కవితా మిత్రులకు, నమస్కారం

నా భావాల్ని, భాషని, కలల్ని, కలవరింతల్ని, ఆనందాల్ని, ఆరని తడినీ, ఉద్వేగాల్నీ, ఉద్దేశాల్ని, ఉద్రేకాల్నీ, ఉన్న స్థితిని, మీతో పంచుకొవాలనుకునే నా ఈ చిన్న ప్రయత్నాన్ని ఆదరించి, అభినందిస్తారని, ఆస్వాదించి ఆహ్లాదిస్తారనీ, తప్పిదాలుంటే, దిద్దుకునే అవకాశమిస్తారనీ ఆశిస్తూ, మిమ్మల్ని "కవన వనం"లోకి, ఆహ్వానిస్తూ, మీ వంశీ..

Friday, 20 April 2012

*ముసిలోడు*


పెద్దమ్మ గుడి, జుబ్లీ హిల్స్,
పేదోళ్ళ దేవత, పెద్దోళ్ళ ఊరిలో

ఆసరాకి దూరంగా,
అనారోగ్యానికి దగ్గరగా,
3రోజులుగా చెయ్యి పడని సత్తు పళ్ళెంతో,
దాచుకున్న చిల్లర, దోచుకోబడ్డ ఖాలీ జోలెతో,
రేపో,ఎల్లుండో అన్పించే ముసిలి తాత,
"చెప్పులు విడుచు స్థలం" బోర్డ్ ముందు,,

ఆగిన B.M.W ,
దిగిన పేరుమోసిన సినీ నిర్మాత, రెండో కుటుంబంతో సహా,
ముసిలోడ్ని చూసి నవ్వి,

అభిశేకమయ్యాక హుండీలో దూకిన
రెండు నోట్ల కట్టలు, ఆనందంగా చేసిన
పాపాలకు, అర్జీ పెట్టుకున్నాయి

వెళ్ళిపోతూ ముసిలోడి కంచంలో,
విడవలేక విడిచిన 2 రూపాయల బిళ్ళ,
గిరగిర తిరుగుతూ ఙ్నాపకాల్ని గుర్తుకు తెస్తూ

"20 ఏళ్ళ క్రితం,, తల్లిలాంటి పొలమమ్మి, నిన్ను నమ్మి
సినిమా తీయకపోయుంటే, ఇవాళ నువ్విక్కడుండేవాడివి కదరా"
ఖాళీ పళ్ళాన్ని కన్నీళ్ళతో నింపుతున్న ముసిలోడి స్వగతం,

కాసేపయ్యాక, ఆగిన ఇంకో పెద్ద కారు,
ప్రముఖ నటుడు, ముసిలోడ్ని చూసీ చూడనట్టు నటిస్తూ,
పుణ్యం పెంచుకోడానికి గుళ్ళోకెడుతూ,

పక్క టీ కొట్లో, ఆ నటుడి నీతి పాట,
"నమ్మినోణ్ణి ముంచినోడు, ఎప్పటికైనా మునుగురా
వాడి పని పట్టుటకై, ఎవడో ఎక్కడో పుట్టునురా"

ముసిలోడి ముఖంలో చిర్నవ్వు, పుష్కరం తర్వాత...........

No comments:

Post a Comment