కవితా మిత్రులకు, నమస్కారం

నా భావాల్ని, భాషని, కలల్ని, కలవరింతల్ని, ఆనందాల్ని, ఆరని తడినీ, ఉద్వేగాల్నీ, ఉద్దేశాల్ని, ఉద్రేకాల్నీ, ఉన్న స్థితిని, మీతో పంచుకొవాలనుకునే నా ఈ చిన్న ప్రయత్నాన్ని ఆదరించి, అభినందిస్తారని, ఆస్వాదించి ఆహ్లాదిస్తారనీ, తప్పిదాలుంటే, దిద్దుకునే అవకాశమిస్తారనీ ఆశిస్తూ, మిమ్మల్ని "కవన వనం"లోకి, ఆహ్వానిస్తూ, మీ వంశీ..

Wednesday 27 June 2012

కించిద్విషాదం*



చెయ్యి తడిపితే, చేతిలోకొద్దామని
కాచుక్కూర్చున్న ఉద్యోగం, నా తలరాతలో

కడుపులో దూరడానికి, ఎదురుచూస్తున్న
చచ్చిన కోడి, బావర్చిలో

కంటినిండా రమ్మని పిలుస్తున్న
సినిమా పోస్టర్ సంగీత్ లో

నిశ్శబ్దంగా నవ్వుతున్న "అసమర్ధుడి జీవయాత్ర"
ఫుట్పాత్ మీద షాప్ లో,

బద్దకంగా కదులుతున్న క్లాక్ టవర్ ముల్లు
నగరం నడిబొడ్డున

ప్రతి అమ్మాయిని గుచ్చే చూపులు
బడాయికి పాంట్ జేబులో పెట్టాల్సొచ్చిన చేతులు
తగలని పర్సు....... సిటీ బస్సు ఎక్కినట్టు గుర్తు

ఆటోవాడు తుపుక్కున ఉమ్మిన కిళ్ళీ
నా తెల్ల చొక్కా మీద రంగవల్లి

కోపం పెంచిన ఆకలిని నాలుగోసారి చంపుకుని
ఆశలు రేపిన ఊహల్ని తప్పించుకు తిరుగుతూ
నాలోంచి నేను బైటకొచ్చి చూస్తే,
ఎటుచూసినా నాలాగే కన్పించే జనాలు

ఏదో సాధించాలన్న ఆకలిని, ఆశల్ని చంపుకుని,
కన్పించని "రేపు"ని గొప్పగా కలలు కంటూ, గడిపేవాళ్ళే

నాకు ధైర్యం వచ్చింది, నేనొక్కడినే కాదని
వాళ్ళకెపుడు తెలుస్తుందో, అందరం ఒకటే అని.............

No comments:

Post a Comment