కవితా మిత్రులకు, నమస్కారం

నా భావాల్ని, భాషని, కలల్ని, కలవరింతల్ని, ఆనందాల్ని, ఆరని తడినీ, ఉద్వేగాల్నీ, ఉద్దేశాల్ని, ఉద్రేకాల్నీ, ఉన్న స్థితిని, మీతో పంచుకొవాలనుకునే నా ఈ చిన్న ప్రయత్నాన్ని ఆదరించి, అభినందిస్తారని, ఆస్వాదించి ఆహ్లాదిస్తారనీ, తప్పిదాలుంటే, దిద్దుకునే అవకాశమిస్తారనీ ఆశిస్తూ, మిమ్మల్ని "కవన వనం"లోకి, ఆహ్వానిస్తూ, మీ వంశీ..

Wednesday, 4 April 2012

శూన్యం


అప్పుడే బాగుండేది,
ఏమీ తెలీకున్నా ఒకరికొకరం దగ్గరయ్యేది,
ఏదో జరుగుతున్నా అంతా మంచికే అన్పించేది,
ఎవ్వరు జన్మ ముగించినా ప్రాణం పోయినట్టయ్యేది,
ఎవ్వరి తొలి ఊపిరి విన్పించినా గొంతు పాడినట్టయేది,
ఎక్కడ జల్లు తడిపినా ఒళ్ళు పులకరించేది,
ఎందుకు గుండె తడిసినా ఆవిరి చేసే వేడి రక్తం పారేది,
ఎలాగ కాలం కలహించినా, ఓర్చి వేచే ఆశ ఆయుధమయ్యేది,
ఎలాగోలా బ్రతికే జీవితానికి ఇలాగే అని దిశనిచ్చే ధైర్యముండేది,
ఏ చోట అవమానం దులిపేసినా, బాధ పడని నవ్వు అంటి ఉండేది,
ఏ మాత్రం అనుమానం దరిచేరినా, బదులిచ్చే నమ్మకమంటూ ఉండేది,
ఏమిటిదంతా అన్పించినా, "నీకోసమే" అని ఆనందించే వీలుండేది
మరిప్పుడు,
ఏమైనా వినడానికెవరి మాటలు తాకట్లేదు,
ఏదైనా అనడానికెవరి చూపులు తడమట్లేదు,
ఎప్పుడైనా పంచడానికెవరి మనసులు తెరవట్లేదు,
ఏడుపైనా ముంచడానికెవరికీ సమయం తీరట్లేదు,
అంతటా,
శూన్యం, నా లాగే,
శూన్యం, నా లోనే,
శూన్యం, నా తోనే,
శూన్యం,నా నేనే...

1 comment:

  1. మీ సాహిత్యంతో 'శూన్యం'కే ప్రాణం పోసారు...

    ReplyDelete