కవితా మిత్రులకు, నమస్కారం

నా భావాల్ని, భాషని, కలల్ని, కలవరింతల్ని, ఆనందాల్ని, ఆరని తడినీ, ఉద్వేగాల్నీ, ఉద్దేశాల్ని, ఉద్రేకాల్నీ, ఉన్న స్థితిని, మీతో పంచుకొవాలనుకునే నా ఈ చిన్న ప్రయత్నాన్ని ఆదరించి, అభినందిస్తారని, ఆస్వాదించి ఆహ్లాదిస్తారనీ, తప్పిదాలుంటే, దిద్దుకునే అవకాశమిస్తారనీ ఆశిస్తూ, మిమ్మల్ని "కవన వనం"లోకి, ఆహ్వానిస్తూ, మీ వంశీ..

Sunday, 8 July 2012

* అద్వైతం *


స్వేద స్నానాలతో స్వాతి చినుకులా ,
సప్త వర్ణాలతో సుందర దృశ్యంగా,
పంటి గాటుతో నీ దూకుడు పెంచుతూ నేను,
తలంటుతో నాకు మైకం పంచుతూ నువ్వు,
నిన్ను పొదుముకోడానికి చేతులు
చాలక నిస్సహాయంగా నేను,
నాలో నిన్ను పోగొట్టుకోడానికి
కొత్త చేతలతో, నిర్విరామంగా నువ్వు,

ఏదో తెలీని రహస్యం శోధించడానికి
హరాత్మకంగా , కొత్త ద్వారాల తలుపులు తడుతూ నేను,
ఎన్నడూ తేలని మహాత్యం సాధించే వడిలో,
రసాత్మకంగా, కోట్ల వర్షాల తలపులు చుడుతూ నువ్వు,

నీ గెలుపుకు నేనోడి,
నా ఓటమికి నీతో ఆడి,
అలసి, ఆగి, తిరిగి, అలసి,
కలిసి, కాగి, తరిగి, అరిగి,
సమరంలో స్వర్గారోహిస్తూ,
సమయానికి సవాలేస్తూ,
శిశిరాల్లో శైశవాన్నాస్వాదిస్తూ,
శిఖరంపై కైవల్యానాఘ్రాణిస్తూ,

అమరులమై, మరులమై,
అమృతం తాగాలని,
అవధుల్లేని వారధుల్లో
అద్భుతమై నిలవాలని,
మళ్ళీ,
మళ్ళీ, మళ్ళీ,
నువ్వు, నేనుగా ఆత్మనొదిలి,
మనంగా ఆకృతి తొడిగి,
మనసంతా ప్రకృతి తడుముతుండగా....

No comments:

Post a Comment