కవితా మిత్రులకు, నమస్కారం

నా భావాల్ని, భాషని, కలల్ని, కలవరింతల్ని, ఆనందాల్ని, ఆరని తడినీ, ఉద్వేగాల్నీ, ఉద్దేశాల్ని, ఉద్రేకాల్నీ, ఉన్న స్థితిని, మీతో పంచుకొవాలనుకునే నా ఈ చిన్న ప్రయత్నాన్ని ఆదరించి, అభినందిస్తారని, ఆస్వాదించి ఆహ్లాదిస్తారనీ, తప్పిదాలుంటే, దిద్దుకునే అవకాశమిస్తారనీ ఆశిస్తూ, మిమ్మల్ని "కవన వనం"లోకి, ఆహ్వానిస్తూ, మీ వంశీ..

Thursday 22 March 2012

* ప్రస్థానం *


చెదల్తో, శిథిలమైన అడుగుజాడల్లో, అడుగేస్తూ,
చీకట్లో కలిసున్న శైశవ సాక్ష్యాల్ని దారడుగుతూ,
అవని పొరల్లో పారేస్కున్న ఖండిత శిరస్సుల్ని పోల్చుకుంటూ,అవన్నీ నావేనా అని ఆశ్చర్యం నటిస్తూ,

ఎప్పటి మాటలో, ఎన్నటి మంత్రాలో
చెవిన పడ్తుంటే,
ఎవరి గాయాలో మరెవరి గర్జనలో
పట్టి ఆపుతుంటే,
ఎక్కడి కలలో, మరెక్కడి కామనలో
చూపు లాగుతుంటే,
అవ్యక్త ఆనందాలో, అపసవ్య అనురాగాలో
అలోచనలో పడేస్తుంటే,
చూడకుండా ముందుకు సాగుతూ,

కళ్ళాపిన కాళ్ళకి తగిలిన, నా నిర్జీవ దేహాలు,
చరిత్ర కప్పుకున్న సమస్త నాగరికతల్ని,
నా సహస్ర నామాల్నీ పరిచయం చేస్తుంటే,
మనసు మాత్రమే చూడగల్గేంత దూరాన,
నిష్క్రమించే దోవ మూస్తున్న "నా" వెనక,
శోకిస్తున్న "నా" ముందు,
సుఖాల లెక్కలేస్తున్న "నా" పక్కన,
నేనంటిస్తున్న చితిలో, ఆసీనుడినైన నేను,
ఆహ్వానించిన "నాకు",
అద్వైతమర్ధమౌతున్న,
అనంతమందుతున్న,
అంతరంగమావిష్కారమౌతున్న,
అనాది ఆకలి తీరుతున్న భావన తోడురాగా

కాష్టంలో కలిసి కరగడానికి దూకుతున్న "నేను",
నా కాయానికి కాపరినై కపాలమోక్షం కలిగిస్తూ నేనే...

No comments:

Post a Comment