కవితా మిత్రులకు, నమస్కారం

నా భావాల్ని, భాషని, కలల్ని, కలవరింతల్ని, ఆనందాల్ని, ఆరని తడినీ, ఉద్వేగాల్నీ, ఉద్దేశాల్ని, ఉద్రేకాల్నీ, ఉన్న స్థితిని, మీతో పంచుకొవాలనుకునే నా ఈ చిన్న ప్రయత్నాన్ని ఆదరించి, అభినందిస్తారని, ఆస్వాదించి ఆహ్లాదిస్తారనీ, తప్పిదాలుంటే, దిద్దుకునే అవకాశమిస్తారనీ ఆశిస్తూ, మిమ్మల్ని "కవన వనం"లోకి, ఆహ్వానిస్తూ, మీ వంశీ..

Saturday, 16 June 2012

*ఆ దీర్ఘమౌనం*



లోకపు కూడలిలో, నించున్న అతడు
ఎటు వెళ్తే, తనకి తాను దొరుకుతాడో తెలియక
ఏం చేసి, ప్రపంచానికి దూరమవాలో అర్దంకాక

చుట్టూ చేరుతున్న తోడేళ్ళగుంపుని చూసి,
లేని ధైర్యం ఎలా ఆవహించాలో అనుకుంటూ
తనని తాను,దహించేలా నిశ్వసించిన
వేడి నిట్టూర్పులో కరిగిన
ఆ దీర్ఘమౌనం.......

జన్మకి, పునర్జన్మకి నడుమ, మరో జన్మనిస్తూ
అవమానాల అవహేళనలని,
ఆకలి చూపుల ఆరని గాయాలని
ఓర్చుకోలేక తట్టుకుంటూ, గుండెల్లో దాచుకుంటూ
నిస్సహాయతల నలిగిన, నిశ్శబ్ద నీరవ జీవాలెన్నో కార్చిన
కన్నీటి కొలనులో,
ఆత్మ త్యాగం చేస్తూ కలిసిన
దీన స్తన్యం పలికిన.......
ఆ దీర్ఘమౌనం

మనసులు మార్చుకుని,
మమతలు చేర్చుకుని
విధిని వధించి,
విధానాలతో వాదించి
నిన్నటి ముళ్ళు పెకలించి,
రేపటి పూలబాటకై నేటి కలల్ని కవాతు చేయిస్తున్న
ధీర ప్రణయపు, ధన్య గమనపు గమ్యం
ఆ దీర్ఘమౌనం

*వంశీ*

1 comment:

  1. Deerghamounam venaka....chala bhavalu unna pedda shabdanni nenu vinnanu....Beautiful poem...:)

    ReplyDelete