అందమైన అందమా,
నా చెలి కళ్ళని చూడు,
ఆ నీలి సొగసుల్లో ఆకాశం ఇమిడిపోదూ,
అంతంలేని సమయమా,
నా చెలి నవ్వుల సవ్వడి విను,
ఆగని నిన్ను కూడా, ఆపేస్తుంది కదూ,
ఆశలేని జీవితమా,
నా సఖితో మాట్లాడు,
ఆనందం నీ ఇంటిపేరుగా మార్చేస్తుంది చూడు,
అద్భుతాలు కలబోసుకున్న లోకమా,
నా సఖితో కలిసి నడువ్,
నీలో లేని ఎన్నో అద్భుతాలు కనపడవూ,
అఖండమైన సాగరమా,
వీలుంటే నా ప్రేయసి పాదాలు తడిపి చూడు,
నిన్నొదిలిపోయి, నీలో చేరాలనొస్తున్న వానచుక్కలా,
గిలిగింతలు పెట్టట్లేదూ,
అసాధ్యమైన ప్రశ్నల్లారా,
నా జాబిలి మదిలో చోటడగండి
సమాధానాలిట్టే దొరికిపోవూ,
అనాదిగా ఉన్న ప్రణయమా,
మా జంట ఊసుల్ని, బాసల్ని, కోరికల్ని, కయ్యాల్ని,
లాలనల్ని, కోపాల్ని, విరహాల్ని, తమకాల్ని,
చూసిపోవూ,
నిన్ను నువ్వు కొత్తగా చూస్తున్నట్టు లేదూ…
No comments:
Post a Comment