ఆడం, ఈవ్ కిచ్చిన ఆపిల్ కొట్టేసి కొరికి,
మాతృస్వామ్యం లోంచి, పితృరాజ్యాలైన
గణాల లోగుట్టు కెలికి,
... వేయించిన వేట, ఉప్పు, కారమేసుకు నమిలి,
సురాపానించి,
సూర్యుణ్ణారాధించి,
మాయన్ సివిలైజేషన్ రహస్యాల్ని,
అమెజాన్ మాన్ ఈటర్స్ ని తప్పించుకుని,
నేను సైతమంటూ పిరమిడ్ నిర్మాణానికి రాళ్ళెత్తి,
కుదిరితే క్లియోపాత్రాని మోహించి,
టైముంటే, ట్రోజన్ వార్ చెక్కగుర్రంలో,
ఎకిలిస్తో కరచాలించి,
హోమర్, ప్లేటో, అలెగ్జాండర్ ఆటోగ్రాఫులడుక్కుని,
అరిస్టోటిల్, సోక్రేట్స్, కన్ఫ్యూషియస్ల
పాఠాలు నేర్చుకుని,
రోమన్లు సిలువేసిన క్రీస్తు రక్తమంటిన
"రోబ్" దాచుకుని,
బోధిచెట్టు రెండాకులు కౌటిల్యుడి అర్ధశాస్త్రాన
భద్రపరిచి,
అశోకుడ్నాటించిన చెట్టు కింద
దాహంతో కాళిదాసు "అభిఙ్నాన శాకుంతలం"
చదూతూ,
అప్పుడే పుడ్తున్న ఇస్లాం శాంతి స్థాపనని,
ప్రవక్తని, అధ్యయనంచేస్తూ,
క్రూసేడ్లన్జూస్తూ,
రామానుజుని అడుగులో అడుగేస్తూ,
దొరికితే చెంఘీజ్ ఖాన్, ఘజినిల
డీ.ఎన్.ఏ శాంపిల్ సంపాదించి,
అక్బర్, జోధా పెళ్ళి రెసెప్షన్కి,
తాన్సేన్ అర్కెస్ట్రా బరాత్ తీస్తూ,
తాజ్ మహల్ కాలశోధనకు కార్బన్ డేటింగ్ చేసి.
వేయి స్థంభాలగుడి అర్కిటెక్చర్ టెక్నిక్ స్కాన్
చేస్కుని,
విజయనగరపు అంగడిలో,
రాశుల వజ్రాల్ని దొంగజేబులో దూర్చుకుని
ధూర్జటి కాలహస్తీశ్వర పద్యాల్ని, మనసుకెక్కించి,
భువన విజయపు సారస్వత వల్లరికి మురిసి,
విజిలేసి,
వ్యాపారమన్న ఈస్టిండియా కంపెనీని అనుమానంగా చూసి,
బ్రహ్మంగారిని నోస్ట్రడామస్ ఆచూకీ అడిగి,
అలభ్యాలైన వేమనని, అన్నమయ్యనీ సెర్చ్
చేసి,
షేక్స్ పియర్ డైరెక్ట్ చేసిన్నాటకాన్ని,
కీట్స్ పడి చచ్చిన ఫానీ బ్రౌన్ని,
నూట నాలుగో సారి చూసి,
ఇండస్ట్రియలైజేషన్కి మార్క్స్, ఎంగెల్స్ ని
కారణమడిగి.
సిపాయి తిరుగుబాట్లో ఝాన్సీ
విప్లవాన్ని ఇంట్రా వీనస్లీ ఇంజెక్ట్ చేస్కుని,
ఫ్రాయిడ్ కలల్నింటర్ప్రిట్ చేసి,
దాశరధితో రజాకార్ల మీద రాళ్ళేసి,
గాంధీ రాజాజీ బంధుత్వాన్ని,
జాతీయోద్యమంలో రాజకీయాల్ని,
బోస్ మరణాన్ని ఇన్వెస్టిగేట్ చేసి,
చలం రాజేశ్వరిని, క్రిష్ణ శాస్త్రి
అత్తర్నీ,
శ్రీ శ్రీ తాగొదిలేసిన విస్కీ ని, ఒక్కసారి స్పృశించి,
యులిసిసేం అర్ధంకాలేదని జాయిస్కి లెటర్ రాసి,
రాహుల్ సాంకృత్యాయన్తో
వోల్గాన మునిగి, గంగలో తేలి,
సత్యజిత్ రే పక్కన పథేర్ పాంచాలి ప్రివ్యూచూసి,
సావిత్రి కళ్ళని కార్నియాలో బంధించి,
మార్లిన్ మన్రో, మార్లన్ బ్రాండోతో
ఫోటో షూటేస్కుని,
తిలకింకొన్నాళ్ళు బతికితే కలిసి,
తెలుసవన్నీ అసాధ్యాలని,
కానీ,
కలకసాధ్యమేముంది,
మనసు దూరని కాలమేముంది....
No comments:
Post a Comment