కవితా మిత్రులకు, నమస్కారం

నా భావాల్ని, భాషని, కలల్ని, కలవరింతల్ని, ఆనందాల్ని, ఆరని తడినీ, ఉద్వేగాల్నీ, ఉద్దేశాల్ని, ఉద్రేకాల్నీ, ఉన్న స్థితిని, మీతో పంచుకొవాలనుకునే నా ఈ చిన్న ప్రయత్నాన్ని ఆదరించి, అభినందిస్తారని, ఆస్వాదించి ఆహ్లాదిస్తారనీ, తప్పిదాలుంటే, దిద్దుకునే అవకాశమిస్తారనీ ఆశిస్తూ, మిమ్మల్ని "కవన వనం"లోకి, ఆహ్వానిస్తూ, మీ వంశీ..

Tuesday, 10 July 2012

* ఉదయం *



టాంక్ బండ్,ఉదయం 5.30,
ప్రశాంతంగా చూసే బుధ్దుడూ
విషాదంగా కనిపిస్తూ,

ఓటమి కొత్తేం కాదు,
ప్రేమలో గెలవలేదనే బాధ,
రెప్పల మాటున మబ్బుల్ని నీటిఊటల్తో నింపుతూ,
తప్పుల చాటున మాయల్ని, నిజాల బాటతో దాటుతూ,
రేపటి నీ లేనితనం ,మనసులో నిప్పుచువ్వల్ని దించుతూ,
ఇప్పటి నా ఒంటరితనం, మనుషుల్లో మనిషి జాడ వెతుకుతూ,

మూణ్ణెల్లైంది,
అమ్మతో మాట్లాడక, తన కోసం,
నే చస్తే,
తనొస్తుందా, ఏడుస్తుందో, లేదో.
ఐనా, చూడ్డానికి నేనుంటానా,
చేతిలోని "సోడియమ్ థయోపెంటోన్" అనెస్థీషియా ఇంజెక్షన్,
మోచేతి నరాన్ని ముద్దాడుతుండగా,

"అనా, ఆకలైతుంది, నేన్తిన్నా, అమ్మ ఏం తిన్లే,
అడుక్కొచ్చిందంతా నాకే పెట్టి, అగో"
శ్రీ శ్రీ విగ్రహం వెనక జాలిగా కూర్చున్న
తల్లిని చూపిస్తూ, రేపటి పౌరుడు
"భిక్షువర్షీయసి" మెదడ్లో మెరుస్తుండగా,

జేబులో మిగిలున్న
నాలుగు నవ్వుతున్న గాంధీల్ని, వాడికిచ్చి,
చివర్సారి, అమ్మతో మాట్లాడాలనిపిస్తూ,
ఫోన్ తీసి,
"అమా, మా, త..తను, వెళ్ళిపోయిందే, నేనోడిపో.."
మాటల్రాక, మబ్బుల్ని వర్షిస్తూ,

-"ఇంటికి రా నానా,
నీకిష్టమని చేపల కూర చేసా రాత్రి"
ఏడుపాపుకుంటూ, నిర్మలంగా అమ్మ,

రెండ్రోజులుగా నేను తిన్లేదని
అమ్మకెలా తెలుసని, ఆశ్చర్యపోతుండగా,
నవ్వుతూ కనిపిస్తూ, బుధ్దుడు,
అప్పుడే, ఉదయిస్తున్న వెలుగుని చూడమంటూ..

No comments:

Post a Comment