కవితా మిత్రులకు, నమస్కారం

నా భావాల్ని, భాషని, కలల్ని, కలవరింతల్ని, ఆనందాల్ని, ఆరని తడినీ, ఉద్వేగాల్నీ, ఉద్దేశాల్ని, ఉద్రేకాల్నీ, ఉన్న స్థితిని, మీతో పంచుకొవాలనుకునే నా ఈ చిన్న ప్రయత్నాన్ని ఆదరించి, అభినందిస్తారని, ఆస్వాదించి ఆహ్లాదిస్తారనీ, తప్పిదాలుంటే, దిద్దుకునే అవకాశమిస్తారనీ ఆశిస్తూ, మిమ్మల్ని "కవన వనం"లోకి, ఆహ్వానిస్తూ, మీ వంశీ..

Friday, 4 May 2012

*అతను-ఆమె*


అతను,,,,
ఇద్దరం డాక్టర్లమే,
పరిచయం ప్రేమై 6 ఏళ్ళు,
ప్రేమ పెళ్ళై 4 ఏళ్ళు,
పెళ్ళి పాపై 3 ఏళ్ళు, కానీ ఇప్పటికీ బంధమే బలం కాలేదు,

సర్జన్, గైనకాలగిస్ట్ కలిస్తే మంచి నర్సింగ్ హోం ఔతుందేమో
కానీ, మంచి హోం కాదు,
అలా అని పెద్ద గొడవలేం లేవు, ఉన్నవన్నీ "ఇగో" గోలలే,

రోజూ అరగంట మించి మాట్లాడుకోలేని ఆలూమగలం,
ఒకే బెడ్రూం, ఒకరు పడుకుంటే,ఒకరు పేషెంట్ తో..
బావుండేది,పెళ్ళవకముందే, అయ్యి,
భాద్యతల్ని పెంచింది, దూరాల్ని కూడానేమో,

అడగాలనుకున్నా "పాపకోసం ఆయా ఎందుకు,నువ్ లేవా",
కానీ, ఎక్కడ నువ్ నిన్నింట్లోనే ఉండమంటున్నా అనుకుంటావని........

అపుడపుడు బైటికెళ్ళొద్దా, నలుగురితో పరిచయాలొద్దా,
మనకోసమెవరొస్తారు, ఒకరినొకరం చూస్తూ కూర్చుంటే,

కాస్త పని తగ్గించుకునింట్లో ఉంటేనేం,
పది కాన్పులు చేస్తే గానీ తిండి దొరక్కుండా ఉన్నామా,
పాపకీవయసులో నువ్ కావాలి,
నాకు మాత్రం వొద్దా నువ్,
-" అధికారం కాదు, సలహా అనుకో"

ఆమె,,
ప్రేమించేప్పుడెన్ని చెప్పావ్
"పిల్లలొద్దు 4ఏళ్ళవరకు, ఆర్ధికంగా ఎదిగాకే అన్నీ,
నువ్ నన్ను చూస్కో చాలు, పాపన్నేను చూస్కుంటా"
నేనూ నమ్మాను, అందరాడాళ్ళలాగే,
నువ్వూ మర్చిపోయావ్, అందరి మొగుళ్ళలాగే,,

తెలుసా నీకు, మనకే మనం భారమైనపుడు,
గర్భం మోస్తుంటే ఎలా ఉంటుందో,,
ఐతే హాస్పిటల్, పోతే మీటింగ్స్, పాపనెన్నడైనా ఆడించావా

నాన్నలా అన్పించావ్
"చదివింది, ఇంట్లో కూచోడానిక్కాదు" అన్నువ్వన్నపుడు,పెళ్ళిలో,
ఇపుడెలా మారావు,
ఇద్దరికీ ఉంటేనే "ఇగో" గొడవలంటారు,

పాపకోసం మీ అమ్మని రమ్మంటే రాదు,
మా అమ్మొస్తా అంటే వొద్దు,, ఎలా చచ్చేది,
పాపనెలా చూస్కోవాలో నువ్ నాకు నేర్పిస్తున్నావా,
నేన్నిజంగా నీక్కావాలనిపిస్తే ముందు దిగు, నేనూ దిగుతా,,,

తెగుతున్న బంధాల కంటే,
చిగురిస్తున్న పరిచయాలు ముఖ్యమా,
నువ్వింటికెప్పుడెలావొస్తున్నావో,తెలుస్తుందా,
నిద్రలో భయపడి అదేడ్చినపుడు,
నువ్వెక్కడున్నావో కూడా తెలియకుండా పోతే,,
ఎందుకీ ప్రేమా, ఎవరికోసమీ పెళ్ళి
-సలహా కాదు, అభ్యర్థన అనుకో,

*వంశీ*

No comments:

Post a Comment