ఆర్.టీ.సీ క్రాస్ రోడ్, 8
pm
సుదర్శన్ థియేటర్ ముందు
రాంగ్ రూట్లో పోవడమేం సరదానా,
సివిక్ సెన్స్, కామన్సెన్స్
ఉన్న చదుకున్నోడికి,
హాస్పిటల్లో ఎవరికో అరుదైన బ్లడ్ గ్రూప్ అవసరమైతే,
ప్రాణం విలువా, ఏదో
మూల పక్కోడి చావు,
తప్పించాలనే ఆరాటం,
కానిస్టేబుల్, మొన్నే
టెంత్ పాసైనట్టున్నాడు,
"బండి పక్కకాపి
సార్ దగ్గర్కి నడువ్, పో"
పిడికిలి బిగిసినట్టైంది ఏకవచనానికి,
మరో వందేళ్ళైనా, జనాలకి
పోలీసంటే, గౌరవమెలా
ఉంటుంది,
సార్ అనబడే, ట్రాఫిక్
ఎస్సై,
నోట్లో మానిక్ చంద్,
జీప్ డాష్ బోర్డ్ మీద, ఫిల్టర్
లేని సిగరెట్లు,
మెడ చుట్టూ రుమాలుతో,
తప్పిదానిక్కారణం చెప్తున్నా, వినిపించుకోలేనంత
బిజీ గా,
ఎవడితో ఎవడు ఏం మాట్లాడుతున్నాడో,
ఎవడికీ అర్ధం కాని, వాకీ
టాకీ పౌనపున్యం
పైకీ, కిందికీ
చేస్తూ,
రేడియోకీ, దానికీ, మౌలిక
తేడా ఏంటా అనాలోచిస్తూ,
సగం పేను కొరికిన తల గోక్కుంటూ, ఆవలిస్తూ,
"రాంగ్ సైడ్, చలాన్ 400 ఐతది, రాయకపోతే"....
సార్, అంత
డబ్బు లేదు, హడావిడిగా
బయల్దేరా,
ఒకరికి బ్లడ్ అవసరమంటే,
సాక్ష్యంగా చదువిప్పించిన ఐడెంటిటీ కార్డ్ ని
నగ్నంగా నిలబెడ్తూ నేను....
నన్నో పక్కకి తోస్తూ, మరో
కానిస్టేబుల్,
ఆ సార్ చెవిలో
విశ్వ రహస్యమేదో గుట్టు విప్పుతున్నంత తీక్షణంగా,
ఎవరో ప్రముఖ పార్టీ యువజన నాయకుడి
చెంచాలు ముగ్గురు, వాహనానికీ
తాగించి,
సిగ్నల్ జంప్ చేసారట,
ఎస్సై క్షణం లో, ముఖాన్ని
వీర విధేయతలో ముంచేసి,
గార పట్టిన పళ్ళికిలిస్తూ, చెంచా
చేతిలో చెయ్యేసి,
"హి హి హి, నమస్తే, అన్న
ని అడిగినట్టు చెప్పున్రి"...
మరో పది నిమిషాల పాటు,
నిర్ధాక్షిణ్యంగా, నిర్మొహమాటంగా,
నిర్లజ్జ గా, నిస్సిగ్గు
గా,
మూడు సింహాల కళ్ళు, చెవులు, నోరు
మూసి,
చొక్కా మీది నక్షత్రాల్తో వీపు గోక్కుంటూ,
ప్రజల పర్సు బరువు తగ్గిస్తూ, ఖాకీ
కాకులు,
ఫోన్ మాట్లాడుతూ, కన్నీళ్ళు
మిగుతున్న ఎస్సై ,
థలస్సీమియా కొడుక్కి, అవసరమైన
రక్తం అందక,
బ్రతికి "పోయాట్ట",
దొంగ నా కొడుకులసలే మెసలే ధూర్తలోకంలో,
రోజూ చావలేక,
ఖాకీ చూపులు, తడి
తడుపుకుని,
"అవునా"
అన్నన్నడుగుతూ,
మబ్బులు మసకై మొండి వసంతం మిగిలినట్టు,
మొదలవని మార్గంలో, ముందే వికాసం
మూగపోయినట్టు,
ట్రాఫిక్ సిగ్నల్ వెలిగించిన,
గ్రీన్ లైట్ చూపిస్తూ నేను,
జరిగిందానికి నా తప్పెంత అనడుగుతూ...
No comments:
Post a Comment