జాగ్రత్త, ఆకర్షణలుంటాయటు,
ఒక్కసారతికితే అంతే, నీ "అంతే",
చూస్కో, అనుభవాలిస్తాయివి,
నిన్ను మరిచైనా వాటిని స్మరించాలనే భావాలూ వొస్తాయ్,
తలెత్తుకోలేనంత జారిపోగలవ్,
అలవాట్లకలవాటైతే, అలవాటుల్లో పొరపాటైతే,
ఎక్కడా దారి దిగకు,
ఎత్తులెక్కడానికదొక్కటే దారి,
ఎప్పుడూ గమనమాపకు,
ఆపితే ఆగే లోకమెప్పుడో పోయింది,
ఎందుకాగావనెవ్వరో అడుగుతారనుకోకు,
అందరూ మాట కలిపేది గమ్యం కన్పించాకే,
ఎవర్నీ మదిలోకాహ్వానించకు,
మనసనుసరించేది వాళ్ళనే, విడిపోవాల్సొస్తే,
ఏమిటెటో చూస్తున్నావింత చెప్పినా,
నవ్వులాట కాదు నేస్తం,
నీకోసం నువ్వాడే ఆట జీవితం,
ఏదో అవ్వడానికెదురుచూస్తూకూర్చుంటే, ఇంకేదో అవగలవ్
జాగ్రత్త, గెలుపెక్కడో లేదు, నీ ప్రయత్నంలోనే పుడుతుంది,
ఓటమెక్కడికీ పోదు, నీ బలహీనతల్లోనే పడుంటుంది......
No comments:
Post a Comment