నిజంగా తెలీదు
లోకమింత అందమని, నా
కళ్ళలో నిన్ను నిలిపేదాకా
మైకం ఇంత వింతని, నువ్విష్టం
అని తెలిపేదాకా
కలలు నిజాలౌతాయని, ఆ రోజు
నువ్ కలిసేదాకా
వలపు అబద్దం కాదని, నీ
వలలో పడేదాకా
నిజంగా తెలీదు
శిలలు స్వరాలిస్తాయని, నువ్
నన్ను తాకేదాకా
దేవతలు వరాలిస్తారని, అడక్కుండానే
ముద్దిచ్చేదాకా
ఊపిరాగడమంటే, నువ్
కాసేపు కనపడకపోయేదాకా
ఊహాలోకమంటే, నీ
మాయలో నాకు నేను కనపడకపోయేదాకా
నిజంగా తెలీదు
ఒంటరితనమంటే, నీ తోడు
దొరికేదాకా
ఒకరికొకరంటే, ఊరంతా
మన గురించే మాట్లాడేదాకా
ప్రేమంటే, నువ్వెపుడూ
నాతోనే ఉండాలనిపించేదాకా
ప్రాణమంటే, నేనే
నువ్వని తెలిసేదాకా
No comments:
Post a Comment