కవితా మిత్రులకు, నమస్కారం

నా భావాల్ని, భాషని, కలల్ని, కలవరింతల్ని, ఆనందాల్ని, ఆరని తడినీ, ఉద్వేగాల్నీ, ఉద్దేశాల్ని, ఉద్రేకాల్నీ, ఉన్న స్థితిని, మీతో పంచుకొవాలనుకునే నా ఈ చిన్న ప్రయత్నాన్ని ఆదరించి, అభినందిస్తారని, ఆస్వాదించి ఆహ్లాదిస్తారనీ, తప్పిదాలుంటే, దిద్దుకునే అవకాశమిస్తారనీ ఆశిస్తూ, మిమ్మల్ని "కవన వనం"లోకి, ఆహ్వానిస్తూ, మీ వంశీ..

Monday 2 April 2012

* నా అక్షరాలు *


నా అక్షరాలు.
అగ్నిని భస్మించే అవిశ్రాంత హవిస్సులు,
ఆత్మని రక్షించే అవిరళ తపస్సులు.
అంతరంగావిష్కరణలో అస్పష్ఠ ఆర్తనాదాలు,
అసహజ సహజాతాల సహజ సంవాదాలు

నా అక్షరాలు.
వెన్నెల్లో ఆడుకునే నీ రూపాలు,
నీ కన్నుల్లో నాకోసమెగసే సంద్రాలు.
నేను లేకున్నా నీతో అనగలిగే మాటలు,
నువ్వున్నపుడు చెప్పలేకపోయిన భావాల నీడలు,
నీ వల్ల కలిగిన అనుభూతుల సాక్ష్యాలు,
మనసు మోయలేక బైటికి దూకే సంతోషపు కెరటాలు,
అనుక్షణం నడిపించే నీ పిలిపులు,

నా అక్షరాలు.
ఇన్నాళ్ళూ కనపడని,
ఇక చేరలేనేమో అనుకున్న గెలుపుల ఆహ్వానాలు,
నీ మీద చూపించికోగలిగే చిట్టి కోపాలు,
నన్ను నేను పొగుడుకునే,
నిన్ను నాలో పొదుముకునే,
నాకు నేనే పంపించుకునే,
నీకు నేనందివ్వగలిగే,ఆశల అనుబందాలు.....

2 comments:

  1. బావుంది భావయుక్తంగా.. కానీ, మొదటి పారాగ్రాఫ్కీ, మిగిలిన పారాగ్రాఫ్లకు సమకాలికం కుదరలేదేమో అనిపిస్తుంది. విడివిడిగా చూస్తే వేటికవే బావున్నాయ్.. అన్నిటికన్నా మొదటి పారాగ్రాఫ్ బాగా నచ్చింది నాకు...

    ReplyDelete
  2. మొదటి పారా లోనే బరువైన పదాలు వాడాను, తర్వాత సులభమైనవి వాడాలని, అంతేనండీ, వేరే ఉద్దేశమేం లేదు..:)

    ReplyDelete