కవితా మిత్రులకు, నమస్కారం

నా భావాల్ని, భాషని, కలల్ని, కలవరింతల్ని, ఆనందాల్ని, ఆరని తడినీ, ఉద్వేగాల్నీ, ఉద్దేశాల్ని, ఉద్రేకాల్నీ, ఉన్న స్థితిని, మీతో పంచుకొవాలనుకునే నా ఈ చిన్న ప్రయత్నాన్ని ఆదరించి, అభినందిస్తారని, ఆస్వాదించి ఆహ్లాదిస్తారనీ, తప్పిదాలుంటే, దిద్దుకునే అవకాశమిస్తారనీ ఆశిస్తూ, మిమ్మల్ని "కవన వనం"లోకి, ఆహ్వానిస్తూ, మీ వంశీ..

Tuesday, 15 May 2012

*అమాయకుడు*


అంతా పిచ్చోడంటున్నారు,
మీలా మామూలోణ్ణే రెండేళ్ళ క్రితం,
మూర్ఛొచ్చి పడేసింది, స్పృహొచ్చాకా ఇక్కడున్నా,
ఇపుడు బైటికెళ్తున్నాననుకోండీ,

- "హలో, కంట్రోల్ రూం,
ప్రమాదకరమైన పేషెంట్ తప్పించుకున్నాడు,
గది కిటికీలు రూమ్మేట్ తలతో పగలగొట్టి,
ఎలా ఉంటాడా, ఆమయకంగా కన్పిస్తాడు చూడ్డానికి"

ప్రేమించి పెళ్ళడిన భార్య, సౌఖ్యాలకాశపడి
పై అధికారితో తో గడుపుతుంటే, అడ్డొచ్చిన్నన్ను
పిచ్చోడ్నని చెప్పి పంపారిక్కడికి,
జరిగిందేమని చెప్పను, ఎవర్తో చెప్పను,
వాళ్ళని చంపి లోకమంతా విన్పించేట్టు నిజం చెప్పాలనుంది,

-"హలో, పోలీస్టేషన్,
ఇక్కడొకర్ని చంపాడొకడు,
చాలాసేపేదో మాట్లాడాడు శవంతో,
పిచ్చొడా? చూడ్డానికమాయకంగా ఉన్నాడ్సార్"

ఆకలి తగ్గింది, అది బ్రతికే ఉందింకా
నాకేం సరదానా, చంపడం,
రెండేళ్ళు, రోజూ కరెంట్ షాకిస్తూ,మింగించిన మందులకు
మగాణ్ణని మర్చిపోయి,
భయపెట్టే మృగాల మద్య ఒంటరిగా ఉండడం,
మనుషులపై ఎంత కసి పెంచుతాయో తెలుసా,
నిన్ను, పై ఇంటికి పంపడానికొస్తున్నానే మనింటికి,

-ఎవర్నువ్వు, ఎందుక్కొడ్తున్నావ్, హా, అమ్మాహ్,
నా రక్తం పీల్చిన నీ రక్తం తాగడానికి,
తలా, మొండెం వేరయ్యేంతవరకూ,
పోలీసులొచ్చి ఆపేంతవరకూ,
కత్తి తన పన్తాను చేస్తూనే....

"డాక్టర్, ఆ పేషెంట్ మానసిక పరిస్థితి...
అదే, కుటుంబం, భార్యా అని, పెద్ద కథ చెప్పాడింటరాగేషన్లో "
ఏం జరుగుతుందో అర్ధం కాని సర్కిలినిస్పెక్టర్

"అసలు పెళ్ళైతే కదా,
వాడో "డేంజరస్ స్కిజోఫ్రీనియాక్",
జూదమాడొద్దన్నారని తల్లి, తండ్రి, అన్న వదిన్ని, ఇద్దరు పిల్లల్ని
ఘోరంగా చంపాడారేళ్ళక్రితం,
అప్పట్నించి ఈ అసైలమ్ లోనే పెట్టాం "

"సార్, నా పిల్లలేడుస్తారు నేను కన్పించకపోతే,
ఇంటికి పంపరూ", చూసేవాళ్ళ గుండె కరిగేలా వాడు...

Monday, 14 May 2012

*సౌందర్య రాహిత్యం*


కాల్చేయాలా కనపడే అందాలన్నీ
అందీ అందనట్టుంట్టుంటే,
కూల్చేయాలా పొరబడే అద్దాలన్నీ
నేను నాలా అన్పించనట్టంటుంటే,
కలహించాలా జోడైన అనుభవాలన్నీ
ఇంకా ఆశ పెంచుతుంటే,
కరిగించాలా తోడైన నీ భావాలన్నీ
కదలని కన్నీట కన్నెర్ర చేయిస్తుంటే,

కసిరించాలా ముసిరే నూతన సుఖాలన్నీ
నిజమైన సంతోషం కలవరపడుతుంటే,
కౌగిలించాలా మరచిన శుభాలన్నీ
"కల" వరమైనట్టు వొచ్చిపడుతుంటే,
కోపం చూపాలా, సాంస్కృతిక వనాన్ని విడిచి
వసంతం పావనమైనా అనుకుంటే,
ఖర్మనుకోవాలా, యాంత్రిక వ్రణం
పగిలి జనాలు నిజాలు మరుస్తుంటే........

Sunday, 13 May 2012

అసలు విష(య)0


"ఏమైందే, గట్ల దగ్గవడ్తివి,
రెణ్ణెల్ల మాపు పట్నమోల్లొచ్చిన్నప్పటిసంది" మల్లవ్వ, కూతుర్తో,

-"ఆల్లు మందుల కంపెనోల్లంటనే,
పైసలిస్తం,పరీక్షలకు రక్తమీమంటే ఇచ్చినం,
మస్తు మంది ఇచ్చిన్రు,అందర్కి నాలెక్కనే అవవట్టె,
మాపటికి రాజి గాడు రక్తం సుత కక్కుకున్నాడు,
గాభరై చెప్పకున్నడు నీకు"

"పాణం మీద్కి తెచ్చుకున్నారే,పైసలాశకు
డాక్టర్ కాడ్కిపోదాం పా, ఏమైతదో ఏమో, రామ శంకరా,
గాశారం బాలేక గట్క తిని బతికిటోల్లమైతిమి"

"ఏం ఫికర్ చేయక్ మల్లవ్వా, మేమ్ లేమా ఏమన్నైతే,
జెర్రంత పెయ్యి గరమైంది, సలిజ్వరమోలే,
గీ మందులేపియ్యి,మల్లొచ్చే బేస్తారం రాండ్రి,
తగ్గకపోతే రక్తపరిక్ష చేద్దాం"ఊరంతటికీ ఒకే డాక్టర్

గట్లనే,నీ కాల్మొక్త బిడ్డా, సల్లగుండు, పొయ్యొత్తునా నేను,

"నమస్తే సార్,
పన్జేస్తుంది మనమెక్కించిన వైరస్,
ఇమ్మనట్టే మీ కంపెనీ మందులిచ్చినా,
వారమాగి చెప్తా రిసల్ట్, మరి, నేనడిగింది...."

"నువ్వేంటి చెప్పేది, వాళ్ళు చస్తే మందు పనిచేయనట్టే,
పనయ్యాకే నువ్వడిగిందీ" ఫార్మా కంపెనీ సి.ఇ.ఓ,

"ఓరి యాది,నర్సి, మల్లేశూ
డాక్టర్ సాబ్ మందులిత్తాండు రోగానికి,
తెచ్చుకోపోర్రి, పైలముల్లో" డాక్టర్ని దేవుడనుకునే దరిద్రలక్ష్మి.....