కవితా మిత్రులకు, నమస్కారం

నా భావాల్ని, భాషని, కలల్ని, కలవరింతల్ని, ఆనందాల్ని, ఆరని తడినీ, ఉద్వేగాల్నీ, ఉద్దేశాల్ని, ఉద్రేకాల్నీ, ఉన్న స్థితిని, మీతో పంచుకొవాలనుకునే నా ఈ చిన్న ప్రయత్నాన్ని ఆదరించి, అభినందిస్తారని, ఆస్వాదించి ఆహ్లాదిస్తారనీ, తప్పిదాలుంటే, దిద్దుకునే అవకాశమిస్తారనీ ఆశిస్తూ, మిమ్మల్ని "కవన వనం"లోకి, ఆహ్వానిస్తూ, మీ వంశీ..

Thursday, 12 April 2012


ఎందుకలా చూసి
టెస్టోస్టిరాన్ల వాగులో మునకేయిస్తావ్,
ఎండార్ఫిన్లతో ఏదో దారికి చేరుస్తావ్,
న్యూటన్ మూడో సూత్రం గుర్తొస్తున్నా,
నీలా నేను చూడగలనా అంత పవిత్రంగా,

అరె, మళ్ళీ,
కవ్వింపులాపవా,
అమావాస్యసలే, చంద్రుడూ సాక్ష్యం రాడు,
చీకటెలాగూ తనువుల్ని తనలో కలిపేస్తుందిలే,

నీ పరిమళాలు,
ప్రకృతిలో కూడా కానరానంత పురాతనమై,
ఈ పరిసరాలు
ప్రశ్నల్లోనే జవాబులు వెతికించేంత పురా"వర"మై,
ఏ పరికరాలూ,
పరిశోధించలేని ప్రణయావస్థలో పారే పరుగునై,

కాలుతున్న ఒంటికి
థర్మా మీటర్ పాదరసం కరిగి ఆవిరై,
పేలుతున్న గుండెకి
మానోమీటర్ గాలి విరిగి ఆయువై,
తూలుతున్న కాలికి, రాలుతున్న కలలని
అభేదిస్తూ న్యూరాన్లు నవ్వుతూ,
జారుతున్న స్పృహకీ, జోరునున్న ఊహకీ
లంకేస్తూ, రక్తకణాలు జాగారం చేస్తూ,
నువ్వూ నేనూ.....

Wednesday, 11 April 2012

* తత్వం *


పంచభూతాల భావాల కలబోత,
పంచేంద్రియ మానుష మరో రూపం,
సృష్టిన, ప్రతి కణపు అస్థిత్వం,
శత సహస్ర వర్ష శిలాజ స్థిరత్వం,

సత్వరజోతమ గుణ మిశ్రమం,
ద్వైతపు ద్విభావ సంశయం,
తాత్విక చింతనల సారం,
వేద విఙ్నానపు సర్వం,

వెలుగు మాటున చీకట్ల అధ్యయనం,
సత్యాసత్య విచక్షణల అధికారం,
గతకాలపు నాగరికతల నవీనత్వం,
మానవ పరిణామ ప్రాచీనత్వం,

మహాత్ముల ఆలోచనా చైతన్యం,
అధోజగత్సోదరుల ఆవేదనా చిహ్నం,
కాలపు తంత్రులపై యుధ్ధకాంక్ష
సంగీతీకరించిన రుధిర చిత్రం,

గ్రహాల అనుసంధానపు అద్భుతం, గురుత్వ తత్వం,
ప్రాణికోటి అభివ్యక్తీకరణల అన్వయం, మనస్తత్వం
భానుని అనుగ్రహ కిరణాల ప్రసారం ,దైవత్వం,
సర్వమానవ సౌభ్రాతృత్వ పరిమళం, మావవత్వం,
ప్రాకృతిక అనువర్తనాల ప్రమేయం, భిన్నత్వం,

మానవ మేధకు పరమపదం, తత్వఙ్నానం,
భవబంధపు సంకెళ్ళకు విముక్తమే, ఆత్మ తత్వం,
తత్వ శోధనయే ద్వైతపు సమాధి,
తత్వ సాధనమే అద్వైతపు పునాది,
తత్వ సాంగత్యమే అఙ్నానపు తిమిర సంహారి...

Tuesday, 10 April 2012

అపరిచిత నేస్తమా....


అసలు నేన్నీకేమౌతాను,
పరిచయం కొద్ది రోజులదే, ఐనా,
ఆ పరిమళమెప్పటిదో కదా,
చనువు కొద్ది మాటలదే, ఐనా,
ఆ చొరవకెన్ని రూపాలో కదా,
స్నేహం కొన్ని సంగతులదే ఐనా,
ఆ సాన్నిహిత్యమెన్ని విషయాలదో కదా,
పలకరింపు కొన్ని నిమిషాలే ఐనా,
వెనక దాగిన అధికారం వయసెన్ని యుగాలో కదా,

నీ మౌనం కొద్ది ఘడియలే ఐనా,
అది నాలో పెంచే ఆలోచనా తీవ్రత ఊహించగలవా,
నీ కోపం అప్పుడప్పుడే ఐనా,
అది నన్నెంత భయపెడుతుందో తెలుసా,

నీ గురించిన్ని తెలిసినా,
ఇప్పటికీ, నువ్
నాకేమౌతావో, తెలీదు,
ఓ అపరిచిత నేస్తమా....

Monday, 9 April 2012

ఆవాహన


నేనో నియాండెర్తల్ కీటకాన్ని,
నియో హ్యూమనైజ్డ్ కవాటం
తెరుచుక్కూర్చున్న క్రోటన్ మొక్కని,
మనసుల్లో ఖాలీల్ని ఎడారి ఇసుకతో నింపుకుని,
ఆశల కోర్కెల విత్తనాలేసి, రోజూ
వాటిని కన్నీటితో తడమలేక తడుపుతూ,
వర్షించే మేఘం కనపడితే, కొల్లగొట్టడానికెదురు
చూసే మెక్సికన్ రెడిండియన్ని,
మధ్య ఆఫ్రికా అమానవీయ ఆదివాసీ ని,

కడుపు దాహాన్ని సంద్రంతో ముంచుకుని,
అడుగునేలని మిగల్చకుండా పంచుకుని,
దప్పిక తీరక చమురునీ,
నేల చాలక చంద్రుణ్ణీ చూసే,
పులిచారల్ని హోమోసెపియన్ గా కప్పుకున్న,
సామ్రాజ్య వాద స్వార్ధాన్ని,
సామ్యవాద బలహీనతని,

మనుషుల్ని చంపే నందిగ్రాంలను,
దేవుడ్ని దింపే సాలిగ్రామాలను,
బెస్ట్ బేకరీలో మాడిన రొట్టె ముక్కల్ని,
గోద్రా రైల్లో వాడిన చర్మపు తుక్కుల్ని,
ఒకేలా చూడగల దిష్టి బొమ్మని,

గాంధారంలో తథాగతుణ్ణి గతంగా మార్చిన "విధ్యార్ధిని",
స్వస్తిగ్గుర్తుల్తో తథాస్తంటూ క్యాంపులు రాల్చిన విగత వేషాన్ని,
క్రూసేడ్లంటూ పవిత్ర యుధ్దం చేసిన శాంతిని,
కోనేట్లో మునిగి రక్తం కడుక్కుంటున్న అశాంతిని,
స్మశాన శైథిల్యంలో కైవల్యించిన విస్మృతిని,
విషాద నైర్మల్యానికి కైమోడుస్తున్న వికృతిని,

అర్ధానికే తప్ప పరమార్ధానికి విలువివ్వని
కార్పోరేట్ కల్చర్డ్ కాగితాన్ని,
స్వార్ధానికే తప్ప, స్వాభిమానానికి వలువివ్వని
డెస్పరేట్ కలర్డ్ ఇంగితాన్ని,
బలానికే తప్ప బంధానికి బానిసవ్వని
స్మార్ట్ టెంపర్డ్ సంగీతాన్ని,
కులానికే తప్ప కాలానికి బాసటవ్వని
సిగ్గు లేని నిజాన్ని,

అందుకే
రానీ ప్రళయం, కానీ జగం లయం,
పొనీ సకలం, తేనీ మరో శకం,
అప్పుడైనా,
నేను "మనిషి"గా ఉంటానేమో,
నేనూ "మనిషి"నే అంటానేమో....