అక్షరాలంటుకున్నాయి, ఆర్పకండి,
మండనివ్వండలాగే,
ఏళ్ళుగా మౌనాల్లో సమాధి కట్టుకుని,
చాన్నాళ్ళుగా మానవుల గాయాలు తట్టుకుని,
చచ్చాయనుకున్నక్షరాలు కాల్చడానికొస్తున్నాయి,
పారిపోకండి,
ఎర్రగా వేడెక్కినక్షరాలెప్పటికీ కరగని గుర్తులు పెడుతుంటే,
ఏమార్చనక్షరాలు మార్పుకి సంకేతమిస్తుంటే,
తట్టుకోండి,
తిట్టుకోకండి,
నల్లగా కముల్తున్న చర్మప్పొరలు పాలిపోయి,
పొక్కులొచ్చినవయవాలు చూసి భయపడకండి,
కొత్త కవచమొస్తోంది
అక్షరాల శరాల వరాలతో,
ఎప్పుడూ వసంతమైతే వాడిపోవడమెలా తెలుస్తుంది
ఎన్నడూ వినోదమేనా, వీడుకోళ్ళెవరు నేర్పుతారు,
తిరుగుబాటు కాదండోయ్,
పొగరుమాటా కాదు,
విప్లవం తేదండోయ్,
వీరావేశమూ లేదు,
ఎవరది,
మంటలార్పి అక్షరాల మతి పోగొడ్తోంది
మాయచేసక్షరం దారి మళ్ళిస్తుంది,
నిన్నే..... ఎవర్నువ్వు,
యుగాల పోరాటంలో చచ్చి పుట్టినక్షరాల్ని,
క్షరమవమంటుందెవరు,
జాగృతినుండి సుధీర్ఘ సుషుప్తికి తిరిగి తోస్తుందెవరు,
"మనిషిని",
మనసు లేని మస్తిష్కాన్ని,
మస్తిష్కాన నింపుకున్న మాయా అస్థిత్వాన్ని,
అస్థిత్వాన్నెపుడో కోల్పోయిన అనాగరికుణ్ణి,
అనాగరికతే ఆత్మగాగల నాగరికుణ్ణి.....
No comments:
Post a Comment