ఎక్కడున్నానో,
సుషుప్తికీ, సుప్త
చేతనకీ నడుమ,
విరక్తికీ, వైయుక్తికీ
పడక,
పొద్దున చూసిన రోడ్మీది స్త్రీ రూపం,
నరాల నాదం పలికిస్తుంటే,
ప్రదోషాన చేసిన చీకటి పాపం,
క్షణాల ఖేదం రవళిస్తుంటే,
యుగాలుగా పారిపోతూ
ఒంటరినై, తుంటరినై,
సగాలుగా చీలిపోతూ
తెంపరినై, తుంపరనై,
కణాలలో దాగిపోతూ
గతాన్నై, గాఢ
గీతాన్నై,
కన్నాల్లో, దూరిపోతూ
చోరున్నై, గూఢ
చారున్నై,
అనాహత స్వనాల్లో, ఆవహిస్తూ,
అరాచక వనాల్లో, ఆనందిస్తూ,
అభౌతిక చింతల్లో, ఆవేశిస్తూ,
ఆది భౌతిక చిత్రాన్ని ఆహ్వానిస్తూ,
ఎక్కడున్నానో,
కలకి, నేత్రానికీ
నడుమ,
కల్లకీ, నిజానికీ, ఎడమ,
సుఖించే ప్రతి జీవి
నా అసమర్ధతను తట్టి లేపుతుంటే,
స్పృశించే సఖిచేయి
అసాంఘీక జంతువుని పట్టి కదుపుతుంటే
వసంతాల్నే వీడిపోతూ
ఓటమినై, ఓదార్పునై,
అధివాస్తవాల్లో కూడా పోతూ
ఓ మౌనమై, మస్తిష్కపు
మూలమై,
వైకల్యాల్తో వాడిపోతూ
అనుభవాన్నై, భావాన్నై,
వైషమ్యాల్లో, వీగిపోతూ
ఘర్షణనై, గాజు
బొమ్మనై,
అకాలపు భయానికి మర్యాదిస్తూ,
ఆ కాలపు భావనలకి ఓ దారిస్తూ,
నా లోకపు బేలతనానికి చేయందిస్తూ,
ఈ జాలపు జాణతనాన్ని చేజారుస్తూ,
ఎక్కడున్నానో,
జన్మకీ పునర్జన్మకీ నడుమ,
ఉఛ్వాసానికీ, నిఛ్వాసానికీ
నడుమ,
కావాలని ఆడిన అబద్దం
కొత్తాటలాడిస్తుంటే,
కవనాలు తడమని ఓ పార్శ్వం
పాత పాటే విన్పిస్తుంటే,
మొగ్గ తొడగని మల్లెల్ని
వంచిస్తూ, వాంఛిస్తూ,
మేఘాన కురవని జల్లుల్ని
వర్షిస్తూ, హర్షిస్తూ,
మాఘం చూపని కాలాన్ని
హింసిస్తూ, హసిస్తూ,
మృగంచూపిన కలకలాన్ని
భాషిస్తూ, భక్షిస్తూ,
అచూషిత సుధలనే, ఆస్వాదిస్తూ,
అనాఘ్రాణ తనువుల్నే, ఆరాధిస్తూ,
అనాఛ్చాదిత పరాగ కేసరాల్ని పలకరిస్తూ,
ఎక్కడున్నానో,
నీకూ నాకూ నడుమ,
మనసుకీ, మనిషికీ
నడుమ....
No comments:
Post a Comment