కవితా మిత్రులకు, నమస్కారం

నా భావాల్ని, భాషని, కలల్ని, కలవరింతల్ని, ఆనందాల్ని, ఆరని తడినీ, ఉద్వేగాల్నీ, ఉద్దేశాల్ని, ఉద్రేకాల్నీ, ఉన్న స్థితిని, మీతో పంచుకొవాలనుకునే నా ఈ చిన్న ప్రయత్నాన్ని ఆదరించి, అభినందిస్తారని, ఆస్వాదించి ఆహ్లాదిస్తారనీ, తప్పిదాలుంటే, దిద్దుకునే అవకాశమిస్తారనీ ఆశిస్తూ, మిమ్మల్ని "కవన వనం"లోకి, ఆహ్వానిస్తూ, మీ వంశీ..

Saturday 7 April 2012

ఘోష


నేనిప్పటికైదుగుర్ని చంపాల్సొచ్చింది,
మా పెద్దోళ్ళింకా ఎక్కువే చేసుంటారు,
లెక్కలేస్కోడానికవి జననాలా, హననాలాయె,,
చంపడానికెవరికైనా ఏదో కారణముండాలి,
చావడానికెలాగూ చేసుకున్న పాపం తోడైతుంది,
కానీ, ఎవర్ని, ఎందుకు చంపుతున్నానో తెలీదు,
ఎనిమిదేళ్ళుగా, "తలారి"ఐనప్పట్నించి,

జాలేసింది,మొదటిసారి,
చావబోయే కళ్ళలోకి చూసినపుడు,
వాడెంత క్రూరుడో తెల్సినా,
ఆ ధైర్యం చేయలేదింకెపుడూ,
గొంతునలంకరిస్తున్న నెయ్యి పూసిన తాడు,
యముడు విసిరే పలుగులా,
ఎప్పుడో తిన్న నెయ్యి వాసనొస్తుండగా,
సన్నగా ఏడుపు కాపాడమంటూ ,
నన్నా క్షణం దేవుడ్ని చేస్తుండగా,
కింద మృత్యుద్వారం తెరుచుకోడమో,
కాళ్ళు గిలగిలా తన్నుకోడమో,
ఏది ముందో గుర్తులేదు....

తాడు వదులై, ప్రాణం బరువు కలిసి,
థైరాయిడ్ కిందెముకని
విరగ్గొట్టే శబ్దమింకా విన్పిస్తూనే ఉంది,
మెదడుకి రక్తమాగి జీవి పోతుందని తర్వాత్తెలిసింది,
ఇంత దగ్గరగా చూసినందుకేమో
భయంపోయింది చావంటే,
కానీ, రేపు నేను చంపబోయే
నా కొడుగ్గుర్తొస్తే,
భయం బాధా కాని ఉద్వేగమేదో అన్పిస్తుంది ,
వాడూ నాకొకటే చెప్పాడు,
"బూటకపు ఎన్కౌంటర్ కంటే,
నీ చేతుల్లో పోవడమే నాకు గెలుపు, విప్లవానిక్కూడా,
లాల్ సలామ్ కామ్రేడ్".....

2 comments:

  1. తలారులు అనుభవించే మానసిక క్షోభ, వారి ఆత్మ "ఘోష" బాగా వినిపించారు.. విప్లవకారుడైన కన్న కొడుకుని ఉరితీసే పరిస్థితిలో ఆ తండ్రి తాను కూడా ఒక విప్లవకారుడిలా స్పందించటం నిజంగా అద్భుతంగా ఉంది...

    ReplyDelete