కవితా మిత్రులకు, నమస్కారం

నా భావాల్ని, భాషని, కలల్ని, కలవరింతల్ని, ఆనందాల్ని, ఆరని తడినీ, ఉద్వేగాల్నీ, ఉద్దేశాల్ని, ఉద్రేకాల్నీ, ఉన్న స్థితిని, మీతో పంచుకొవాలనుకునే నా ఈ చిన్న ప్రయత్నాన్ని ఆదరించి, అభినందిస్తారని, ఆస్వాదించి ఆహ్లాదిస్తారనీ, తప్పిదాలుంటే, దిద్దుకునే అవకాశమిస్తారనీ ఆశిస్తూ, మిమ్మల్ని "కవన వనం"లోకి, ఆహ్వానిస్తూ, మీ వంశీ..

Friday, 20 April 2012

*సంక్రాంతి*


బస్సెక్కి చాలారోజులైంది,
కారు పాడయ్యి ఎక్కించింది,
సంక్రాంతికి సగం హైదరాబాద్ పల్లెల్లో పురుడు పోసుకుంటుందేమో,
రోడ్లంత ఖాలీగా ఉన్నాయి,
కరీంనగర్ టికెట్ తీస్తుండగా, కన్పించింది కావేరి,
చిన్నప్పుడు బడిలో మొక్కల్తో పాటే పెరిగిన స్నేహం,
అనుకోకుండా వాళ్ళ నాన్న పోవడం,
వాళ్ళెక్కడికో వెళ్ళిపోవడం, మళ్ళీ ఇప్పుడిలా...
నన్నో క్షణం నాలో మగాడాక్రమించాడు,
చిదిమి దీపం పెట్టుకోడమంటే తెలిసింది తనని చూస్తే,
కావే...ఉహు, పిలిస్తే,గుర్తుపట్టకపోతే,
కుతూహలం పరువుని పక్కన్నెట్టి అరిచింది,

-"అవునూ, కానీ, మీరు.. "
పర్సులో చిన్నప్పటి ఫోటో ఇలా పనికొస్తుందనుకోలేదు,
-"హేయ్, రాహుల్, గుర్తొచ్చావ్, మారిపోయావ్ చాలా",
చాలా, ఇంకా మారాలా, గుర్తుపట్టిన చనువుతో నేను,
ప్రశ్నలు, పాత సంగతులూ అయ్యాక,
పెళ్ళి సంబంధానికి మావూరే వొస్తుందని తెలిసింది,
అంత ఏ.సీ లోనూ చెమట తడిపింది,గుండెల్లో నొప్పి, సన్నగా,
నా అదృష్టమెవరో లాక్కెళ్తున్నట్టు,
తనేదో చెప్తోంది, వాడి గురించి, నాకేం విన్పించట్లా,వింటే కదా,
బావుండేమో పలకరించకున్నా, నిద్రైనా పట్టేది బస్ కుదుపులకి,
ఫోటో కూడా ఉన్నట్టుంది, అలిసిపోయినట్టావలించా చూపిస్తానంటే,

ఊరొచ్చాక నవ్వుకుంటూ దిగిపోయింది, నేన్నిద్ర నటిస్తూ చూస్తుండగా,
మొహం మాడ్చుకునింటికెళ్తే అమ్మ గుర్తుపడ్తుంది,
ఈ సారి పండగ కొండెక్కినట్టేగా,
మామూలవడానికారు సిగరెట్లు తగలేసి,
కొత్త ఉత్సాహంతో, కొంచం దగ్గుతో చేరానింటికి,
-"రారా, ఆలస్యమైందేంటి, ఈ ఆంటీ గుర్తున్నారా" అమ్మ,
"లేదమ్మా" నేను, చూడకుండానే,
-పోనీ ఈ అమ్మాయైనా...

చలికాలంలో వడదెబ్బ తాకినట్టైంది,
కావేరి ఇంటికొచ్చిందా, వాళ్ళమ్మతో,
-"తనాలోచనే రా, ఈ బస్సు పెళ్ళిచూపులు,
నీ కారు పాడైందని డ్రైవర్ని నేనే చెప్పమన్నా" అమ్మ,

తెలీకుండా అనవసరంగా ఆరు కాల్చానే,
కావేరి, నీతో మాట్లాడాలి" కోపాన్నాపుకుంటూ నేను,
-మీరు మాట్లాడ్తుండండి, మాకూ పనులున్నాయి, అమ్మ, ఆంటీ,

"ఏంటిదంతా, నాకో ముక్క చెప్పొచ్చు కదా",
అతిగా ఆవేశపడి గుండెనొప్పి తెచ్చుకున్న ఉక్రోశంతో, నేను,
-"చాలా రోజులైందిగా, చిన్న తమాషా చేయాలని....",
శ్వాస వేడి తెలిసేంత దగ్గరగా వొస్తూ తను,

"ఐనా బస్ దిగేప్పుడైనా చెప్పలేదు",రాని కోపం తెచ్చుకుంటూ నేను,
-"ఎలాగూ ఇంట్లో కలుస్తామని", గుండెలపై తలాన్చి,
నొప్పి పోయిందా అని చిలిపిగా అడుగుతూ తను,
పోయిందంటే దూరమౌతుందేమో అని, లేదని నవ్వుతూ నేను,
బైట గంగిరెద్దుల మేళపు సంగీతం మా నవ్వుల్లో శృతి కలుపుతూ......

No comments:

Post a Comment