కవితా మిత్రులకు, నమస్కారం

నా భావాల్ని, భాషని, కలల్ని, కలవరింతల్ని, ఆనందాల్ని, ఆరని తడినీ, ఉద్వేగాల్నీ, ఉద్దేశాల్ని, ఉద్రేకాల్నీ, ఉన్న స్థితిని, మీతో పంచుకొవాలనుకునే నా ఈ చిన్న ప్రయత్నాన్ని ఆదరించి, అభినందిస్తారని, ఆస్వాదించి ఆహ్లాదిస్తారనీ, తప్పిదాలుంటే, దిద్దుకునే అవకాశమిస్తారనీ ఆశిస్తూ, మిమ్మల్ని "కవన వనం"లోకి, ఆహ్వానిస్తూ, మీ వంశీ..

Tuesday 26 June 2012

ప్రేమంటే*



కోరికల కౌగిలింత
తన్మయత్వాల పులకరింత
చిరుచూపుల దాగుడుమూతలు
చిగురాశల పువ్వుల పాటలు
నిరీక్షణల గుండె తడి
వీక్షణాన మోగే సవ్వడి

నిద్ర దూరం చేసే మెలకువ
నిన్ను దగ్గర చేసే వేకువ
ఏకాంతాన జ్వలించే విరహాలు
ఉదయాన్ని చూడని రాత్రులు
తెలిసీ, కావాలనుకునే బలహీనత
తెలియకుండా వశపర్చుకునే వ్యామోహం

తొలి స్నేహాల తొలకరింత
మలి బాంధవ్యాల పలకరింత
మనకోసం ఒకరున్నారనే ప్రేరణ
మనమొకరికి కావాలనే భావన
చెప్పలేని ఊసుల జల్లులు
చూపలేని అనుభూతుల రూపాల రంగులు నిండిన హరివిల్లులు
తనకోసం ఏదైనా చేయాలనే ఆరాటం
ప్రతిరోజూ సరదాగా సాగిపోయే కోలాటం

కావాలని తనని ఉడికించే ప్రయత్నం
తర్వాత తనని ప్రసన్నం చేసుకునే ప్రమాదం
తను స్పందిచకపోతే కలిగే యాతన
తన బాధలు నావిగా భావించే వేదన

అందరికీ తెలిసిందే, ఐనా
ఎవ్వరికీ అర్దం కానిదే..........

No comments:

Post a Comment