అంతా రెడీయా, ఏంటాలస్యం,
చల్లారితే వేడిచేసుకు తాగడానికది "టీ" కాదు,
జోకేసాడెవడో
రొప్పుతూ "మీ ఫ్రెండ్, మున్నాని పోలిసులు తీస్కెళ్ళారు, పక్క స్టేషనే,"
పిడుగేసాడో సీనియర్
"మళ్ళీ ఎవడి కొంప కూల్చాడో" మరొకడు
దయ్యంలా ఉంది స్టేషన్, చీకట్లో, గుట్కా మరకలే గోడల్నిండా
డిసెంబర్ 31, నైట్ డ్యూటీ,గౌరవం పెంచింది ఖాకీలంటే
ఎస్సై గారు, నమస్తే,
-గార పళ్ళతో, ఎడమ చేత్తో బట్టతల గోక్కుంటూ,
ఎస్సై వొస్తడు, నేను "హెడ్డు",
ఎస్సై అన్నందుకు రెండంగులాల్లేసిన ఛాతీతో
ఒక మూల మున్నా, ఏడ్చి ఉబ్బిన కళ్ళతో, చొక్కా లేకుండా
సర్, మా వాడ్ని...
-హా, ఈవ్ టీజింగ్, న్యూసెన్స్ కేస్,
ఎలగోలా చూడాలి మీరే,
మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ మేమంతా
ఏదో తిట్టు, అర్ధం ఊహకందేలోపు,
2000 ఐతది, ఎస్సై వొస్తే ఇంకా ఎక్కువ,
విట్నెస్ స్ట్రాంగుంది,
మా అందరాస్తి, 4 నవ్వుతున్న గాంధీ బొమ్మలు, జేబులు తడిమితే,,
"రేయ్, రేప్పొద్దున వాడే వొదిలేస్తాడ్రా"
అక్కడేమైనా మిగిలిందో, లేదో అన్న బాధలో ఒకడు,
"అవునవును" మిగిలిన గొర్రెలు,
మీరెళ్ళి తాగి ఛావండి, వీణ్ణి తేసుకునే వొస్తా
కోపం ఆగలేదు, పానం స్నేహాన్ని మరిపిస్తుంటే....
కాలెండర్ పాతైపోడానికింకా 10 నిమిషాలు,
స్టేషన్లో వాడు, హెడ్డు , నేను,,
టేబుల్ని చీప్ లిక్కర్, బిర్యాని ఆక్రమించాయి,
ఎస్సై రాడనర్ధమైంది,,, సర్, మీరడిగినంత లేవిపుడు,
మిగతావి రేపిచ్చేదా,
"ప్రాక్టికలెక్జాంలో ఎక్స్టర్నల్ కూడా చూడనంత కోపంగా హెడ్డు" ,
-"మెళ్ళొ గొలుసో, వేలికుంగరమో నీది కాదనుకుని", వాడ్ని తీస్కుపో,
వేలి ఉంగరం చూసినట్టున్నాడు,,
వెలిగింది మున్నాగాడి మొహం ఆశగా నా ఉంగరం చూస్తూ,,
నిశ్శబ్దం గడియారాన్ని 12సార్లు కొట్టింది,
బైట సంబరాలు, అరుపులు,,
-"అమ్మాబాబులు చదూకోండ్రా అంటే, తాగి
తూలుతార్రా", ఉంగరం దక్కదేమో అన్న అసహనంతో
సర్, మర్యాదిచ్చి మాట్లాడండి,
నాకంత దైర్యమెప్పుడొచ్చిందో...
"మీకేంట్రా ఇచ్చేది" ఇంకేదో తిట్టేలోపు,
ఉంగరం విసిరికొట్టి బైటపడ్డాం,
టేబుల్మీద సీసా కింద పడ్డా చూడకుండా,
బీరువా సందులో ఉంగరం వెతుకుతూ హెడ్డు,,
2నెల్ల తర్వాత, ఉస్మానియా ఆస్పత్రిలో,
తాగి,పడి చివరిక్షణాల్లో ఉన్న కొడుకు పక్కన,
బలవంతంగా ఏడుపాపుకుంటూ హెడ్డు, నన్ను
గుర్తుపట్టినట్టున్నాడు
నా ఉంగరం కొడుక్కిస్తే, వాడదమ్మి, తాగి, పడి..
మార్ట్యురీలో ఇంకో శవం పెరిగింది,
కొత్త బేరం దొరికిన హుషారులో వాచ్ మాన్,
ఎదురుగా కనిపిస్తున్న హైకోర్ట్ ని న్యాయమడుగుతూ హెడ్డు
"చంపింది నేనా, ఉంగరమా" అని
No comments:
Post a Comment