కవితా మిత్రులకు, నమస్కారం

నా భావాల్ని, భాషని, కలల్ని, కలవరింతల్ని, ఆనందాల్ని, ఆరని తడినీ, ఉద్వేగాల్నీ, ఉద్దేశాల్ని, ఉద్రేకాల్నీ, ఉన్న స్థితిని, మీతో పంచుకొవాలనుకునే నా ఈ చిన్న ప్రయత్నాన్ని ఆదరించి, అభినందిస్తారని, ఆస్వాదించి ఆహ్లాదిస్తారనీ, తప్పిదాలుంటే, దిద్దుకునే అవకాశమిస్తారనీ ఆశిస్తూ, మిమ్మల్ని "కవన వనం"లోకి, ఆహ్వానిస్తూ, మీ వంశీ..

Saturday, 31 March 2012

"వి" "డు" "ద" "ల"


చలి చేతలకు ముడుచుకున్న
చెలి చేతులనందుకునే ఆనందంలో,
చీకటి చీర చుట్టిన రేయికి
వెలుగుల మాల మోసే ఆరాటంలో,
కళ్ళడిగే కలల కోర్కెలకి
కాలంతో జవాబిప్పించే ఆవేశంతో,
మనుషుల దూరాన్ని మరిపించే
మంత్రాక్షరానికై ఆరాధనతో,
ఉనికిని నమ్మని అందరికీ,
ఉన్నానని తెలియచెప్పే ఆలోచనతో,

కప్పేసిన వల్మీకాన్ని బద్దలు చేసుకుని,
కమ్మేసిన విలయాల భారం దించేసుకుని,
రెప్పవేయని కలత నిద్ర దూరం చేసుకుని,
రెమ్మ దాచిన సుమ సౌరభం శ్వాసలోనింపుకుని,
చెప్పలేని అవలోకనా స్రవంతుల్ని దరికి తీసుకుని,
చూడలేని గతాల గతాల దారికి తోసుకుని,

విడుదలయ్యాడు,
నాలోంచి నేను,
నిన్నలొంచి నేడు.....

1 comment:

  1. విడుదలయ్యాను
    నాలోంచి నేను,
    vidilinchukoni ninnanu..
    ..

    ReplyDelete