సమయమా,
నిన్నలోకి పంపవూ,
రేపటి నా రోజు నీదే, కానీ,
కాసేపు గతంలోకొదిలెయ్యవూ,
చాలిన్నాళ్ళూ చేసింది,
కొన్నాళ్ళైనా నిన్నింకోసారి తడమనీ,
ఆపు నీ ఆరాటం రేపటికై,
గెలవనీ నా నిన్నటి పోరాటం నేటికై,
జవాబుల్లేని ప్రశ్నల్నించి,
నిజంకాని ఊసుల్నించి,
మోసపుచ్చే మాటల్నించి,
పునాదుల్లేని కలల్నించి,
మనసు చచ్చిన క్షణం నుంచి,
మౌనం ముంచిన స్వనం నుంచి,
దూరంగా పరిగెత్తడానికి,
ఒక్కసారి నిన్నలోకి పంపవూ,
కనపడని గమ్యాలకి,
కనుగొనని గమనాలకి,
మర్చిపోయిన నవ్వులకి,
మార్చి పోయిన మనుషులకి,
పోగొట్టుకున్న స్పర్శల ఙ్నాపకాలకి,
ప్రాణంలో కలిసిన తనువుల పరిమళానికి ,
దగ్గరగా నడిచేందుకు, ఒకేఒక్కసారి నిన్నలోకి పంపవూ.....
తేలిక మాటలతో బరువైన భావాలను అంతకన్నా తేలికగా చెప్పే మీ శైలి బావుంది..
ReplyDelete