పగిలిపోతున్న తల,
లోపలేదో మైక్రో బిగ్ బాంగ్ విస్ఫోటిస్తున్నట్టు,
బైటి కక్ష్యలోనెలెక్ట్రాన్ దారితప్పి కేంద్రకోద్గారమౌతున్నట్టు,
ప్లాటీహెల్మింత్ పరాన్నభుక్కులు మెదడుకెక్కి కాల్షియం గోడకడ్తున్నట్టు,
క్రషర్లో పడి పర్వర్టాలోచన్ల రసం చిమ్మి రహస్యాలేవో రేపుతున్నట్టు,
మస్తిష్క్కప్పుట్టలోంచి జారుతున్న వెన్నుపాము బరువుకి, పూసలు పిండైతున్నట్టు,
రౌరవపు నదిలో ఆక్సీజన్ మాస్కుల్లేక దూకుతున్నట్టు,
పర్వతపు తుదిలో, విచ్చుకోని పారాచూటేస్కుని పడ్తున్నట్టు,
సైకతపు ఎడారి ఎండలో బట్టల్లేక కూరుకున్నట్టు ,
దైవతపు ఆరోహణా సడిలో కర్ణభేరి కంపించే అతిశ్రుత "ఒపేరా"
తాకుతున్నట్టు,
ప్రాకృతపు పరాగరేణువేదో నాసికలో నక్కి నూటొక్క తుమ్ములేయిస్తున్నట్టు,
నరాల్లో గాఢ సల్ఫ్యూరికామ్లం, నిగూఢంగా పారుతున్నట్టు,
కణాల్లో మైటోకాండ్రియాలు పన్జేయమని నినదిస్తూ పారిపోతున్నట్టు,
కిరణాలు,అతినీల లోహితమై చర్మాన, గోళీలాటక్కన్నాలేస్తున్నట్టు,
మరణాలు మఫ్టీలో నిదానంగా దగ్గరికొస్తున్నట్టు,
ఎక్కడున్నావ్ నువ్,
నవ్వుతున్నావా చూసి,
ఒక్క సైగతో ప్రాణం పోయగలిగీ....
నాకేంటనుకుంటున్నావా చస్తే,
ఒక్క స్పర్శతో, పునరుజ్జీవింపగలిగీ...
No comments:
Post a Comment