పొద్దునెప్పుడో పుస్తకం పట్టాను,
ఏడో తరగతి, చరిత్ర
పేజీలు తిరుగుతున్నాయి,
విషయం తరగట్లా,
ఐనా వాళ్ళలా ఎలా చేసుంటారు,
పిరికాడనుకున్నానే,
ఆ అమ్మాయిక్కుడా నాన్నంటే చచ్చే భయం, సర్పంచి,
ఐనా, నా ఖర్మ,
తెల్లారగట్ట బస్ కి పారిపోతూ,
పాలకోసం వెళ్ళిన నాకే కనిపించాలా
వాళ్ళ నాన్నకి తెలిస్తే
మా బాపు పని పోదూ
అన్నం సయించలేదు,
ఎప్పుడు ఇంటికి మనుషులొచ్చి నన్ను తంతారో అని
గొప్పింటి పిల్లని ప్రేమించొద్దా,
అసలు గొప్పోళ్ళంటే ఎవరు
రాత్రి నాన్న ఇంటికి రాలేదు,
వాళ్ళని వెతుకుతున్నారేమో
పొద్దున ఊరిలో దండోరా,
చెరువు పక్క దిబ్బలో రెండు శవాలు
భయమేసింది చూడాలంటే,
సర్పంచి ఆయన భార్య ఉరేసుకున్నారట
నాన్ననడిగాను, గొప్పోళ్ళంటే ఎవరని
"పరువు కోసరం పేణాలిచ్చేటోళ్ళేరా గొప్పోళ్ళు"
మనమిలాగే ఉందాం, గొప్పోళ్ళం కావొద్దు నాన్నా
నాన్న, నోట్లో చుట్ట జారిపోయినా, విరగబడి నవ్వుతూ
"నువ్ ఐతా అన్నా, మనల్ని కానీయర్రా ఈ నాయాళ్ళు"
నేనూ నవ్వాను, అర్ధం కాకపోయినా.........
No comments:
Post a Comment