కవితా మిత్రులకు, నమస్కారం

నా భావాల్ని, భాషని, కలల్ని, కలవరింతల్ని, ఆనందాల్ని, ఆరని తడినీ, ఉద్వేగాల్నీ, ఉద్దేశాల్ని, ఉద్రేకాల్నీ, ఉన్న స్థితిని, మీతో పంచుకొవాలనుకునే నా ఈ చిన్న ప్రయత్నాన్ని ఆదరించి, అభినందిస్తారని, ఆస్వాదించి ఆహ్లాదిస్తారనీ, తప్పిదాలుంటే, దిద్దుకునే అవకాశమిస్తారనీ ఆశిస్తూ, మిమ్మల్ని "కవన వనం"లోకి, ఆహ్వానిస్తూ, మీ వంశీ..

Friday, 22 June 2012

* నువ్విష్టం నాకు *



నువ్విష్టం నాకు
నా పేరు మరిచేలా చేస్తున్నందుకు
నీ పేరు పలికేందుకు ఎగిరిగంతేయిస్తున్నందుకు
వేదనలొ సంతోషం వెతికిస్తున్నందుకు
నవ్విస్తూ కన్నీరు తెప్పిస్తున్నందుకు

నువ్విష్టం నాకు
నా కంటే నువ్వే నన్నెక్కువ ఇష్టపడుతున్నందుకు
నన్ను ప్రేమించినంతగా నిన్ను ప్రేమించే అవకాశం ఇవ్వనందుకు
అది నీకు చెబితే, నవ్వి ఊరుకున్నందుకు
ఇద్దరమొకటే ఐనపుడు, ఎవరు గెలుస్తే ఏంటని మొట్టినందుకు

నువ్విష్టం నాకు
ఇప్పటికైనా నువ్ నాక్కనిబడినందుకు
నువ్ లేకుండా కష్టం అన్పిస్తున్నందుకు
ఇదంతా చదివి "ఇడియట్" అని తిట్టుకుంటున్నందుకు
నిజమేనా అని అమాయకంగా అడుగుతున్నందుకు

నువ్విష్టం నాకు
నన్ను రోజూ భరిస్తున్నందుకు
అలా అనకని వారిస్తున్నందుకు
నేనే మరచిన నా ప్రతి కోరికా, తీరుస్తున్నందుకు
అపుడపుడు విసిగించినా అర్ధం చేసుకుంటున్నందుకు

నువ్విష్టం నాకు
ఎంతో చెప్పలేనంత
నాకే తెలియరానంత
చెప్పినా, నువ్ ఒప్పుకోనంత
ఇంకెపుడూ నిన్ను వొదిలి పోలేనంత.....

Thursday, 21 June 2012

* ఏమో *



నేను ఉన్నాను, ఉన్నానంతే,
బ్రతకడం వరకే నే చేస్తుంది,
జీవించడం నీ చూపుల చలవేనేమో,

నేను నవ్వుతున్నాను, పిచ్చెక్కినట్టుగా
చూసేవాళ్ళకి భయమయ్యేంతగా
నిజంగా నేను నవ్వుతున్నానా
అన్నివైపులా నిన్ను చూడగలుగుతున్నానంతేనేమో

నేను నడుస్తున్నాను, కాదు పరుగెడుతున్నాను
నిన్నందుకోవాలని, నేనే నీకందాలనేమో
బహుశా, ఇది కూడా నీ పనేనేమో

నేను మాట్లాడుతున్నా, ఎడురుగా ఎవరు లేకుండానే
ఆ మాటలు, నాలోని నీతోనేమో

నేనేడుస్తున్నా, చూసి నాకే నవ్వొచ్చేంతగా
ఎందుకంటే, నువ్వు నాకు హాయిలో కంటే
బాధలోనే ఎక్కువ గుర్తొస్తావ్ కాబట్టి కావొచ్చేమో

నేను వెతుకుతున్నా, నన్ను నేను,
ఎక్కడెక్కడో, ఎమిటేమిటో, ఎపుడెపుడో,
నీ దగ్గరికేమైనా వొచ్చిందేమో
వొస్తే, వెనక్కి పంపకు
తిరిగి రావాలనుకుంటే నన్ను వీడేది కాదేమో
నిన్ను చేరడానికి రాదేమో

ఇప్పుడు, నీ మనసు నీ దగ్గరే ఉందా చూసుకో
అది ఇక్కడే నా పక్కనే కనపడ్తున్నట్టుంది
ఉన్నట్టు పొరబడిపిస్తుందేమో.......

Wednesday, 20 June 2012

*డామిట్, కథ అడ్డం తిరిగింది*



కోపమా
రాత్రి కల్లోకి రాలేదని,
అసలు నిద్ర పడితే కదా నీ తలపులతో

మన్నించవా
నువ్వొచ్చావట, తిరిగెళ్ళావట
నిన్ను గుర్తించలేని మగత కలల్లో నేనున్నపుడు

భావ్యమా
నాతో మాట్లాడననడం,
నీతో ఊసులాడని రోజు, సగం మాటలు మర్చిపోతుంటే

నమ్మవా
ఇలా, మరీ బెట్టు చేస్తే
మూగ ప్రేమికునిగా మారే ప్రమాదమూ ఉంటుంటే

నవ్వవా, సరే
ఒక్కసారి నన్ను తలచుకో
ఏడుపెందుకు,
భయపడేంత భీకరంగా కనిపిస్తునానా

హమ్మయ్య, నవ్వావా,
మనసు తలుపు తెరువ్
వొచ్చి చాలా సేపైంది
గుండెలు లాగేస్తున్నాయి

ఏమైంది
మళ్ళీ కోపమా,
ఎందుకొచ్చాననా??

డామిట్, కవిత మళ్ళీ అడ్డం తిరిగింది......

Tuesday, 19 June 2012

*పెళ్ళైన పాతలో (seven years itch)*



నా మది దరికి చేరడంవరకే నీ వంతు
ప్రతిష్టించడమా,
పరీక్షించడమా నా ఇష్టం

నీ ఆలోచనలు నాపై చల్లడం వరకే నీ వంతు
ప్రభావితమవడమా,
పట్టించుకోకపోవడమా నా ఇష్టం

నీ కన్నీళ్ళు, ఆనందాలు నాతో పంచుకోడం వరకే నీ వంతు
పెంచుకొవడమా,
మర్చిపోవడమా నా ఇష్టం

నీ ఏకాంతాలు, సరసాలు నన్ను ప్రసన్నించుకోవడం వరకే
ఆస్వాదించాలా,
విరసించాలా నా ఇష్టం

నీ ప్రేమలు, ప్రణయాలు నన్ను పరిణయించడం వరకే
కరిగిపోవాలో,
కలిసిపోవాలో నా ఇష్టం.......

Monday, 18 June 2012

* ఏది సత్యం... ఏదసత్యం *



తాగిన గరళం రక్తంలో కరిగిపోతుంది
ఆఘ్రాణించిన పరిమళం ఊపిరిలో నిండిపోతుంది
చెదిరిన స్వప్నం గతంలోకి జారిపోతుంది
ఫలించని మోహం కలల్లో కవ్విస్తుంది

చలించని మనసు ఎదురుచూపు చూపిస్తుంది
ప్రణయించని యవ్వనం అనుభూతిని కోల్పోతుంది
ఏడిపించిన అనుభవం నవ్వడానికి నటిస్తుంది
విభేదించిన స్నేహం, ఏదో మజిలిలో వికసిస్తుంది

విస్మరించిన బాధ్యత విచిత్రంగా బయటపడ్తుంది
వికృతంగా భయపెడుతుంది
కరిగించిన కాలం, అంతిమయాత్రకి దూరం తగ్గిస్తుంది
కసి పెంచిన యుధ్ధం, నీ లోపలికి దారి చూపిస్తుంది
వికటించిన పరువం, కన్నీటి పొర కప్పుతుంది

కన్పించని గమ్యం, అలుపులేని నడక నేర్పిస్తుంది
కదిలించిన దృశ్యం, అలవాటు లేని నడత మారుస్తుంది
కలహించిన మనసు నరకం చూపిస్తుంది......

Sunday, 17 June 2012

*విషాదం టు ది పవర్ విషాదం*



మనసుల ఘోష మనుషులకి పట్టదు
మనుషుల భాష మనసులని తట్టదు

పీల్చే శ్వాస అడిగి వీడదు,
పిలిచే ఆశ చెప్పి రాదు

సంవాదం తెరిచిన పుస్తకం పూర్తి కాదు
నిర్వేదం మూసిన మస్తకం తెరుచుకోదు

మరిచే మానసిక స్థోమత లేక,
గుర్తుంచే హృదయ ధారుడ్యం చాలక

నా గదిలోపల చీకటిలో,
చీకటి ముంచిన నా హృదితో

దిగంతాన్ని ఊహిస్తూ,
అద్భుతాన్ని ప్రార్ధిస్తూ
అమానుష మానుష చైతన్యస్రవంతిలో మునిగి
నిర్హేతుకాసహిత నిరీక్షణలో మిగిలి...

Saturday, 16 June 2012

*ఆ దీర్ఘమౌనం*



లోకపు కూడలిలో, నించున్న అతడు
ఎటు వెళ్తే, తనకి తాను దొరుకుతాడో తెలియక
ఏం చేసి, ప్రపంచానికి దూరమవాలో అర్దంకాక

చుట్టూ చేరుతున్న తోడేళ్ళగుంపుని చూసి,
లేని ధైర్యం ఎలా ఆవహించాలో అనుకుంటూ
తనని తాను,దహించేలా నిశ్వసించిన
వేడి నిట్టూర్పులో కరిగిన
ఆ దీర్ఘమౌనం.......

జన్మకి, పునర్జన్మకి నడుమ, మరో జన్మనిస్తూ
అవమానాల అవహేళనలని,
ఆకలి చూపుల ఆరని గాయాలని
ఓర్చుకోలేక తట్టుకుంటూ, గుండెల్లో దాచుకుంటూ
నిస్సహాయతల నలిగిన, నిశ్శబ్ద నీరవ జీవాలెన్నో కార్చిన
కన్నీటి కొలనులో,
ఆత్మ త్యాగం చేస్తూ కలిసిన
దీన స్తన్యం పలికిన.......
ఆ దీర్ఘమౌనం

మనసులు మార్చుకుని,
మమతలు చేర్చుకుని
విధిని వధించి,
విధానాలతో వాదించి
నిన్నటి ముళ్ళు పెకలించి,
రేపటి పూలబాటకై నేటి కలల్ని కవాతు చేయిస్తున్న
ధీర ప్రణయపు, ధన్య గమనపు గమ్యం
ఆ దీర్ఘమౌనం

*వంశీ*

Thursday, 14 June 2012

నేను నమ్మను



నేను నమ్మను,
జాజుల పరిమళం నీ వల్ల రాదంటే
పూజల ప్రతిఫలం, నీ చూపు తేలేదంటే
పాలరాతి సున్నితంలో, నీ ప్రతిభ లేదంటే
పావురాయి సౌకుమార్యం, నీ ప్రమేయం కాదంటే

నేను నమ్మాను,
రంగులన్నీ పోగేసినా నీ వర్ణం రాదంటే
హంగులన్నీ తీసేసినా, నీ అందం నీదే అంటే
లేత కొబ్బరికొచ్చిన రుచి, నీ ఎంగిలే అంటే
పాత ఆవకాయకిచ్చిన శుచి, నీ చేతులదే అంటే

Wednesday, 13 June 2012

4-2-3



ఎప్పుడైనా చూసావా,
ఇష్టంగా చదూకోవాల్సిన వయసులో
కష్టంగా చాకిరీ చేస్తూ,
ప్రశ్నించే అలవాటు మానుకుని,
స్వప్నించే ఆశలు నేలరాల్చుకుని
కల్మషం లేని కశ్మలంలో పుట్టి,
అఙ్నానంలో ఆరిపోతున్న బాలకార్మికులను
భావి భారత సమాజ నిర్మాణ నిర్దేశకులను

ఎన్నడైనా గమనించావా
తడి కూడా స్తిరంగా ఉండక, జారిపోయే
కన్నుల నెనక, ప్రతిబింబించే
సవాలక్ష భయాలను.
సత్తువలేని చేతుల్ని, జాలిగా చూస్తున్న ఊతకర్రలను
తోడు కావాలని, బాధగా అడుగుతున్న వారి ఒంటరితనాలను
చాదస్తాల వెనక ఎవరికీ అర్ధంకాని ఆత్మీయతల్ని
ఈ జీవితం, ఇంకొన్నాళ్ళపాటే అని తెలిసినా
బేలతనం బయటపడని మొండి ధైర్యాన్ని
నిన్నటి భారతపౌరుల్ని,
నేటి సమాజంలో ఇమడలేక క్షోభించే
గడిచిన గతకాల వైభవాలని

ఇప్పుడైనా గమనించు,
నిన్నటి నీ బాల్యాన్ని
నువ్ పొందిన ఎన్నో అవకాశాల్ని,
రేపటి నీ వయసుడిగిన వ్యక్తిత్వాన్ని
ఎవరికీ నీతో పనిలేని వైనాన్ని.......

Tuesday, 12 June 2012

*నిజంగా తెలీదు*



నిజంగా తెలీదు
లోకమింత అందమని, నా కళ్ళలో నిన్ను నిలిపేదాకా
మైకం ఇంత వింతని, నువ్విష్టం అని తెలిపేదాకా
కలలు నిజాలౌతాయని, ఆ రోజు నువ్ కలిసేదాకా
వలపు అబద్దం కాదని, నీ వలలో పడేదాకా

నిజంగా తెలీదు
శిలలు స్వరాలిస్తాయని, నువ్ నన్ను తాకేదాకా
దేవతలు వరాలిస్తారని, అడక్కుండానే ముద్దిచ్చేదాకా
ఊపిరాగడమంటే, నువ్ కాసేపు కనపడకపోయేదాకా
ఊహాలోకమంటే, నీ మాయలో నాకు నేను కనపడకపోయేదాకా

నిజంగా తెలీదు
ఒంటరితనమంటే, నీ తోడు దొరికేదాకా
ఒకరికొకరంటే, ఊరంతా మన గురించే మాట్లాడేదాకా
ప్రేమంటే, నువ్వెపుడూ నాతోనే ఉండాలనిపించేదాకా
ప్రాణమంటే, నేనే నువ్వని తెలిసేదాకా

Monday, 11 June 2012

*వేదం*



మనిషి ముసుగులో,
మనసు మసకలో
మనకై మనమే
మనలో మనమే
మంటలు రేపుకు,
మాయలు చూపుతు
మురిసిన ఆవేశంలో
ముసిరిన ఉన్మాదంలో
మంచిన చంపి ముంచేసిన ఛాందసంలో
మృగాల చరితను మరిపిస్తున్న యుగాలలో

మిగిలిన చిగురాకులపై,,
మొగ్గలు చితి పేర్చుకు,
ముగిసిన మూగగానం

మొదలవని యుధ్ధంలో,
ముందే కత్తి దూయడానికి
మండే కాగడాలని మించిన వెలుగులో

మనిషి మనిషితో,
మనిషి మనిషిలో
మారని తత్వం
మరవని సత్యం
మాయని దారుణం
మోయాల్సిన భారం

నేటి లోకం పాడే నిన్నటి శ్లోకం,
నూతన సుఖాన్వేషణలో నీ శోకం

వెతికే గమ్యం,
వెతల దాహం,
అదియే వేదం,
ఆదియే వేదం

Saturday, 9 June 2012

*చచ్చేదాకా బ్రతకాలి*



ప్రతిరోజూ బ్రతుకో పోరాటం
ఎలాగైనా బ్రతకాలనే ఆరాటం
భయం భయంగా బ్రతికే బ్రతుకు
నిజం నిజం, అది బ్రతుకే కాదు

గ్రీష్మాన దూషించిన సూరీణ్ణి,
శిశిరాన అనవసరం అన్నామా
హేమంతాల హిమబిందువులు,
ఆషాఢాన కోరుకోకుండా ఉన్నామా

నీకు లోకం అనవసరమైతే, లోకానికి నీ అవసరం లేదా
బ్రతకడానికి లేని ధైర్యం, ఛావడానికెవర్ని అరువడుగుతావ్

ప్రాణం లేని శిల శిల్పమైతే,
ప్రాణమున్న నువ్వు శల్యమౌతావా
గాయమవని వెదురు వేణువౌతుందా
దెబ్బ తినని మనసు రేపుకి రూపమిస్తుందా.........

అస్తమిస్తున్న రవిని, అర్నవం తనలో దాచుకోదా
అంతరిస్తున్న శశిని, నిశి తనలో పొదుముకోదా
ఆశయంతో ఉంటే నిన్ను, ఆశ దగ్గరికి తీసుకోదా
సంశయం చూపిస్తే, గెలుపు నీ వైపు చేరుతుందా......

*వంశీ*

Friday, 8 June 2012

*కలకలం*



ఎవర్నువ్వు,
-కవిని,
అంటే మనిషివి కాదా
-కాను,
మనిషి ముదిరితే, మనసు చెదిరితే

ఆపాపు, అర్ధమైంది, నువ్ కవివని,
నా కలలలోకానికి ఎందుకొచ్చావ్

-కలలు నిద్రని వెలేస్తే,
కాలం నన్నొదిలేసి ముందుకెళితే

ఆగక్కడే, నువ్ ఏదీ అర్ధమయ్యేలా చెప్పలేవా

-నేనేం పోగొట్టుకున్నానో తెలిస్తే కదా,
ఇక్కడ, నన్ను మర్చిపోయిన నా కలల్ని చూస్తే
నాకేంకావాలో తెలుస్తుందని,
వీలైతే నా చిన్ననాటి కలలు దొసిట్లో పోసుకెళదామని వొచ్చాను

సరే, వెతుక్కో పో, జాగ్రత్త,
పరుల కలల్ని తడితే, నిన్ను
నువ్వెప్పటికీ గుర్తించలేవ్

ఎంతసేపు,, తెల్లారుతుంది,
జాగు చేస్తే కలలు కరుగుతాయి
నువ్ శాశ్వతంగా బందీ అవుతావిక్కడే

ఓ మనిషి కాని కవీ, వినపడ్డంలేదా,
నీ లోకానికి వెళ్ళవా
ఎమిటీ రోదనలు, ఏం చేసావ్ నా లోకాన్ని

కలలన్నీ చెల్లాచెదురై ఉన్నాయి, ఏమైంది
ఫ్రాయిడ్నెవరు లేపింది,
హిట్లర్ ఎందుకేడుస్తున్నాడు
వివేకానందుడు ఉలిక్కిపడుతున్నాడేమిటి
కృష్నశాస్త్రి, శ్రీ శ్రీ వాదులాడుకుంటున్నారెందుకు

ఓ కవీ వెళ్ళిపో నా లోకంనుండి,
మళ్ళీ వొచ్చే సాహసం చేయకు

నీకు నీ కలలెన్నటికీ దక్కవు, కరువు నిద్రా తప్పదు,
పిచ్చి వాడిలా ఎమిటా చూపులు, చెప్పేది నీకే

- "ఎవరునేను?, ఇక్కడికెలా వొచ్చాను?"

Thursday, 7 June 2012

??????????


ఆనందం,
చచ్చేంత సంతోషం,
ప్రాణమయ్యేంత ఆహ్లాదం,
ఏం చేస్కోను,
ఒక్కడ్నీ,
ఎవరికి పంచను?
ఎవ్వరని, ఎక్కడని,
ఏమని చెప్పను?
ఎవ్వరికీ,ఎన్నడని,

ఆ వేదన,
రక్తమాగేంత ఆవేదన,
రిక్తమయ్యేంత సంవేదన,
ఎలా దాచన్నేను,
ఒంటరిని,
ఏమని సమాధానించుకోను?
నన్నేమని సమాధించుకోనూ?

ఆవేశం,
తనువంటుకునే ఆ వేషం,
తలనంటుకునుండే ఆ క్లేశం,
ఎలా భరించన్నేను?
ఓడిన నీడనై,
ఎలా చరించన్నేను?
ఎండిన మోడునై,

అనుభవాలు,
నా అనే భావాలు,
నడిచొచ్చే భయాలు,
ఎలా చూడన్నేను?
రేపునాలోచిస్తూ,
ఏం నేర్చుకోన్నేను?
రూపు మార్చుకుంటూ...

గతాల మాటలు,
ఘాతక మనుషులు,
గాయాల్చేసే మనసులు,
ఎలా నమ్మన్నేను?
నొప్పింకా తగ్గందే,
ఏమని నవ్వన్నేను,
నటనింకా తగలందే....