కవితా మిత్రులకు, నమస్కారం

నా భావాల్ని, భాషని, కలల్ని, కలవరింతల్ని, ఆనందాల్ని, ఆరని తడినీ, ఉద్వేగాల్నీ, ఉద్దేశాల్ని, ఉద్రేకాల్నీ, ఉన్న స్థితిని, మీతో పంచుకొవాలనుకునే నా ఈ చిన్న ప్రయత్నాన్ని ఆదరించి, అభినందిస్తారని, ఆస్వాదించి ఆహ్లాదిస్తారనీ, తప్పిదాలుంటే, దిద్దుకునే అవకాశమిస్తారనీ ఆశిస్తూ, మిమ్మల్ని "కవన వనం"లోకి, ఆహ్వానిస్తూ, మీ వంశీ..

Thursday 10 May 2012

*ఒకరోజు*


ఈ ఉదయమైనా రోజూలా కాకుండా,
కొత్తగా ఉంటే
-పోస్ట్,
పొద్దున్నే పోస్టా
"యు ఆర్ డిస్ క్వాలిఫిడ్ ఇన్ ద ఇంటర్ వ్యూ",
ఛీ జీవితం, మనమనుకుంది ఎప్పుడు జరిగేడిచింది,
కావేరినీ కావాలనుకున్నా, 4 ఏళ్ళైంది,
ఎలా ఉందో, ఉందో లేదో

రాత్రి హోటల్లో గొడవ, నన్నే
"వాడంతే రా, ఎవడితో కలవడు, ఎవడినీ కదపడు, వాడ్ని మూసీ లో నిమజ్జించేయాల్రోయ్" హ హ

టిఫిన్కి డబ్బులు సరిపోతాయా,
పాత సీసాలమ్మితే 4 ఇడ్లీలొస్తాయా
తాగి పడేసిన సీసాలు,
ఉదయపు ఇడ్లీలు, బావుంది, దీనిమీదో కవిత రాసెయ్యొచ్చు

సిగరెట్లు తగ్గించాలి,
సగం జీతం తగలడుతుంది, జీవితం కూడా

చోటూ, ప్లేటిడ్లీ పంపు,
పేపర్ కొని ఎన్ని రోజులైంది,
తెలుగోడికి కొని చదివే అలవాటెప్పుడొస్తుందో
పెద్దింట్లో పుట్టినా అయిపోయేది, ఒక్క స్కాం, నా జీవితాన్ని మార్చేది

సారూ, పోయిన్నెల మూడు నూర్లు,
హోటల్ వాడు, ఏమాత్రం అసహ్యం దాచుకోకుండా అడిగాడు,

హా, ఇస్తా,పారిపోతున్నానా......
వాడు నమ్మలేదని తెలుసు, నమ్మించలేననీ తెలుసు ,
మానేజర్ రావుగార్నోసారి అప్పడగుదామంటే,
ఇవ్వాల్సిందే అడ్డొస్తుంది
కాలేజి రోజులే బాగుండేవి, డబ్బుకి, చదువుకి తూకం కుదిరేది
"ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహముల్"....

మోర్నింగ్సర్, మీరేంటిక్కడ,
ఎవరా అనుకుంటూ, మిగిలిన ఇడ్లీ మింగేసి

కాలేజ్ లో మీ జూనియర్ని, మీ కవితలకు ఫాన్ని
"ఐతే ఒక 100 కి చిల్లరుందా" నోట్లోనే ఆగింది మాట

ఏమ్ చేస్తున్నారు, ఎమైనా రాసారా కొత్తగా,
"అడుక్కుతింటున్నాను, నువ్వప్పిస్తే అలోచిస్తా ఏం రాయాలో", ఈ సారి నోరు దాటింది

వింతగా చూసాడో, జాలిగా చూసాడో
పోల్చుకునేలోపే కుర్చీ ఖాలీ ఐంది,,
నిజం చెప్తే కూడా నన్ను అంతర్ముఖుణ్ణి చేస్తారెందుకో

చెప్పులు రోడ్డెక్కాయి,
చూపులు హుస్సేన్సాగర్లో మునిగాయి
ఔను, కావేర్ని తొలిసారెక్కడ చూసాను, క్లాస్ లోనా, బస్ స్టాప్ లోనా

ఇంకా అదే ఇంట్లో ఉంటుందో,
ఉంటే మాత్రం, నువ్ పోతే అల్లుడిలా మర్యాదిస్తారేంటి,

కాసేపైతే ఓటర్ జాబితాలో నా పేరు తొలగేది,
"రోడ్డు కడ్డంగా నడుస్తున్నావ్, ఇంట్లో చెప్పే వొచ్చావా" బస్ డ్రైవరనుకుంటా,
ఇంట్లో గొడవలేమో, గట్టిగానే కోప్పడ్డాడు,
చెప్పలేదు, నీ ఫోనోసారివ్వు, చెప్తా,
చావు తప్పిపోయినా,
చమత్కారం తగ్గలేదు,

పట్నంలో ఎక్కడికెళ్ళాలో తెలీకపోయినా,
ఏ బస్సెక్కడికెళ్తుందో తెలిసుండాలి..
ఇంతకుముందే కసురుకున్న కండక్టర్, టిక్కెట్ కి చిల్లరిస్తే మురిసిపోయాడు

రావు గార్రమ్మన్నారు, సూపర్వైసర్ పోస్టేదో ఉందట,
వెళ్ళేసరికే రికమండేషన్లో పోయింది,
అమ్ముడు పోయిందనడం సబబేమో..
కంట్లో నీళ్ళు కదులుతుంటే, నవ్వుతూ బైటకొచ్చా,
ఆయనిచ్చిన పచ్చనోటు ఆసరాతో,,

హోర్డింగ్ మీద "డర్టీ పిక్చర్",
నా ఈరోజు కంటే దరిద్రమా తేల్చుకుందామని దూరిపోయా
విరామంలో పాత నేస్తం
"కావేరికి ఎల్లుండి పెళ్ళంటరా" అనేవరకూ
పట్టిన నిద్ర పోలేదు, నిన్న పడుకోలేదు,
ఉచిత విద్యుత్ రాలేదుమరి

ఈరొజింకా "డర్టీ" అవకముందే నా గదికెళ్ళి,
అన్నీ మూసుకుని, కిటికీలు తెరిచా,
ఏంటో అందులోంచి చూస్తేగాని అర్ధమైనట్టన్పించదు లోకంపోకడ,
గత ఆరేళ్ళ నుండి,,

ఇంకెన్ని డబ్బులు మిగిలాయి, రేపటికి సీసాల్లేవిక,
ఎల్లుండెలాగూ కావేరి పెళ్ళి,
ఇలాంటప్పుడు నవ్వినవాడే మనిషి, బ్రేవో

ఇంత రాత్రి తలుపు కొట్టేదెవరు, ఐతే ఇంటి ఓనర్,
లేకపోతే వాడి కొడుకు, నవలల కోసం,,,
చూస్తే కావేరి,
చేతిలో కవరు, శుభలేఖేమో,

అడిగింది "రావొచ్చా",
"రావాలనే వొచ్చావ్ కదా"
-మీ పక్కిల్లు, మా పిన్నిది, అలగే నిన్నూ చుసినట్టుంటుందని.....

"ఐతే శుభలేఖివ్వడానికి రాలేదా, ఇస్తే, నేనొస్తా అనుకుందా"
ఆఖరికి నువ్ కూడా నన్నర్ధం చేస్కోలేదా,
నేనే నీకర్ధం కాలేదా కావేరి....

-చీకటి పడ్తుంది, వెల్తా ఇక,,
అడ్వాన్స్ హాప్పీ మారీడ్ లైఫ్ కావేరి......
తన కళ్ళలో కన్నీటి పొర,
కనిపించిందా, అనిపించిందా....

చివరిసారి నన్ను స్పృశించి,
వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది

ఆకలేస్తుంది, దాహంకూడా,
ఆకల్ని, బాధల్ని మరిపించే దాహం పుచ్చుకుని,
కిటికీలోంచి....
"కనబడని" మనుషుల మనస్తత్వాలూ,
అబధ్ధమనిపించే ఆత్మీయతలు,
ప్రపంచాన్ని పరిచయంచేసే సత్యాలు,
నిద్రకి దగ్గర చేసే అనుభవాలకోసం
వెతుకుతూ.......

No comments:

Post a Comment