కవితా మిత్రులకు, నమస్కారం

నా భావాల్ని, భాషని, కలల్ని, కలవరింతల్ని, ఆనందాల్ని, ఆరని తడినీ, ఉద్వేగాల్నీ, ఉద్దేశాల్ని, ఉద్రేకాల్నీ, ఉన్న స్థితిని, మీతో పంచుకొవాలనుకునే నా ఈ చిన్న ప్రయత్నాన్ని ఆదరించి, అభినందిస్తారని, ఆస్వాదించి ఆహ్లాదిస్తారనీ, తప్పిదాలుంటే, దిద్దుకునే అవకాశమిస్తారనీ ఆశిస్తూ, మిమ్మల్ని "కవన వనం"లోకి, ఆహ్వానిస్తూ, మీ వంశీ..

Sunday, 6 May 2012

* ఏ నిమిషానికి ఏమి జరుగునో*


" ఓ పిల్లా. మీ అయ్యేడి"
ఇంత రాత్రి మా ఇంటికెవరొచ్చారన్న ప్రశ్న,
తెల్సుకోవాలన్న కుతూహలం,
వాళ్ళ సారా వాసన ఇంటి వెనకాల, వెన్నెలె కింద
పడుకున్న నాదాకా తాకుతుంటే,,

"అన్నా, ఎమి, గీ పొద్దు వొచ్చిండ్రు, బాపింకా రాలే, కైకిలి కాడ్నుంచి"అక్క,
భయాన్ని కనపడనీయకుండా, దీపం వొత్తిని చిన్నగా చేస్తూ

"తెలిసే వొచ్చినం, మీ తాగుబోతోడే పంపిండు,
మా బాకీ కాడికి నిన్ను జమచేసుకోమన్నడు" గ్రామపంచాయతిలో అటెండర్,
పగలు నాతో చెరువులో ఈత కొట్టేవాడేనా ఇలా మాట్లాడ్తుంది,,
దీపం మరింత చిన్నదైంది,,

వంటింటి దాకా వొచ్చారు,
కాళ్ళకడ్డంగా ఉన్న కొత్త కుండ పగిలిన శబ్దం
వాడితో మరో ఇద్దరు, పోల్చుకున్నాను వెన్నెల వెలుగులో

అక్క అరిచింది, నేను వాళ్ళ కాళ్ళ మీద పడ్డా,
బెదిరిస్తే కాళ్ళు మొక్కడమొక్కటే నేర్చుకున్న ఊరది,
వాళ్ళ వయసులో సగం లేని నేను,
ఎలా ఆపాలో తెలీక, అరిచాను ఇంటిబైటకెళ్ళి, అందరూ కూడారు,
3 పారిపోయిన అలికిడి గొడదూకి,

అక్క ఇలా ఏడవడం, అమ్మ పోయిన తర్వాతే,
ఆ రాత్రి చంద్రుడూ మాతోపాటు మేలుకున్నాడు,,
నాన్న మీద కోపంకన్నా. పగ పెరిగింది,,,,

తెల్లారుతుండగా నాన్నొచ్చాడు, ఆ ముగ్గురితో
అక్కని లాక్కెళుతున్నాడు
అమ్మలా కన్పించింది అక్క,
నన్నింకోసారి పోగొట్టుకుంటావా అని అడిగినట్టైంది,
అక్కను దూరంగా నెట్టి, దీపం బుడ్డి విసిరేసా,
మంటల్లో నాన్న, దసరాకి ఊరిబైట కాల్చే రావణుడిలా,
ఆ ముగ్గురు మాయమయ్యారు

పోలీసుల్ని తీసుకొస్తారని తెలిసేంత చదువుంటే, వాళ్ళని కూడా.....
ఇంకా ఎందరో అక్కలు సుఖంగా ఉండేవారేమో

చాలా ఏళ్ళు బోస్టన్ స్కూల్లో చదివించారు,
అక్క మొదట్లో చూడ్డానికొచ్చేది,
తర్వాత ఉత్తరాలొచ్చేవి,
చివరగా నేను పంపిన ఉత్తరాలు నాకే వొచ్చేవి,
ఇల్లు మారిందనుకున్నా

విడుదలై ఇంటికెళ్తే, అక్క, ఇద్దరు పిల్లల్తో,
గ్రామపంచాయితీ అటెండర్ గాడు కూడా,
చెయ్యి లేచింది గాల్లో, వాడి మెడ విరవడానికి
"తమ్ముడు, మీ బావరా, నమస్తే పెట్టు" అక్క,
మనిషి కూడా మారినట్టుంది
నా మెడ విరిచేసింది,
మనసును కూడా........

No comments:

Post a Comment