కవితా మిత్రులకు, నమస్కారం

నా భావాల్ని, భాషని, కలల్ని, కలవరింతల్ని, ఆనందాల్ని, ఆరని తడినీ, ఉద్వేగాల్నీ, ఉద్దేశాల్ని, ఉద్రేకాల్నీ, ఉన్న స్థితిని, మీతో పంచుకొవాలనుకునే నా ఈ చిన్న ప్రయత్నాన్ని ఆదరించి, అభినందిస్తారని, ఆస్వాదించి ఆహ్లాదిస్తారనీ, తప్పిదాలుంటే, దిద్దుకునే అవకాశమిస్తారనీ ఆశిస్తూ, మిమ్మల్ని "కవన వనం"లోకి, ఆహ్వానిస్తూ, మీ వంశీ..

Monday 16 April 2012

ఒంటరితనమంటే.......


ఒంటరితనమంటే.......
నాలో నేనుగా, నాతో నేనుగా
మాట్లాడుకోవడం అనుకునేవాడిని, కానీ
నువ్వు నాతో మాట్లాడకపోవడం అని తెల్సుకున్నాను

ఒంటరితనమంటే.....
నేనొక్కడినే, నాకు నేనై
గడపడం అనుకునేవాడిని, కానీ
నువ్వు నన్ను వెలివేయడమని అర్దం అయ్యింది

ఒంటరితనమంటే,
నిద్ర కూడా దరిచేరని చీకట్లు
ముసురుకోవడమని భ్రమించేవాడిని,
నీ కలల్లో నుండి కూడా, నన్ను
బహిష్కరించడమని అవగతమైంది

ఒంటరితనమంటే
నాకు నేను, కావాలని తెచ్చిపెట్టుకున్న, క్రుత్రిమ
వాతావరణమని సమాధానపడేవాడ్ని
నా తప్పులకు, నువ్వు విధించిన శిక్షల తాలూకూ,
ప్రతిఫలమని సర్దుకుపొవాల్సొస్తుంది..............

ఒంటరితనమంటే,
అందరినీ మర్చిపోయి
నిన్ను మాత్రమే గుర్తుంచుకోగల మానసిక స్థితి
అనుకుని సంతోషపడేవాడిని.......
కానీ,

విషమ విషాద వికల
విభ్రమ విస్ఫుట వైరాగ్య,
వ్యధాభరిత
వృదాసహిత
విశేషమని
ఆవిష్కరించుకోవాల్సొస్తుంది...

No comments:

Post a Comment