నీ నవ్వు,
ఎక్కడో పువ్వు పుట్టిన పరిమళంలా,
ఎవ్వరో వెన్ను తాకిన పరవశంలా,
ఎన్నడో నన్ను పిలిచిన నీ స్వరంలా,
ఎందుకో మదిని వీడని ఓ క్షణంలా,
ఎప్పుడో దేవుడిచ్చిన తొలి వరంలా,
నీ నవ్వు,
నవ్వునే నవ్వించేట్టు,
ఏడుపునీ జోకొట్టేట్టు,
కష్టాన్నీ కవ్వించేట్టు,
కవుల్నీ కదిలించేట్టు,
వేసవిలో వానొచ్చేట్టు,
జాబిలికే వయసిచ్చేట్టు,
జాములనే ఆపేసేట్టు,
జ్యోతులకే వెలుగిచ్చేట్టు,
నీ నవ్వు,
అన్నింటినీ మరిపించేట్టు,
అమృతం కురిపించేట్టు,
అద్భుతం అనిపించేట్టు,
అమాయకత్వం కనిపించేట్టు,
డోపామిన్ లో మునిగించేట్టు,
ఎండార్ఫిన్స్ మింగించేట్టు,
గుండె వేగం పెంచినట్టు,
గాఢ మైకం పొంచినట్టు,
నీ నవ్వు,
బెంజీన్ ని పొలీమరీకరించేట్టు,
బజ్జీలకు ఘాటు రుచినిచ్చేట్టు,
డీ.ఎన్. ఏ కొత్త ప్రొటీన్ పుట్టించేట్టు,
ఎవడికీ దొరకని "డాన్"గాడ్నీ పట్టించేట్టు,
వెన్నెల్లో వెనీలా తింటున్నట్టు,
వేడి కాఫీకి మూతి కాలినట్టు,
ఫస్ట్ బాల్ కి సచిన్ సిక్స్ కొట్టినట్టు,
ఫాస్ట్ కార్ కి బ్రేకుల్లేక దూసుకెల్తున్నట్టు,
ఏజ్ బార్ కీ కొత్త ఆశలు పుట్టించేట్టు,
చాకో బార్ కంటే తియ్యగా అన్పించేట్టు,
నీ నవ్వు,
గుడి గంటంత భక్తిగా,
బడి పలకంత కొత్తగా,
వరిపొలమంత బరువుగా,
చిగురాకంత మెత్తగా,
నీ నవ్వే.....