సంవత్సరాలైంది చూసి, ఏం మారలేదు,
అదే అందం, కూడా భర్తేమో,
బడికెళ్ళే వయసు పిల్లాడితో,
హనీమూనా,పిల్లాడ్నీ తీసుకొచ్చారే,
హోటల్ నవరతన్, రోతాంగ్ హిల్ సైడ్ కాటేజ్,,
పెయింటింగ్ ఎగ్జిబిషన్ కి సిమ్లా వొస్తే,
నన్ను పెయింటర్ చేసిన "ప్రకృతి" కన్పించింది,,
చూసి నవ్వా మర్యాదకి,
తనూ చూసి మొహం తిప్పుకుంది మర్యాదగానే,
పిల్లాడు మాత్రం నవ్వాడు అమాయకంగా,,
సాయంత్రం, భర్త, లిక్కర్ హౌస్ లో, రెడ్ వైన్ కొంటూ,
రాత్రి హోటల్లో డ్రింక్ ఆఫర్ చేసేంతగా పరిచయమయ్యాడు,
తెలుగువాడినని తెలియగానే.....
నా ఫోటో, వాళ్ళ ఫామిలీ ఫొటోలో
ఇమడదన్నంత చక్కగా ఉంది జంట,
తన ముందెప్పుడూ తాగలేదు
ఇపుడు, తెలియనట్టు నటిస్తూ తాగాలనిపించట్లేదు,
భర్త వదిలేట్టు లేడు, తూలుతున్నాడప్పటికే,
పిల్లాడెందుకో "అంకుల్" అన్నాడు,
రూంలోకెళ్ళిపోయింది వాడ్ని తీస్కుని,
అంత కోపంగా అప్పుడూ లేదు,
భర్తని రూంలో దిగబెట్టి వెళ్తూ, పిల్లాడితో
"అంకుల్" అనిపిస్తుండగా,
చెంప ఛెళ్ళుమంది,
ఏడుస్తూ వాడు,అయోమయంలో నేను,,,
"నువ్ దూరమయ్యాక తెలిసింది, నీ రూపం నాలో పెరుగుతుందని,
ఇదాయనక్కూడా తెలీనంత తొందరగా పెళ్ళైపోయింది"
ఏడుస్తున్న తన్ని చూసి, ఏడుపాపి భయంగా
తన కాళ్ళ వెనక దాక్కుంటూ, వాడు,
వణికే చేత్తో వాడి తల నిమిరి,
తన కళ్ళలో చూసే ధైర్యం రాక, బైటికొచ్చా,
తన చూపులు నన్ను గుచ్చుతున్నా
"డాడీ" పిల్లాడి అరుపు,
నన్నేనా,,, వెనక్కి తిరిగా,,,
భర్త,తన పక్కన, పడిపోతుంటే పొదిమి పట్టుకుంటూ,
కోపం దిగమింగుకుని, ఎర్రగా ఉరుముతున్న కళ్ళతో,
వేలి సైగతో నా దారి చూపిస్తూ,,
అదే నా ఆఖరి రోజు సిమ్లాలో
*వంశీ*
No comments:
Post a Comment