కష్టమైనా, ఇష్టంగా
నిన్ను గర్భంలో దాచే కారుణ్యం
నువ్ లోకం చూసేవేళ, నొప్పిని
నవ్వుతో కప్పేసే ఔదార్యం
నిన్నెలా పిలిస్తే పలుకుతావో, పసిగట్టే
నైపుణ్యం
నీకెలా మాటలు నేర్పాలో తెలిసిన శబ్దం
నీ ప్రతి కదలికా, అపురూపంగా
చూసే నేస్తం
నువ్ పరిగెడుతుంటే,పదిమందికి
చెప్పుకుని మురిసే పిచ్చితనం
గారం పెంకితనమైతే, చిన్నగా
దండించే బెత్తం
ఏ కాస్త బడలికైనా, చిటికెలో
తీసేసే హస్తం
నీకేం కాకుండా, పాదానికి
దిష్టిచుక్క పెట్టే చాదస్తం
నువ్ తినేదాకా, ఖాళీ
కడుపుతో నిన్నాడించే మాతృత్వం
అడగ్గానే, పోపులడబ్బాని, డబ్బుగా
మార్చేసే మంత్రం
అడక్కుండానే అన్నీ ఇచ్చే దైవం
నీ తప్పులకి, నాన్న
కోపానికి బలయ్యే త్యాగం
నీ విజయాలలో, భాగం
అడగని ఙ్నానం
తన మనసు కష్టపెట్టినా, పల్లెత్తు
మాటనని మౌనం
నీకేదైనా జరిగితే, ఎందాకైనా
పోరాడే ధైర్యం
నీ తలరాతను, మార్చి
రాయగలిగే బ్రహ్మత్వం
సర్వ శాస్త్ర సారాన్ని, ఒడిలోనే
నేర్పించగల తత్వం
తన బాధలు నీకెప్పటికీ తెలియకూడదనుకునే సంస్కారం
తన ఆయుష్షు కూడా నీకే పోసివ్వగలిగే అమృతత్వం
*వంశీ*
No comments:
Post a Comment