కవితా మిత్రులకు, నమస్కారం

నా భావాల్ని, భాషని, కలల్ని, కలవరింతల్ని, ఆనందాల్ని, ఆరని తడినీ, ఉద్వేగాల్నీ, ఉద్దేశాల్ని, ఉద్రేకాల్నీ, ఉన్న స్థితిని, మీతో పంచుకొవాలనుకునే నా ఈ చిన్న ప్రయత్నాన్ని ఆదరించి, అభినందిస్తారని, ఆస్వాదించి ఆహ్లాదిస్తారనీ, తప్పిదాలుంటే, దిద్దుకునే అవకాశమిస్తారనీ ఆశిస్తూ, మిమ్మల్ని "కవన వనం"లోకి, ఆహ్వానిస్తూ, మీ వంశీ..

Friday, 8 June 2012

*కలకలం*



ఎవర్నువ్వు,
-కవిని,
అంటే మనిషివి కాదా
-కాను,
మనిషి ముదిరితే, మనసు చెదిరితే

ఆపాపు, అర్ధమైంది, నువ్ కవివని,
నా కలలలోకానికి ఎందుకొచ్చావ్

-కలలు నిద్రని వెలేస్తే,
కాలం నన్నొదిలేసి ముందుకెళితే

ఆగక్కడే, నువ్ ఏదీ అర్ధమయ్యేలా చెప్పలేవా

-నేనేం పోగొట్టుకున్నానో తెలిస్తే కదా,
ఇక్కడ, నన్ను మర్చిపోయిన నా కలల్ని చూస్తే
నాకేంకావాలో తెలుస్తుందని,
వీలైతే నా చిన్ననాటి కలలు దొసిట్లో పోసుకెళదామని వొచ్చాను

సరే, వెతుక్కో పో, జాగ్రత్త,
పరుల కలల్ని తడితే, నిన్ను
నువ్వెప్పటికీ గుర్తించలేవ్

ఎంతసేపు,, తెల్లారుతుంది,
జాగు చేస్తే కలలు కరుగుతాయి
నువ్ శాశ్వతంగా బందీ అవుతావిక్కడే

ఓ మనిషి కాని కవీ, వినపడ్డంలేదా,
నీ లోకానికి వెళ్ళవా
ఎమిటీ రోదనలు, ఏం చేసావ్ నా లోకాన్ని

కలలన్నీ చెల్లాచెదురై ఉన్నాయి, ఏమైంది
ఫ్రాయిడ్నెవరు లేపింది,
హిట్లర్ ఎందుకేడుస్తున్నాడు
వివేకానందుడు ఉలిక్కిపడుతున్నాడేమిటి
కృష్నశాస్త్రి, శ్రీ శ్రీ వాదులాడుకుంటున్నారెందుకు

ఓ కవీ వెళ్ళిపో నా లోకంనుండి,
మళ్ళీ వొచ్చే సాహసం చేయకు

నీకు నీ కలలెన్నటికీ దక్కవు, కరువు నిద్రా తప్పదు,
పిచ్చి వాడిలా ఎమిటా చూపులు, చెప్పేది నీకే

- "ఎవరునేను?, ఇక్కడికెలా వొచ్చాను?"

No comments:

Post a Comment