యోగ దీక్షా దక్షిత వర్ఛస్సుతో,
యాగ రక్షా ప్రోక్షిత రేతస్సుతో,
శవాల బూడిదొంటికి పూసి,
సుఖాల బంధాల ఇంటిని బాసి,
గరళం గొంతున ఆపి,
గంగని జటాల దోపి,
కంఠ ధరిత ఫణి పరివేష్ఠితమై,
కాంతి వేగపు పాశుపత భూషితుడై,
ప్రమధ గణా పరిపుల్లమై,
ప్రణవ రవ ఢమరుకా పరిపుష్టమై,
అతి శీతల హిమ మేఖల అనాచ్చాదితుడై,
గతి తప్పిన మహిమాసురుల, శిరచ్చేదకుడై,
జాబిలి బరువు మోసే చల్లని మనసుతో,
జనని భారం తీసే లయకారపు తనువుతో,
మారేడు దళానికే మురిసి,
ఆరేడు వరాలిస్తూ,
తియ్యని తిట్టుకే తడిసి,
కైలాసపు తలుపు తీసుకొనొస్తూ,
ఆనందానికీ, ఆవేశానికీ, తాండవిస్తూ,
ఆ నందికీ, పూజలో సమ స్థాయినిస్తూ,
అభిమానించిన మార్కండేయుడికి ప్రమిదగా పునర్జన్మనిస్తూ,
అవమానించిన దక్షుణ్ణి త్రినేత్రం తో,సమిధగా మారుస్తూ
లింగోద్భవుడై జన్మ రహస్యం గుర్తుచేస్తూ,
లీలా సంభవుడై సామ్యవాదపు గుట్టు చూపిస్తూ,
మనుషుల్లో మనిషై,
అనిమేషులకు అన్నీ తానైన,
శివుడొక్కడే,
దేవుడూ ఒక్కడే,
లోకేషుడతడే,
పూజ్యేషుడూ అతడే....
No comments:
Post a Comment