కవితా మిత్రులకు, నమస్కారం

నా భావాల్ని, భాషని, కలల్ని, కలవరింతల్ని, ఆనందాల్ని, ఆరని తడినీ, ఉద్వేగాల్నీ, ఉద్దేశాల్ని, ఉద్రేకాల్నీ, ఉన్న స్థితిని, మీతో పంచుకొవాలనుకునే నా ఈ చిన్న ప్రయత్నాన్ని ఆదరించి, అభినందిస్తారని, ఆస్వాదించి ఆహ్లాదిస్తారనీ, తప్పిదాలుంటే, దిద్దుకునే అవకాశమిస్తారనీ ఆశిస్తూ, మిమ్మల్ని "కవన వనం"లోకి, ఆహ్వానిస్తూ, మీ వంశీ..

Wednesday, 9 May 2012

*అమ్మ పోయింది*


శుక్రవారం,
వెన్నెలింకా కురుస్తుంది
అమ్మ నిద్దట్లోనే నిద్రించింది,

అన్నీ నాతో చెప్పే అమ్మ,
ఇదెందుకు చెప్పలేదని నమ్మలేదు,

చుట్టాలొచ్చారు
ఏడిపించారు,
నమ్మించారు

బంధువులు తింటున్నారు,
స్నేహితులు తాగుతున్నారు,
ఇక్కడొకరు నిర్యాణించారని చెప్తే తప్ప తెలిసేట్టు లేదు

మొదటిసారి డేవుడంటే కోపమొచ్చింది,
కానీ, అమ్మ కూడా దేవతే కదా

అమ్మ చెప్పేది "నేను పోతే ఏడవొద్దురా, ఇదే ఇంట్లో మళ్ళీ పుడతా"

చుట్టూ అందరూ ఉన్నా,
ఒక్కడూ మాట్లాడ్డం లేదు నాతో
మాట్లాడిస్తే ఏడవాల్సొస్తుందనేమో

ఎదురుచూస్తున్న నా నీడ,
తమ్ముడొచ్చాడు
అన్నా "తిన్నవా ఎమైనా, తెస్తా ఉండు",
కళ్ళు మసకైపోయాయ్, అమ్మ లేదని తెలిసాక నేను విన్న తొలి మాటకి,

సాయంత్రం కర్మ జరిపించి వాడెళ్ళిపోయాడు
"రేపటికి లీవ్ దొరకలేదు"
గొంతులో నిజాయితీ దాగలేదు
అన్నా"ఇంకెంత కాలం ఆలోచిస్తావ్ తన గురించి, పెళ్ళి చేస్కోవా"
అమ్మడిగినట్టు అన్పించింది

అన్నా నిన్నే, జాగర్త.
ఆదివారమొస్తా, పిచ్చి అలోచన్లేం పెట్టుకోకు
నా నీడ కనుమరుగైంది

ఇంట్లో ఒక్కడ్నే,
ఈపాటికి అమ్ముంటే.....
కనీసం నువ్వున్నా బాగుణ్ణేమో,
ఎందుకు విడిచెళ్ళావ్,
ఎక్కడున్నావ్.......

*వంశీ*

No comments:

Post a Comment