ఆలస్యమైందాస్పత్రిలో, కోపమా,
చంద్రుడ్రాకముందే ఉంటా రేపట్నించి,
ఎలా ఉన్నావ్, తిన్నావా, మాట్లాడవా,
నేన్తింటున్నా, టొమాటో
చారు,
నీకిష్టంగా,
క్లినిక్కో పిల్లాడొచ్చాడు,
మనకు పుడ్తే అలాగే ఉంటాడన్పించేంతందంగా,
"ల్యుకేమియా", ఇంకొన్ని
వారాలంతే,
దత్తతడగాలనుకున్నా, కానీ,
వాడికీ అమ్ముందిగా,
పిచ్చిదానా, ఏడుస్తున్నావా,
నీకు నేన్లేనూ,
నీ ఊహొస్తే నేనూ పిల్లాడ్నేగా,
ఆహ్, నవ్వావా,
తూరుపు గాలులేవో, పరిమళాలు
మోసుకొచ్చినట్టైతేనూ,
మాత్రలా, హా, వేస్కుంటున్నా,
గుర్తు చేస్తున్నావ్గా రోజూ,
పెరట్లో నీ గులాబులు గుబాళిస్తున్నాయ్ లే,
గుర్తుందా, పూల్లేకుండా
వొస్తే,
"ఫూల్"
అనెదానివి నర్మగర్భాలంకారంగా,
పావురాలా, ఒకటి
పోయింది,
ఎగిరి కాదు, "ఎదిగి",
పాపమా ఒంటరిదేం తినలా, వారంపాటూ,
వాటి చెత్తెత్తలేక చిరాకొచ్చేదిలే,
నీ ప్రేమే బ్రతికించేది వాటిని,
పూజగదిలో విగ్రహాలలాగే ఉన్నాయ్,
దీపమా, గుర్తుంటే
వెలిగిస్తున్నా,
అదీ, మర్చిపోక
వెలుగిస్తుంది, ఐనా,
దీపాలకు దూరమయ్యే చీకట్లా ఇవి,
నీ వాయిల్రంగు చీరలాగే ఉంచా,
ఎపుడూ అడగడమేనా, ఓసారేస్కోవొచ్చుగా,
ముద్దిస్తావోటి చెప్తే, పక్క
స్థలం కొన్నా,
కాలనీ పిల్లలాడుకోడానికి,
చెక్కిలి తడపలేదే ఇంకా, ఓహ్,
తాగిపారేసిన సీసాల్జూసావా,
చలి చంపకుండా, ఉండడానికంతే,
నువ్వెలాగూ లేవ్ గా,
పాత కారు షెడ్లోనే, చెప్తే
వొద్దంటావని,
తెలీకుండా సైకిలోటి కొన్నా,
నీ ఙ్నాపకాల్తో కార్ శిథిలమైందిగా,
చేతులారా చంపుకున్న నీ ర..క్త..పు..మ..ర..క..ల
ఆరని తడి ఇంకా భయపెడ్తూ, కార్లో,
వేసవొచ్చింది, లోపలెలా
ఉంటావని.
పైకప్పేయించా,
సరిగ్గా, రెండేళ్ళ
మూడ్నెల్లైంది,
స..మా..ధి..లోకి సాగనంపి,
శాస్త్రాలన్జెప్పి ఒప్పుకోలేదెవరూ, నిన్నింట్లో
దాచుకుంటానంటే,
మనవాళ్ళనే అందరూ, ముఖాల్చాటేసారు,
ఐనా మనకెవరెందుకు,
నాకు నువ్విప్పటికీ ఉన్నావ్, ఎప్పటికీ
ఉంటావ్,
రేపే గా నీ పుట్టిన్రోజు
వెన్నెల్లో వెనీలా తిన్న రోజులు గుర్తొస్తున్నాయ్,
అపుడే పన్నెండైందీ,
ఆ ఆక్సిడెంట్లో పోయిన్నా చూపుకి ,
నీ కళ్ళతో కాపు కాస్తున్నావ్,
నిన్ను నా లోకంలో, నింపుకోడం
తప్ప,
ఏమివ్వగలనింకా,
అడక్కుండానే అన్నీ ఇచ్చిన నిన్నింకా,
ఏమడగ్గలను,
"మెనీ హాప్పీ
రెటర్న్స్ ఆఫ్ ది డే రా,
ఏదీ దాచన్నీకో నిజం బాకీ,
నిద్రకేసుకునే జోలం నలభై మాత్రలు.
ఆపిల్ జ్యూస్లో కలిసి, రక్తంలో
కరిగి చాలా సేపైంది,
ఎప్పటి నీ మాటలో పిలుస్తున్నట్టు,
ఎన్నటి నీ నవ్వులో, తడుస్తున్నట్టు,
ఎక్కడి నీ ఊహలో వరిస్తున్నట్టు,
ఏదో తెలీని ఆనందం,
మరేదో తెలిసిన అనుభూతి, తోడురాగా,
వొస్తున్నా, నీ
నీడనవ్వడానికి,
వొస్తున్నా నా నేను కలుసుకోడానికి,
తెలవారేసరికి తలవాలి నేను,
నేనప్పటికే చ..చ్చి..పో..యుం..టా..,
నీ జగంలో, కొత్తగా
జ..న్మిం..చ..డా..ని..కి.