కవితా మిత్రులకు, నమస్కారం

నా భావాల్ని, భాషని, కలల్ని, కలవరింతల్ని, ఆనందాల్ని, ఆరని తడినీ, ఉద్వేగాల్నీ, ఉద్దేశాల్ని, ఉద్రేకాల్నీ, ఉన్న స్థితిని, మీతో పంచుకొవాలనుకునే నా ఈ చిన్న ప్రయత్నాన్ని ఆదరించి, అభినందిస్తారని, ఆస్వాదించి ఆహ్లాదిస్తారనీ, తప్పిదాలుంటే, దిద్దుకునే అవకాశమిస్తారనీ ఆశిస్తూ, మిమ్మల్ని "కవన వనం"లోకి, ఆహ్వానిస్తూ, మీ వంశీ..

Tuesday 3 July 2012

* లక్ష *



"నాయగ్గాడు, ఐ.సి.యు. లో, సీరియస్సే,
రోడ్డుకడ్డమెళ్ళి, లారీ కింద పడి..
నీలాంటి ఫ్రెండుండగా, కష్టమేంట్రా వాడికి,
రాత్రి నీ ఇంట్లోనే ఉన్నాట్ట కదా"...మా పాత నేస్తం, డాక్టర్...

*****************************************
పదో, వందో కాదు, లక్ష పోయాయంటే,,
మందు పార్టీ ఐన రోజల్లా ఏదో ఒకటి పోవడమానవాయితీ,
అదే, సంపాదిమ్చిన జీతం పోతే,
రాత్రి నా ఇంట్లో, నాయగ్గాడూ, నేనూ..
"సాలరీ వొచ్చింది, సుక్కుందారా", వాడు,
"ముక్క కూడా ఉందిరా" ఉత్సాహంగా నేను,
సగం గరళం గొంతు దిగిందప్పటికే,
గ్రిల్ చికెనూ, అస్థిపంజరమైంది,

"రేయ్, చెల్లికి సంబంధమొచ్చింది,
దానికబ్బాయీ నచ్చాడు, ఇల్లమ్మి కట్నమివ్వండని శారద,
మాకు పిల్లల్లేక చెల్లే కూతురైంది,
చిల్లుల జేబుతో దాన్నెలా దీవించాల్రా"
తాగింది కళ్ళెంబడి కారుతుండగా,
నా మెళ్ళొ బంగారు గొలుసాశగా చూస్తూ, నాయగ్గాడు,

"ఇల్లమ్మెక్కడికెడతారు, శారదేదో అంటే, నీ తెలివేమైంది,
ఎలాగోలా సర్దుదాంలే, పిచ్చాలోచన్లేం రానీకు,
360 మి.లీ ఇథైలాల్కహాల్, 1300 మి.లీ నీళ్ళలో కరిగి,
కడుప్పీల్చి, మెదడుకెక్కి, నాడుల్ని నాట్యమాడిస్తుండగా,
గోడకేసిన పాంట్లోంచి,
మా మాటలు వింటున్న లచ్చిందేవినో కంట కనిపెడ్తూ నేను,

"బావా, ఈ రాత్రిక్కడేరా, తల తిరిగుతుంది",
ఎప్పుడడిగినా, శారద విడాకులిస్తుంద్రోయ్ రాత్రింట్లో లేకపోతే, అనే నాయగ్గాడు,
అనుమానం కలిగేలా..

'తంతాన్రోయ్, విత్ ప్లెజర్"
నవ్వు పులుముకుంటూ, మత్తు మూస్తున్న కళ్ళతో నేను,

***********************************************

హాస్పిటల్లో, శారద,
"అన్నా, నా దగ్గరేమైనా దాచాడా ఆయన,
చచ్చేంత రహస్యమైతే చెప్పకు" ఏడుస్తున్న చెల్లిన్జూస్తూ,

*********************************************
తాగిన రాత్రి సూర్యుడ్ని కక్కింది,
పడుకున్న వాడ్లేడ్రూంలో, పాంట్లో డబ్బులు కూడా,
పరిగెత్తి బైటికొస్తుంటే, రోడ్డుమీదెవర్తోనో మాట్లాడ్తూ వాడు..
"రేయ్, కుక్కా, దొంగవెప్పుడయ్యావ్, అడుక్కుంటే పడేస్తాగా,
నా తప్పేరా, నీలాటి లేబర్గాడ్నెక్కడుంచాలో తెలిసీ, నెత్తినెక్కించుకోడం..
లక్ష కొట్టుకొచ్చాడ్సార్, జాగర్త వీడ్తో" వాడి జేబుల్తడుముతూ నేను

"బావా, చెల్లి కోడలయేది వాళ్ళిoటికేరా"
శుభలేఖల్నేలకేసి కొట్టెళ్ళిపోతున్న వాళ్ళన్చూసి,
నన్ను విడిపించుకుని పరిగెత్తుతూ వాడు...

**********************************************
'పేషెంట్కి స్పృహొచ్చింది, మాట్లాడొచ్చొక్కొక్కరే"..ఐ.సి.యు నర్స్..
"అన్న, నువ్ పో, నీకే చెప్తాడసలేమైందో" శారద,

"బావా, నేనేతప్పు చేయలేద్రా,
నువ్ తాగించిన మందుమీదొట్టు" నన్ను నమ్మించేలా వాడు..

"చీ, అబధ్దాల్చెప్పింకా మోసం చేయకు,
ఎందుకు బ్రతికావ్రా, చావాల్సింది, ఎనీ వేస్, ఆమ్ గోయింగ్, రెస్టిన్ పీస్"
డబ్బులిక దొరకవన్న కోపం కూయించిన్నా మాటలు..

అలిసి, ఇంటికొచ్చిన్నాకు, నిద్రలో ఏదో గుర్తొచ్చి,
బీరువా లాకర్తెరిపించగా,
రాత్రి మత్తులో వాడెక్కడ ఎత్తుకెల్తాడోనని దాచిన్నోట్లు,
నా కన్నీళ్ళకు తడిసిపోతూ,
ఫోన్రింగ్ విన్పించనంత వెక్కేడుస్తూ నేను..

'అనా, అన్నింక లేవడు,
కాల్చడానికి మాకెవరున్నారు" నేను పెళ్ళి చెడగొట్టిన నా చెల్లి..

చిన్నప్పుడు కలిసాడుకున్న చెరువుకట్ట పక్కనే,
చచ్చేదాకా దోస్తులమే అన్రాసుకున్న తాటిచెట్ల కింద,
నాన్ననీ తన్లో కలుపుకున్న రేగడిమట్టిలోనే,
నాయగ్గాడూ, నవ్వుతూ,
మేమంతా ఏడుస్తూ,

పెరిగిన అగ్ని ప్రవాహం, ఆత్మ ప్రయాణం సూచిస్తుండగా,
పడమటి సంధ్యా పడిపోతూ,
వాడ్ని చంపుకున్న ప్రతీ నోటుకీ,
నా రుధిరంతో క్షమార్పణల్రాస్తూ,
వాడితో నా అనుభూతుల్తో పాటే,
మంటల్లో విసిరేస్తూ,
నాలోని హంతకుడ్ని ఆహుతి చేసుకుంటూ,
నేను,
ఒంటరినైపోయి...

No comments:

Post a Comment