కవితా మిత్రులకు, నమస్కారం

నా భావాల్ని, భాషని, కలల్ని, కలవరింతల్ని, ఆనందాల్ని, ఆరని తడినీ, ఉద్వేగాల్నీ, ఉద్దేశాల్ని, ఉద్రేకాల్నీ, ఉన్న స్థితిని, మీతో పంచుకొవాలనుకునే నా ఈ చిన్న ప్రయత్నాన్ని ఆదరించి, అభినందిస్తారని, ఆస్వాదించి ఆహ్లాదిస్తారనీ, తప్పిదాలుంటే, దిద్దుకునే అవకాశమిస్తారనీ ఆశిస్తూ, మిమ్మల్ని "కవన వనం"లోకి, ఆహ్వానిస్తూ, మీ వంశీ..

Friday, 6 April 2012

నాకేనా - మీకూనా


ఓ ఆలోచన తడుతుంది,
వెంటనే ఇంకొకటి దాన్ని నెడుతుంది,
కొత్తగా మరోటి పుడుతుంది,
మొదటిదే నయమన్పిస్తుండగా అసలా
ఆలోచన దేనికో మరుస్తున్నా,
మానవ సహజమా, మానసిక అస్పష్టతా,

ప్రతి సంఘటన పాతగా అన్పిస్తుంది,
ఇంతకుమునుపెక్కడో చూసినట్టే కన్పిస్తుంది,
గతమే ఆవృతమౌతుందా,
నేనే గతాన జాగృతమౌతున్నానా,

మనుషులందరు పరిచయస్తుల్లా తెలుస్తున్నారు,
మాటలూ ముందే పసిగట్టేలా ఉంటున్నాయి,
కాకతాళీయమా, కాలపు కనికట్టా....

అందరూ కష్టమనుకునేవి, నాకిష్టమన్పిస్తున్నాయి,
నేనొదులుకున్నవి అందరికీ దారి చూపిస్తున్నాయి,
యాదృచ్చికమా, యోగలక్షణమా....

నా విరక్తిలో తోడురారెవ్వరు,
నా అనురక్తి నీడన నన్ను మరిచిన అందరు,
లోక రీతింతేనా,
నాకే బ్రతకడం రాదా....

2 comments:

  1. మీకే కాదు, నాకు కూడానూ... ;) :)

    "గతమే ఆవృతమౌతుందా,
    నేనే గతాన జాగృతమౌతున్నానా," బావుంది..

    ReplyDelete