థిత్వాన్ని,
అస్థిత్వాన్నెపుడో కోల్పోయిన అనాగరికుణ్ణి,
అనాగరికతే ఆత్మగాగల నాగరికుణ్ణి.....

Saturday, 24 March 2012

అంతరాత్మ


చెప్తూనే ఉన్నా,
విన్నావా, ఛావిక,
మాట్లాడవేం, నోరు పెగల్దా,
నీ అంతరాత్మకే నీళ్ళు మింగితే,
నలుగురికీ పలుచనవవూ,
నీలో నీకు తెలీని వైరుధ్యాలుంటే, ఒప్పుకోక దాటేస్తావేం,
నీ వాళ్ళ ప్రశ్నలు పొడుచుకుని ఏమైపోతావిక,

తేలిపోయావ్, జీవితం తేలిగ్గా తీసుకుని,
సోలిపోయావ్, గమ్యం మరచి పడుకుని,
పడిపోయావ్, గమనమాపి గాలిమేడలెక్కి,
తవ్వుకున్నావ్, నిన్నలోనే ఉండి, రేపటికి గొయ్యి,

ఏం మిగిలిందిక, దైర్యం తెచ్చుకోడానికి,
ఏం జరిగిందసలు ఇక్కడిదాకా జారిపడ్డానికి,

మాట్లాడిప్పటికైనా
మెదడుతో మనసుకి లెంపకాయ కొట్టి,
పోట్లాడిప్పటికైనా,
ఆశతో నిస్పృహకి నిప్పు పెట్టి,
పోరాడికనైనా నేర్పుతో ముసుకున్న తలుపులు తెరిచి పట్టి,
ఆపు ఇకనైనా ,
ఒదార్పు కోరే దివాలాతనాన్ని దూరం నెట్టి,

సాయం రాడెవడు,
గెలిచే గుర్రాలపైనే పందెమిక్కడ,
సమయమూ ఇవ్వడెవ్వడూ,
గేలి పడే సోమరులకు స్థానమే లేదిక్కడ,
నీ స్వగతమూ వినడెవ్వడు,
ఎవడి గతం, వాడి ఊబి ఇక్కడ,
స్మరణమూ చేయడ్నిన్నెవడూ,
రణాన విజయులైతేనే చిరస్మరణీయులిక్కడ,

లే,
కాలం కరిగి, కొట్టుకుపోకముందే,
శూన్యం కలిసి, కథ ముగియకముందే,
రుధిరం చల్లబడి కారణాలు వెతక్కముందే,
రౌద్రం తెగిపడి సంతృప్తి నటించకముందే,
ఖేదమే ఆమోదమై కనపడని మోదాల్ని కప్పేయకముందే,
వేదనే ఆవేదనై, కళ్ళూహించే కలల ఎత్తుల్ని కూల్చేయకముందే

నేనున్నా నీకు,
నేనన్నీ నీకు,
ఎందుకంటే,
నేను నీ ఆలోచనని, ఆనందాన్ని,
నేను నీ అనుభవాన్ని, అభిమానాన్ని,
నేనే నీ, ప్రతి భాగాన్ని, పూర్తవని యాగాన్ని....

Thursday, 22 March 2012

* ప్రస్థానం *


చెదల్తో, శిథిలమైన అడుగుజాడల్లో, అడుగేస్తూ,
చీకట్లో కలిసున్న శైశవ సాక్ష్యాల్ని దారడుగుతూ,
అవని పొరల్లో పారేస్కున్న ఖండిత శిరస్సుల్ని పోల్చుకుంటూ,అవన్నీ నావేనా అని ఆశ్చర్యం నటిస్తూ,

ఎప్పటి మాటలో, ఎన్నటి మంత్రాలో
చెవిన పడ్తుంటే,
ఎవరి గాయాలో మరెవరి గర్జనలో
పట్టి ఆపుతుంటే,
ఎక్కడి కలలో, మరెక్కడి కామనలో
చూపు లాగుతుంటే,
అవ్యక్త ఆనందాలో, అపసవ్య అనురాగాలో
అలోచనలో పడేస్తుంటే,
చూడకుండా ముందుకు సాగుతూ,

కళ్ళాపిన కాళ్ళకి తగిలిన, నా నిర్జీవ దేహాలు,
చరిత్ర కప్పుకున్న సమస్త నాగరికతల్ని,
నా సహస్ర నామాల్నీ పరిచయం చేస్తుంటే,
మనసు మాత్రమే చూడగల్గేంత దూరాన,
నిష్క్రమించే దోవ మూస్తున్న "నా" వెనక,
శోకిస్తున్న "నా" ముందు,
సుఖాల లెక్కలేస్తున్న "నా" పక్కన,
నేనంటిస్తున్న చితిలో, ఆసీనుడినైన నేను,
ఆహ్వానించిన "నాకు",
అద్వైతమర్ధమౌతున్న,
అనంతమందుతున్న,
అంతరంగమావిష్కారమౌతున్న,
అనాది ఆకలి తీరుతున్న భావన తోడురాగా

కాష్టంలో కలిసి కరగడానికి దూకుతున్న "నేను",
నా కాయానికి కాపరినై కపాలమోక్షం కలిగిస్తూ నేనే...

Wednesday, 21 March 2012

* ఫోర్త్ డైమెన్షన్ *


ప్లాస్టిక్ ప్రపంచం పళ్ళికిలిస్తోంది ,
నిజమేనా, నిగూఢమా,
కాంపస్లో అర్ధమవని మెటీరియలిసమ్,
కాళ్ళు బైటపెట్టాకే కళ్ళు పొడుస్తూ,
రేపు మీదెన్నో ఆశలు పెట్టుకుంటే
గడియారం నిమిషానికరవై కత్తులు దింపి రక్తం తాగుతూ,

అవసరానికి తోడుంటుందనుకున్న చదువు
చేతులెత్తి కర్ణుని డెత్ ఆనివర్సరీ గుర్తు చేస్తూ,
ధర్మార్ధ కామాల్లో, తోడుంటానన్న వారు
అర్ధమే ప్రధానమని అర్ధమవని లోయల్లో నెట్టేసి పోతూ,
గున్నమావి గూటి స్నేహాలు,
ఏ దోస్తీ హమ్ నహీ చోడేంగేలు,
ప్రాణం మీద కొచ్చినపుడే గుర్తొస్తూ,

నెత్తి మీద రూపాయి పెడ్తే
ఎంతకమ్ముడౌతాడనారాల్తీసే బంధువులు,
నెత్తి పగిల్చస్తే మనకెంత
మిగుల్తుందనాలోచించే పేగు తెంచుకున్న జీవాలు,

ఇక్కడింకా కృత్రిమం కానిదేదైనా ఉందంటే అది
కృత్రిమత్వమేనేమో,
కాదంటారా,
అదిగో, మళ్ళీ,
ప్లాస్టిక్ నవ్వుతో మీరు,

Tuesday, 20 March 2012

లాబిరింత్ (labyrinth)....


పగిలిపోతున్న తల,
లోపలేదో మైక్రో బిగ్ బాంగ్ విస్ఫోటిస్తున్నట్టు,
బైటి కక్ష్యలోనెలెక్ట్రాన్ దారితప్పి కేంద్రకోద్గారమౌతున్నట్టు,
ప్లాటీహెల్మింత్ పరాన్నభుక్కులు మెదడుకెక్కి కాల్షియం గోడకడ్తున్నట్టు,
క్రషర్లో పడి పర్వర్టాలోచన్ల రసం చిమ్మి రహస్యాలేవో రేపుతున్నట్టు,
మస్తిష్క్కప్పుట్టలోంచి జారుతున్న వెన్నుపాము బరువుకి, పూసలు పిండైతున్నట్టు,

రౌరవపు నదిలో ఆక్సీజన్ మాస్కుల్లేక దూకుతున్నట్టు,
పర్వతపు తుదిలో, విచ్చుకోని పారాచూటేస్కుని పడ్తున్నట్టు,
సైకతపు ఎడారి ఎండలో బట్టల్లేక కూరుకున్నట్టు ,
దైవతపు ఆరోహణా సడిలో కర్ణభేరి కంపించే అతిశ్రుత "ఒపేరా" తాకుతున్నట్టు,
ప్రాకృతపు పరాగరేణువేదో నాసికలో నక్కి నూటొక్క తుమ్ములేయిస్తున్నట్టు,

నరాల్లో గాఢ సల్ఫ్యూరికామ్లం, నిగూఢంగా పారుతున్నట్టు,
కణాల్లో మైటోకాండ్రియాలు పన్జేయమని నినదిస్తూ పారిపోతున్నట్టు,
కిరణాలు,అతినీల లోహితమై చర్మాన, గోళీలాటక్కన్నాలేస్తున్నట్టు,
మరణాలు మఫ్టీలో నిదానంగా దగ్గరికొస్తున్నట్టు,

ఎక్కడున్నావ్ నువ్,
నవ్వుతున్నావా చూసి,
ఒక్క సైగతో ప్రాణం పోయగలిగీ....
నాకేంటనుకుంటున్నావా చస్తే,
ఒక్క స్పర్శతో, పునరుజ్జీవింపగలిగీ...

Monday, 19 March 2012

*పోతే పోనీ*


పొనీ పొయేవాళ్ళని,
అర్ధించి గుండెల్లో దాచుకుంటే
మంటలు మిగిల్చేది నీ మనసే,

పోనీ వొద్దనుకున్నోళ్ళని,
పిలిచి ప్రేమగా ప్రాణం పెడితే,
ఎప్పటికైనా రగిలేది మానని గాయమే,

పోనీ నవ్వుకునే తోవల్ని,
స్నేహంగా చొరవుందని చొచ్చుకుపోతే
నవ్వులపాలయ్యేది నీ నవ్వే,

పోనీ నటించే నాలుకల్ని,
ఇష్టంగా మాటకలిపితే
భరించలేని మౌనం ముంచేది నీ నిన్నే,

ఎవరికెవరేమీ కాని లోకంలో,
ఎప్పటికప్పుడు తీరు మార్చే కాలంలో,
ఎవరోఒకరికై బ్రతకడం దండగ,
అన్నీ నీవైన, నీకు నువ్వండగా ఉండగా,

రక్తం చిందక రోగం ముదిరే మాయలో,
రాత్రులు చీల్చిన పగటి అవశేషాల విశేషాల్తో,
ఎవరూ ఎన్నడూ చూడని గెలుపుకై ఆటలెందుకు,
నిన్ను నువ్వే ఓడించుకుంటూ పద ముందుకు....