క్లోమంలో కణితి,
తీసేసినా లాభంలేనంత
గాఢంగా తనూలతనల్లుకుని,
... తల్లోకీ వ్యాపించి
పీడ కలలు తెప్పిస్తూ,
ఆరు మాసాల నూకలింకా,
పావుభాగం బ్రతుకుతో,
సగం తగ్గిన బరువుతో,
నిజం నమ్మించని భయంతో,
నీడనే నిందించే భీరున్నై,
చావెందుకసలు,
ప్రకృతిని మనిషెపుడూ గెలవకూడదనా,
పాశాల్ని మనసెన్నడూ మరవకూడదనా,
ప్రశ్నలెక్కడ జవాబుల్ని వెతికిస్తాయనా, ,
ప్రాణమెక్కడ మనల్ని జంతువుగా మారుస్తుందనా,
ప్రయాణమెక్కడ జీవికి ఙ్నానం నేర్పిస్తుందనా,
అద్భుతాల్నీ, అందాల్నీ, ఆనందాల్నీ,
చూడేలేదింకా,
ఆశ్చర్యాల్తో, అసాధ్యాల్తో,అంతరాల్తో
కూడలేదింకా,
అనుభవాలు, అనుభూతులు, నా
అస్పష్ట ఆర్తనాదాలూ,
తోడే రావింకా,
అవమానాలు, అవరోధాలు, అమంగళాల
గొడవే లేదింకా,
జన్మిచ్చినోళ్ళూ, జన్మించినోళ్ళూ
మనసిచ్చినోళ్ళూ, మనువాడినోళ్ళూ
స్నేహితులూ , శతృవులూ
,
స్వాప్నికులూ, సాంఘీకులూ,
కన్నీరెందుకు,
నా కళ్ళిక మూసుకుంటున్నందుకా,
కసి నవ్వెందుకు,
నా కలలిక మాసిపోతున్నందుకా,
కడు జాలెందుకు,
ఆట మధ్యనే ఓడినందుకా,
కొత్త గౌరవాలెందుకు,
ఆరిపోయే దీపం వెలుగు తాకినందుకా,
తెలిసిందిపుడే,
మరణం ఒక ముక్తి,
మరణం ఒక సూక్తి,
మరణం ఒక శక్తి,
మరణం ఒక వ్యాప్తి,
No comments:
Post a Comment