కవితా మిత్రులకు, నమస్కారం

నా భావాల్ని, భాషని, కలల్ని, కలవరింతల్ని, ఆనందాల్ని, ఆరని తడినీ, ఉద్వేగాల్నీ, ఉద్దేశాల్ని, ఉద్రేకాల్నీ, ఉన్న స్థితిని, మీతో పంచుకొవాలనుకునే నా ఈ చిన్న ప్రయత్నాన్ని ఆదరించి, అభినందిస్తారని, ఆస్వాదించి ఆహ్లాదిస్తారనీ, తప్పిదాలుంటే, దిద్దుకునే అవకాశమిస్తారనీ ఆశిస్తూ, మిమ్మల్ని "కవన వనం"లోకి, ఆహ్వానిస్తూ, మీ వంశీ..

Monday, 9 April 2012

ఆవాహన


నేనో నియాండెర్తల్ కీటకాన్ని,
నియో హ్యూమనైజ్డ్ కవాటం
తెరుచుక్కూర్చున్న క్రోటన్ మొక్కని,
మనసుల్లో ఖాలీల్ని ఎడారి ఇసుకతో నింపుకుని,
ఆశల కోర్కెల విత్తనాలేసి, రోజూ
వాటిని కన్నీటితో తడమలేక తడుపుతూ,
వర్షించే మేఘం కనపడితే, కొల్లగొట్టడానికెదురు
చూసే మెక్సికన్ రెడిండియన్ని,
మధ్య ఆఫ్రికా అమానవీయ ఆదివాసీ ని,

కడుపు దాహాన్ని సంద్రంతో ముంచుకుని,
అడుగునేలని మిగల్చకుండా పంచుకుని,
దప్పిక తీరక చమురునీ,
నేల చాలక చంద్రుణ్ణీ చూసే,
పులిచారల్ని హోమోసెపియన్ గా కప్పుకున్న,
సామ్రాజ్య వాద స్వార్ధాన్ని,
సామ్యవాద బలహీనతని,

మనుషుల్ని చంపే నందిగ్రాంలను,
దేవుడ్ని దింపే సాలిగ్రామాలను,
బెస్ట్ బేకరీలో మాడిన రొట్టె ముక్కల్ని,
గోద్రా రైల్లో వాడిన చర్మపు తుక్కుల్ని,
ఒకేలా చూడగల దిష్టి బొమ్మని,

గాంధారంలో తథాగతుణ్ణి గతంగా మార్చిన "విధ్యార్ధిని",
స్వస్తిగ్గుర్తుల్తో తథాస్తంటూ క్యాంపులు రాల్చిన విగత వేషాన్ని,
క్రూసేడ్లంటూ పవిత్ర యుధ్దం చేసిన శాంతిని,
కోనేట్లో మునిగి రక్తం కడుక్కుంటున్న అశాంతిని,
స్మశాన శైథిల్యంలో కైవల్యించిన విస్మృతిని,
విషాద నైర్మల్యానికి కైమోడుస్తున్న వికృతిని,

అర్ధానికే తప్ప పరమార్ధానికి విలువివ్వని
కార్పోరేట్ కల్చర్డ్ కాగితాన్ని,
స్వార్ధానికే తప్ప, స్వాభిమానానికి వలువివ్వని
డెస్పరేట్ కలర్డ్ ఇంగితాన్ని,
బలానికే తప్ప బంధానికి బానిసవ్వని
స్మార్ట్ టెంపర్డ్ సంగీతాన్ని,
కులానికే తప్ప కాలానికి బాసటవ్వని
సిగ్గు లేని నిజాన్ని,

అందుకే
రానీ ప్రళయం, కానీ జగం లయం,
పొనీ సకలం, తేనీ మరో శకం,
అప్పుడైనా,
నేను "మనిషి"గా ఉంటానేమో,
నేనూ "మనిషి"నే అంటానేమో....

No comments:

Post a Comment