కవితా మిత్రులకు, నమస్కారం

నా భావాల్ని, భాషని, కలల్ని, కలవరింతల్ని, ఆనందాల్ని, ఆరని తడినీ, ఉద్వేగాల్నీ, ఉద్దేశాల్ని, ఉద్రేకాల్నీ, ఉన్న స్థితిని, మీతో పంచుకొవాలనుకునే నా ఈ చిన్న ప్రయత్నాన్ని ఆదరించి, అభినందిస్తారని, ఆస్వాదించి ఆహ్లాదిస్తారనీ, తప్పిదాలుంటే, దిద్దుకునే అవకాశమిస్తారనీ ఆశిస్తూ, మిమ్మల్ని "కవన వనం"లోకి, ఆహ్వానిస్తూ, మీ వంశీ..

Sunday, 24 June 2012

* నేను *



కాసేపు లోయలో కూరుకుపోతున్నా,
అంతలోనే పర్వతాలపై కన్పిస్తున్నా
భూమి చుట్టూ ప్రదక్షణాలు చేస్తున్నా
బుధ్ది తెచ్చుకు చూస్తే, నా గదిలోనే ఉంటున్నా
అపుడపుడు మెరుపులకి మెరుగులద్దుతున్నా
పిడుగుల పిడికిలి దెబ్బ రుచి చూస్తున్నా
చెట్ల పూవుల గుండెల మాటలు వింటున్నా
పొదల మాటున నక్కిన నాగులకు ఫలహారం ఐతున్నా
ఐనా ఇదే బాగుందన్పిస్తుంది..........

సంద్రం లోతు తెల్సుకోవాలని దూకుతున్నా
కళ్ళు చూపించే కలల ఎత్తులు ఎక్కలేక జారి పడుతున్నా
ఆలోచనల చలనాల వెనక పరిగెత్తలేక పరుగాపుతున్నా
ఆవేశాల వేషాలకు అతీతున్ని కాలేక దొరికిపోతున్నా
పుట్టుక దేనికీ తొలి ఆరంభం కానట్టే, మరణం దేనికీ మలి ముగింపు కాదని
తెలుసుకుంటున్నా..........
ఐనా ఇదే బాగుందనిపిస్తుంది.......
ఇలాగే ఉంటే బావుండనిపిస్తుంది .........

తమస్సులో, తపస్సులో, యశస్సుకై అన్వేశిస్తూ
నభస్సులో, శిరస్సుపై జారే గంగా ప్రవాహానికై ఆలాపిస్తూ
ఉశస్సులో, మనస్సులో జ్వలించే అగ్నిని తట్టుకుంటూ.................
ఐనా ఇదే బాగుందనిపిస్తుంది........
ఇలాగే ఉంటే బావుండనిపిస్తుంది....

చెట్లు మోడైతున్నాయి
నీళ్ళు మలినమవుతున్నాయి
ఆవాసాలు మృగ్యమైతున్నాయి
ఆత్మీయతలు మ్లానమైతున్నాయి
నిజమేనా, నాకే అలా అనిపిస్తుందా

దేవుడు మూర్చపోయాడు
దయ్యం మీసం తిప్పుతుంది
ప్రకృతి ముసలిదైంది
ప్రపంచంలో ముసలం పుట్టింది
నిజమేనా, నేనే అలా అనుకుంటున్నానా

ప్రేమ స్వార్ధం అయింది
ప్రాణం చచ్చిపడుంది
నవ్వులు విషం చిందుతున్నాయి
పువ్వులు కన్నీరు రాలుస్తున్నాయి
నిజమేనా, మీకూ ఇలా అనిపిస్తుందా

నువ్వు లేని లోకంలో.
నిశ్శబ్దం...నా శబ్దం
నిర్వేదం....నా వేదం
నిస్సారం... నా సర్వం
నిస్తేజం.... నా నేస్తం

నిన్ను చూసిన క్షణం,
నా శబ్దం....విస్ఫోటనం
నా వేదం....నీ ధ్యానం
నా సర్వం..... నీ స్తోత్రం
నా నేస్తం....నీ స్నేహం

నువ్వు నన్ను వీడిన నిమిషం,
కంటికి బరువైన కన్నీరు
మనసుకి కరువైన శాంతి
ఎంతకీ ఆగని ఆలోచనలు
ఎవ్వరికీ చూపలేని గాయాలు

నువ్వు నన్ను చేరిన సమయం,
కన్నీటికి సెలవన్న కళ్ళు
శాంతులు కొలువున్న మనసు
అలోచించడమే మర్చిపోయి
గాయాలకి కారణమైన నీ తీపి ఙ్నాపకాలలో,

నువ్వు నాలో నిండిన వేళ,
ప్రాణంతో పని లేదు
మరణం చేరుకోదు
సంతోషం వీడిపోదు
ఎర్ర గులాబి వాడిపోదు..........

No comments:

Post a Comment