ఎప్పటికీ మచ్చికవని,
ఎవ్వరికీ మంచిదవని,
కాలం కుక్క ,
అకాలంగా తరుముతుంటే,
జారి పడ్తున్న గతాల అలంకారాల్ని
గాలికొదిలి,
జాలి పడ్తున్న భవితల కలంకారీ కలల కార్యాల
గుర్తులదిమి,
జోలలో తోసి గడుస్తున్న మాయల మాటల్ని,
జోలెలో దాగి గమనిస్తున్న నిమిషాల మూటల్ని,
భూతానికి,
భారంగా సంభారాలిస్తూ,
పరిగెడ్తున్న ప్రపంచాన్ని,
పరికిస్తున్న దిగంతాన్ని,
ప్రత్యక్షంగా చూస్తూ,
కదల్లేక, కథల్లేక,
మెదల్లేక,మెదళ్ళేక,
వీల్ చైర్లో, వాల్
స్ట్రీట్లో
ఏటవాలుగా జారుతూ,
పడుతున్న రూపాయికీ, పుడుతున్న
పాపాయికీ,
లెక్కల్రాస్తూ,
పరిగెడుతూ పరిగెడుతూ
కాదన్లేక,నాదన్లేక,
మొదలేదో,మలుపేదో, తెలీని,
మంత్ర నగరాల యాంత్రిక వీధులగుండా,
తంత్ర వ్యవహారాల, తాత్వికత, వీనుల
నిండా,
నింపుకుని, మిగిల్తే, పరుసవేదినన్వేషించే
పన్లేనోడికై, కాలగర్భంలో,ప్రక్షిప్తించి,
పరిగెడుతూ పరిగెడుతూ,
ఎక్కడాగాలో, ఎందుకాగాలో,
ఎన్ని చూడాలో, మరెన్ని
వీడాలో,
చీకటి కమ్మిన చోటుల్లో,
రేపటి కమ్మని ఊహల్తో,
చేతలు అలిసిన బాటల్లో,
ఏవో చేతులు రమ్మనే ఆశల్తో,
ఎప్పటికీ మచ్చికవని,
ఎవ్వరికీ మంచిదవని,
కాలం కుక్క ,
అకాలంగా తరుముతుంటే,
పరిగెడుతూ పరిగెడుతూ ........
No comments:
Post a Comment