కవితా మిత్రులకు, నమస్కారం

నా భావాల్ని, భాషని, కలల్ని, కలవరింతల్ని, ఆనందాల్ని, ఆరని తడినీ, ఉద్వేగాల్నీ, ఉద్దేశాల్ని, ఉద్రేకాల్నీ, ఉన్న స్థితిని, మీతో పంచుకొవాలనుకునే నా ఈ చిన్న ప్రయత్నాన్ని ఆదరించి, అభినందిస్తారని, ఆస్వాదించి ఆహ్లాదిస్తారనీ, తప్పిదాలుంటే, దిద్దుకునే అవకాశమిస్తారనీ ఆశిస్తూ, మిమ్మల్ని "కవన వనం"లోకి, ఆహ్వానిస్తూ, మీ వంశీ..

Monday, 30 April 2012

నేటి ప్రపంచం


స్టార్ హోటళ్ళకు అరగని అన్నం,
పేద ఆకలికి అందని గ్రాసం,

బట్టలు చింపుకు తిరిగే యువత,
చిరుగుల బట్టలు దొరకని భవిత,

ఓడలాంటి కారులున్న దొరలు,
ఒడలు విరిచి పనిచేసే జనులు,

నిద్ర రాక చలి పెంచుకునే మనస్తత్వాలు,
పెరిగిన చలికి రాలిపోయే జవసత్వాలు,,

చిన్న గాయానికి పెద్ద మందేసుకునే రూపాయి నోట్లు,,
రక్తమోడే దెబ్బల్ని నవ్వుతూ తట్టుకునే చిరిగిన ఓట్లు,,

మదుపే తప్ప, వ్యయాన్ని అదుపు చేయలేని "ఉన్న"మనుషులు,
ద్రవ్యోల్బణానికి మెదడు వాచిన "చిన్న"మనసులు,

దారిద్ర్యరేఖకు పైన కన్పించే ఆకాశహర్మ్యాలు,
దరిద్రుల పాతాళంలో, చెట్టు గాలికి కూలిపోయే పూరిగుడిసెలు,

అత్యాశ కాటేసిన విచ్చలవిడి గొప్ప జీవితాలు,
ఆశల్ని కాజేసిన వలస కూలీల రోజువారీ జీతాలు,
చూసాను, ఇవన్నీ,
కరిగిన కన్నీటి సాక్షిగా, ఆగిన గుండెల సాక్షిగా........

Sunday, 29 April 2012

పార్టీ


ఓటు హక్కు రాకముందే,
ఓడ్కా రుచికి,
మారిజువానా మత్తుకి,
గర్భ విఛ్చిన్న మాత్రలకి,
ప్రాణ హరణ పరికరాలకి, అలవాటైన
రేపటి పౌరులు,
జనారణ్యానికి దూరంగా, నిజారణ్యానికి చేరువగా,
న్యూ ఇయర్ సంబరాల్లో,

మైకమెక్కువై, విచక్షణ తక్కువై,
చిన్న గొడవ చేజేతులా పెద్దదై
ఉన్మాదంతో అందర్నీ చంపి, భయంతో తనూ చచ్చిన
ఒక ఆత్మ సృష్టించిన నిశ్శబ్దంలో,

ఒక్కసారే మోగిన అందరి ఫోన్లు,
"నూతన సంవత్సర శుభాకాంక్షలు" మెస్సేజ్లతో,
బూడిద రాలుస్తున్న సగం కాలిన మార్ల్ బోరో,ఆష్ ట్రేలో.......

Saturday, 28 April 2012

AP 10 AB @#$*


వందల వేలు పోసి కొన్నా,
వెండి వర్ణపు వెర్నా కారు,
వెతికినా దొరకలేదు చాన్నాళ్ళు,
వెయ్యిచ్చి ఫిర్యాదిచ్చా,
విసుగుపుట్టి వొదిలేసా,

నగరంలో నాలుగు పేలుళ్ళు,
నగల కొట్లో భార్యా,పిల్లాడు హతం,
నా పోయిన వెండి వెర్నా దొరికింది
"బాంబ్ పేల్చి".....

Friday, 27 April 2012

అనిమేష*


"నాన్నా, నాకీ పేరెందుకు పెట్టావ్,
అడిగింది టీచర్,
ఆటపట్టిస్తున్నారు ఫ్రెండ్స్, నోరు తిరగట్లా నాకే",,
కోపంగా నా ఎనిమిదేళ్ళ కూతురు......

"పంతులు గారు జన్మనామం కాదని చెప్పినా
వినకుండా, ఆ పేరు పెట్టారు మీ నాన్న"
వాళ్ళ అమ్మమ్మ పేరెందుకు పెట్టలేదని
అపుడపుడు గుర్తుకు తెచ్చే మా ఆవిడ,

"అవున్రా, నేనూ అడగాలనుకున్నా
ఎప్పటినుంచో, ఆ పేరుకర్ధం",
శాస్త్రం అనుసరించలేదని అప్పట్లో రెణ్ణెల్లు మౌనవ్రతం పట్టిన నాన్న,

డాడీ, చెప్పు, నా పేరుకర్ధం ఏంటి

"ఏం చెప్పను,దేవత లాంటి నిన్ను మరవలేక
దానికాపేరు పెట్టాననా,
నాకిష్టమైన నీ పేరూ అదే అనా" ఆలోచిస్తూ నేనూ......

Thursday, 26 April 2012

అమృతం కురవని రాత్రి

"ఇంకా బేరం దొరకలేదా, పన్నెండు దాటింది,
చలికాలం, ఇప్పుడెవడొస్తాడు,
అసలే పోలీసుల దోపిడెక్కువైంది "అసళ్ళ"కోసం,
పక్కనే లాడ్జుంది" ఎరుపెక్కిన కళ్ళతో,
మందెక్కనపుడు "అక్కా" అనే పది పదిహేనేళ్ళు చిన్నైన ఆటో డ్రైవర్,

చీకటెంత వాడ్నైనా చెదిరిస్తుందా,
" ఏడ్చా, కట్టుకున్నోడు కాసులకమ్మి పోతే,
బాగుందిపుడే, కాల్చుకుతినే మొగుడు లేడు,
కానీ దాన్నింట్లో వొదిలేసొస్తున్నా రాత్రిళ్ళు,
గతం తవ్వేవారే అంతటా, గౌరవంగా బ్రతకాలనున్నా,
పాలైనా తాగించాలి దానికివాళ,
మూడ్రోజులైంది మట్టి కుండ ఎండి"
కోపంగా చూసేసరికి తిట్టుకుంటూపోయిన ఆటో.

"ఎండకి కరిగే మంచు కురిసేంలాభం,
ఎప్పటికీ నిలిచే మంచి మిగలనపుడు,
తిలక్ అన్నట్టు, ఆ అమృతమేదో కురిస్తే,
దోసిల్నిండా పాపకి తాగిద్దును,
బ్రతకడానికి రోజూ చావడం తప్పేదపుడు,,
కడుపు కాలుతున్నా, కదిలించింది పోలీస్ జీప్,
అంత గాభరాగా ఇంటికెపుడూ రాలేదు,
ఇంకా అవసరం లేదనీ తెలీదపుడు,

నోట్లో నురగలు, కదలకుండా పడున్న నా ప్రాణం,
కళ్ళు తెరిచే ఉన్నాయి, ఏదో చెప్తున్నట్టు,
సగంతాగిన పాల రంగులో ఉన్న ఫినాయిల్ సీసా, పక్కనే,
నా కోసం మిగిల్చినట్టుంది,
అమృతం కన్పించింది.............

Wednesday, 25 April 2012

ఎప్పట్లాగే *


గంటలు రోజులౌతున్నాయి,
పూటలు మాసాలౌతున్నాయి,
ఋతువులు చక్రభ్రమణం చేస్తున్నాయి,
నేనలాగే ఉన్నాను, నువ్ కన్పిస్తావేమో అని
అక్కడే ఉన్నాను, మళ్ళీ చూడలేనేమో అని,

రైలుపట్టాలు పరిగెడ్తున్నాయి, పలకరించుకోకుండా,
గోరింక వర్ణ వైరుధ్యం పట్టించుకుంటుంది, చిలుక,
ఎండిన చెట్టు చూసి వెనక్కి మరలింది, వసంతం,
నేనందరినీ అడుగుతున్నాను, "నువ్వెక్కడని',
నన్నందరూ తరుముతున్నారు ,"నేనెవరని",,
అద్దం అడ్డంగా తలూపింది, నన్నో అపరిచితుణ్ణి చేసి,

రేపు బ్రతిమిలాడుతుంది తనలోకి రమ్మని,
గతం ఆటాడిస్తూంది, నీ ఆచూకీ ఇస్తా అని,
నేడు నవ్వుతుంది, ఇంకో పిచ్చోడు తయారవబోతున్నాడని,,
అందరి నోర్లు మూయించాను, నువ్వొక్కసారి కనపడగానే,
నా నోరే మూయించావు, ఎక్కడ బైటపడతానో అని,
నా ఊపిరాపింది, నీ ఊహించని మార్పు,
తప్పుకోమంటూ, తప్పలేదంటూ, జాలిగా నీ కళ్ళు,
తప్పు నాదే అనుకుంటూ, నీ చూపు తప్పించుకుంటూ, వేగంగా నా కాళ్ళు.........