కవితా మిత్రులకు, నమస్కారం

నా భావాల్ని, భాషని, కలల్ని, కలవరింతల్ని, ఆనందాల్ని, ఆరని తడినీ, ఉద్వేగాల్నీ, ఉద్దేశాల్ని, ఉద్రేకాల్నీ, ఉన్న స్థితిని, మీతో పంచుకొవాలనుకునే నా ఈ చిన్న ప్రయత్నాన్ని ఆదరించి, అభినందిస్తారని, ఆస్వాదించి ఆహ్లాదిస్తారనీ, తప్పిదాలుంటే, దిద్దుకునే అవకాశమిస్తారనీ ఆశిస్తూ, మిమ్మల్ని "కవన వనం"లోకి, ఆహ్వానిస్తూ, మీ వంశీ..

Monday 9 April 2012

"క్రాస్ రోడ్స్"


దార్లెక్కువున్నా కష్టమే,
ఏ దారో వెతుక్కోడానికి,
గమ్యం కనపడ్తున్నా, నష్టమే,
తొందరేముందని, అడుగేయడానికి,

ఎం.టెక్ చేసి. లక్షలు సంపాదించినంత కాలం,
నేనేం చేసినా ఓ అద్భుతం,
నేనేం గీసినా, ఓ అపూర్వం,
నాలో కవికి కళ్ళాపి జల్లి. ముగ్గులేసారు,
నా ఆలోచనని, కళ్ళాపి చూసి మూగపోయారు,

ఎక్కడో మంచు దేశం, జలుబొచ్చి తుమ్మితే,
మన దేశంలో బలుపొచ్చి కమ్మితే,
ఉద్యోగానికి రెక్కలు,
ఇంటికి అప్పులూ మిగిలాయ్,

ఆశ్చర్యం,
ఇప్పుడు నేనేం రాసినా, దండగట,
నేనేం చూసినా ఎందుకట,
కవిగాడిక్కాళ్ళిరగ్గొట్టి మూలన్తోసి,
ఆలోచనల్ని ఆ లోచనాల్లోనే మూతేసి,

ఐనా,
"సంపాదన్లేనోడికి సాహిత్యమెందుకోయ్,
నువ్ లేకపోతే సారస్వతమేం చావదు,
తెలుగు పుస్తకాలింకా చదువుతున్నారా,
ఇంగ్లీషోడి స్థాయినెలాగూ అందుకోలేవ్,
జేమ్స్ జాయిస్ "యులిసిస్" లాంటిదొక్కడ్రాసాడా,
జేమ్స్ బాండ్ స్థాయున్న ఒక్క పాత్రైనా మనకుందా,
చేతిరాతలన్నం పెట్టవోయ్,
నీ తలరాతకి తగ్గట్టు మారాలంతే,
ఎంతసేపిలా ఉంటావీ క్రాస్ రోడ్స్ లో,
నువ్వెక్కాల్సిన బస్సెప్పుడూ నీకోసమాగదు,
చూడాల్సిన ఉషస్సూ, రాక ఆగదు,
ఎవరిమీదా కోపం, ఎందుకా ఏడుపు"
అంతర్వాణికీ అలుసైపొయా,

అన్నీ పోయాక ఇంకేముంది కోల్పోడానికి,
కన్నేమూసాక ఎదురేముంది భయపడ్డానికి,
ఏళ్ళుగా కూరుకున్న బావి ఎండినట్టై,
చాన్నాళ్ళుగా పేరుకున్న భావాలు పండినట్టై,
రాస్తున్నానీ చివరి రాతలు,
చెదిరిస్తున్నా చెదల ఛాయలు,
చిదిమేస్తున్నా చీడల నీడలు,
చిగురించే రేపటి నిజాలుగా
మారడానికి,
చూడడానికి.....

No comments:

Post a Comment