కవితా మిత్రులకు, నమస్కారం

నా భావాల్ని, భాషని, కలల్ని, కలవరింతల్ని, ఆనందాల్ని, ఆరని తడినీ, ఉద్వేగాల్నీ, ఉద్దేశాల్ని, ఉద్రేకాల్నీ, ఉన్న స్థితిని, మీతో పంచుకొవాలనుకునే నా ఈ చిన్న ప్రయత్నాన్ని ఆదరించి, అభినందిస్తారని, ఆస్వాదించి ఆహ్లాదిస్తారనీ, తప్పిదాలుంటే, దిద్దుకునే అవకాశమిస్తారనీ ఆశిస్తూ, మిమ్మల్ని "కవన వనం"లోకి, ఆహ్వానిస్తూ, మీ వంశీ..

Saturday, 24 March 2012

అంతరాత్మ


చెప్తూనే ఉన్నా,
విన్నావా, ఛావిక,
మాట్లాడవేం, నోరు పెగల్దా,
నీ అంతరాత్మకే నీళ్ళు మింగితే,
నలుగురికీ పలుచనవవూ,
నీలో నీకు తెలీని వైరుధ్యాలుంటే, ఒప్పుకోక దాటేస్తావేం,
నీ వాళ్ళ ప్రశ్నలు పొడుచుకుని ఏమైపోతావిక,

తేలిపోయావ్, జీవితం తేలిగ్గా తీసుకుని,
సోలిపోయావ్, గమ్యం మరచి పడుకుని,
పడిపోయావ్, గమనమాపి గాలిమేడలెక్కి,
తవ్వుకున్నావ్, నిన్నలోనే ఉండి, రేపటికి గొయ్యి,

ఏం మిగిలిందిక, దైర్యం తెచ్చుకోడానికి,
ఏం జరిగిందసలు ఇక్కడిదాకా జారిపడ్డానికి,

మాట్లాడిప్పటికైనా
మెదడుతో మనసుకి లెంపకాయ కొట్టి,
పోట్లాడిప్పటికైనా,
ఆశతో నిస్పృహకి నిప్పు పెట్టి,
పోరాడికనైనా నేర్పుతో ముసుకున్న తలుపులు తెరిచి పట్టి,
ఆపు ఇకనైనా ,
ఒదార్పు కోరే దివాలాతనాన్ని దూరం నెట్టి,

సాయం రాడెవడు,
గెలిచే గుర్రాలపైనే పందెమిక్కడ,
సమయమూ ఇవ్వడెవ్వడూ,
గేలి పడే సోమరులకు స్థానమే లేదిక్కడ,
నీ స్వగతమూ వినడెవ్వడు,
ఎవడి గతం, వాడి ఊబి ఇక్కడ,
స్మరణమూ చేయడ్నిన్నెవడూ,
రణాన విజయులైతేనే చిరస్మరణీయులిక్కడ,

లే,
కాలం కరిగి, కొట్టుకుపోకముందే,
శూన్యం కలిసి, కథ ముగియకముందే,
రుధిరం చల్లబడి కారణాలు వెతక్కముందే,
రౌద్రం తెగిపడి సంతృప్తి నటించకముందే,
ఖేదమే ఆమోదమై కనపడని మోదాల్ని కప్పేయకముందే,
వేదనే ఆవేదనై, కళ్ళూహించే కలల ఎత్తుల్ని కూల్చేయకముందే

నేనున్నా నీకు,
నేనన్నీ నీకు,
ఎందుకంటే,
నేను నీ ఆలోచనని, ఆనందాన్ని,
నేను నీ అనుభవాన్ని, అభిమానాన్ని,
నేనే నీ, ప్రతి భాగాన్ని, పూర్తవని యాగాన్ని....

No comments:

Post a Comment