కవితా మిత్రులకు, నమస్కారం

నా భావాల్ని, భాషని, కలల్ని, కలవరింతల్ని, ఆనందాల్ని, ఆరని తడినీ, ఉద్వేగాల్నీ, ఉద్దేశాల్ని, ఉద్రేకాల్నీ, ఉన్న స్థితిని, మీతో పంచుకొవాలనుకునే నా ఈ చిన్న ప్రయత్నాన్ని ఆదరించి, అభినందిస్తారని, ఆస్వాదించి ఆహ్లాదిస్తారనీ, తప్పిదాలుంటే, దిద్దుకునే అవకాశమిస్తారనీ ఆశిస్తూ, మిమ్మల్ని "కవన వనం"లోకి, ఆహ్వానిస్తూ, మీ వంశీ..

Monday, 9 April 2012

"క్రాస్ రోడ్స్"


దార్లెక్కువున్నా కష్టమే,
ఏ దారో వెతుక్కోడానికి,
గమ్యం కనపడ్తున్నా, నష్టమే,
తొందరేముందని, అడుగేయడానికి,

ఎం.టెక్ చేసి. లక్షలు సంపాదించినంత కాలం,
నేనేం చేసినా ఓ అద్భుతం,
నేనేం గీసినా, ఓ అపూర్వం,
నాలో కవికి కళ్ళాపి జల్లి. ముగ్గులేసారు,
నా ఆలోచనని, కళ్ళాపి చూసి మూగపోయారు,

ఎక్కడో మంచు దేశం, జలుబొచ్చి తుమ్మితే,
మన దేశంలో బలుపొచ్చి కమ్మితే,
ఉద్యోగానికి రెక్కలు,
ఇంటికి అప్పులూ మిగిలాయ్,

ఆశ్చర్యం,
ఇప్పుడు నేనేం రాసినా, దండగట,
నేనేం చూసినా ఎందుకట,
కవిగాడిక్కాళ్ళిరగ్గొట్టి మూలన్తోసి,
ఆలోచనల్ని ఆ లోచనాల్లోనే మూతేసి,

ఐనా,
"సంపాదన్లేనోడికి సాహిత్యమెందుకోయ్,
నువ్ లేకపోతే సారస్వతమేం చావదు,
తెలుగు పుస్తకాలింకా చదువుతున్నారా,
ఇంగ్లీషోడి స్థాయినెలాగూ అందుకోలేవ్,
జేమ్స్ జాయిస్ "యులిసిస్" లాంటిదొక్కడ్రాసాడా,
జేమ్స్ బాండ్ స్థాయున్న ఒక్క పాత్రైనా మనకుందా,
చేతిరాతలన్నం పెట్టవోయ్,
నీ తలరాతకి తగ్గట్టు మారాలంతే,
ఎంతసేపిలా ఉంటావీ క్రాస్ రోడ్స్ లో,
నువ్వెక్కాల్సిన బస్సెప్పుడూ నీకోసమాగదు,
చూడాల్సిన ఉషస్సూ, రాక ఆగదు,
ఎవరిమీదా కోపం, ఎందుకా ఏడుపు"
అంతర్వాణికీ అలుసైపొయా,

అన్నీ పోయాక ఇంకేముంది కోల్పోడానికి,
కన్నేమూసాక ఎదురేముంది భయపడ్డానికి,
ఏళ్ళుగా కూరుకున్న బావి ఎండినట్టై,
చాన్నాళ్ళుగా పేరుకున్న భావాలు పండినట్టై,
రాస్తున్నానీ చివరి రాతలు,
చెదిరిస్తున్నా చెదల ఛాయలు,
చిదిమేస్తున్నా చీడల నీడలు,
చిగురించే రేపటి నిజాలుగా
మారడానికి,
చూడడానికి.....

నువ్వు లేని నేను


శశి లేని నిశిలో,
లిపి లేని భాషలో,
మనసు వేదన వివరిస్తూ,
నువ్వు లేని నేను . .

స్పృహ లేని మత్తులో,
తెరవలేని కళ్ళలో,
చుడలేని వెలుగుకై తపిస్తూ,
నువ్వు లేని నేను . .

శబ్దం లేని శ్వాసతో,
సకలం కోల్పోయిన తెలివితో,
సర్వం నీవైన మనసుతో,
నువ్వు లేని నేను . .

నువ్వొస్తావన్న ఆలోచనని
ఆశగా చూసే ఆనందంలో,
నిన్ను చూడలేనన్న భయాన్ని
కోపంగా తరిమే ఆవేశంతో,
నువ్ నన్ను పోల్చుకోవన్న సందేహానికి,
నువ్వెప్పటికీ నాదానివే అని
గర్వంగా జవాబిచ్చే,
నువ్వు లేని నేను . . . .


Sunday, 8 April 2012

నువ్వు నేను ప్రేమ


నువ్వు + నేను = ప్రేమ
మాటాడుకున్న మాటలే ఇంకా విన్పిస్తుంటే,
ఆడుకున్న ఆటలే ఎదురుగా కన్పిస్తుంటే,
పాడుకున్న పాటలే మెల్లగా జోకొడుతుంటే,
పోట్లాడుకున్న పూటలే ఏదోలా అనిపిస్తుంటే,

నువ్వు = నేను = ప్రేమ,
నీ మౌనం నాకర్ధం ఔతుంటే,
నా ప్రాణం నీకే అనిపిస్తుంటే,
నీ కన్నీళ్ళు నన్ను బాధిస్తుంటే,
నా కౌగిలి నీకు ధైర్యాన్నిస్తుంటే,

(నువ్వు + నేను) > ప్రేమ
ఎప్పుడూ నీ సంతోషం కోరుకుంటుంటే,
నీకోసమేదైనా చేయగలననుకుంటుంటే,
నీలో నన్ను నాకు చూపిస్తుంటే,
నా గెలుపుకి నన్నే ప్రేరేపిస్తుంటే,

(నువ్వు+ నేను+ ప్రేమ)=జీవితం
వయస్సు పెరుగుతున్నా తెలియలేకుంటే,
సొగసు తరుతున్నా పట్టింపు లేకుంటే,
మనసు చెదరకుండా ఒకరికొకరం ఉంటానంటే,
కలల రూపమే రేపటి పాపగా పుడతానంటే

Saturday, 7 April 2012

ఘోష


నేనిప్పటికైదుగుర్ని చంపాల్సొచ్చింది,
మా పెద్దోళ్ళింకా ఎక్కువే చేసుంటారు,
లెక్కలేస్కోడానికవి జననాలా, హననాలాయె,,
చంపడానికెవరికైనా ఏదో కారణముండాలి,
చావడానికెలాగూ చేసుకున్న పాపం తోడైతుంది,
కానీ, ఎవర్ని, ఎందుకు చంపుతున్నానో తెలీదు,
ఎనిమిదేళ్ళుగా, "తలారి"ఐనప్పట్నించి,

జాలేసింది,మొదటిసారి,
చావబోయే కళ్ళలోకి చూసినపుడు,
వాడెంత క్రూరుడో తెల్సినా,
ఆ ధైర్యం చేయలేదింకెపుడూ,
గొంతునలంకరిస్తున్న నెయ్యి పూసిన తాడు,
యముడు విసిరే పలుగులా,
ఎప్పుడో తిన్న నెయ్యి వాసనొస్తుండగా,
సన్నగా ఏడుపు కాపాడమంటూ ,
నన్నా క్షణం దేవుడ్ని చేస్తుండగా,
కింద మృత్యుద్వారం తెరుచుకోడమో,
కాళ్ళు గిలగిలా తన్నుకోడమో,
ఏది ముందో గుర్తులేదు....

తాడు వదులై, ప్రాణం బరువు కలిసి,
థైరాయిడ్ కిందెముకని
విరగ్గొట్టే శబ్దమింకా విన్పిస్తూనే ఉంది,
మెదడుకి రక్తమాగి జీవి పోతుందని తర్వాత్తెలిసింది,
ఇంత దగ్గరగా చూసినందుకేమో
భయంపోయింది చావంటే,
కానీ, రేపు నేను చంపబోయే
నా కొడుగ్గుర్తొస్తే,
భయం బాధా కాని ఉద్వేగమేదో అన్పిస్తుంది ,
వాడూ నాకొకటే చెప్పాడు,
"బూటకపు ఎన్కౌంటర్ కంటే,
నీ చేతుల్లో పోవడమే నాకు గెలుపు, విప్లవానిక్కూడా,
లాల్ సలామ్ కామ్రేడ్".....

Friday, 6 April 2012

నాకేనా - మీకూనా


ఓ ఆలోచన తడుతుంది,
వెంటనే ఇంకొకటి దాన్ని నెడుతుంది,
కొత్తగా మరోటి పుడుతుంది,
మొదటిదే నయమన్పిస్తుండగా అసలా
ఆలోచన దేనికో మరుస్తున్నా,
మానవ సహజమా, మానసిక అస్పష్టతా,

ప్రతి సంఘటన పాతగా అన్పిస్తుంది,
ఇంతకుమునుపెక్కడో చూసినట్టే కన్పిస్తుంది,
గతమే ఆవృతమౌతుందా,
నేనే గతాన జాగృతమౌతున్నానా,

మనుషులందరు పరిచయస్తుల్లా తెలుస్తున్నారు,
మాటలూ ముందే పసిగట్టేలా ఉంటున్నాయి,
కాకతాళీయమా, కాలపు కనికట్టా....

అందరూ కష్టమనుకునేవి, నాకిష్టమన్పిస్తున్నాయి,
నేనొదులుకున్నవి అందరికీ దారి చూపిస్తున్నాయి,
యాదృచ్చికమా, యోగలక్షణమా....

నా విరక్తిలో తోడురారెవ్వరు,
నా అనురక్తి నీడన నన్ను మరిచిన అందరు,
లోక రీతింతేనా,
నాకే బ్రతకడం రాదా....

Thursday, 5 April 2012

నిజంగా తెలీదు


నిజంగా తెలీదు
లోకమింత అందమని,
నా కళ్ళలో నిన్ను నిలిపేదాకా
మైకం ఇంత వింతని,
నువ్విష్టం అని తెలిపేదాకా
కలలు నిజాలౌతాయని,
ఆ రోజు నువ్ కలిసేదాకా
వలపు అబద్దం కాదని,
నీ వలలో పడేదాకా

నిజంగా తెలీదు
శిలలు స్వరాలిస్తాయని, నువ్ నన్ను తాకేదాకా
దేవతలు వరాలిస్తారని, అడక్కుండానే ముద్దిచ్చేదాకా
ఊపిరాగడమంటే, నువ్ కాసేపు కనపడకపోయేదాకా
ఊహాలోకమంటే, నీ మాయలో నాకు నేను కనపడకపోయేదాకా

నిజంగా తెలీదు
ఒంటరితనమంటే, నీ తోడు దొరికేదాకా
ఒకరికొకరంటే, ఊరంతా మన గురించే మాట్లాడేదాకా
ప్రేమంటే, నువ్వెపుడూ నాతోనే ఉండాలనిపించేదాకా
ప్రాణమంటే, నేనే నువ్వని తెలిసేదాకా

నిజంగా తెలీదు
అదృష్టమంటే, అంతా ఇంత తొందరగా కుదిరేదాకా
అమరత్వమంటే, నీలో ఏకమయ్యేదాకా
అర్ధమంటే, నీలో సగమయ్యేదాకా
ఆర్ద్రమంటే, అమ్మనే మరిపించేదాకా

నేను నమ్మను,
జాజుల పరిమళం నీ వల్ల రాదంటే
పూజల ప్రతిఫలం, నీ చూపు తేలేదంటే
పాలరాతి సున్నితంలో, నీ ప్రతిభ లేదంటే
పావురాయి సౌకుమార్యం, నీ ప్రమేయం కాదంటే

నేను నమ్మాను,
రంగులన్నీ పోగేసినా నీ వర్ణం రాదంటే
హంగులన్నీ తీసేసినా, నీ అందం నీదే అంటే
లేత కొబ్బరికొచ్చిన రుచి, నీ ఎంగిలే అంటే
పాత ఆవకాయకిచ్చిన శుచి, నీ చేతులదే అంటే ....

Wednesday, 4 April 2012

శూన్యం


అప్పుడే బాగుండేది,
ఏమీ తెలీకున్నా ఒకరికొకరం దగ్గరయ్యేది,
ఏదో జరుగుతున్నా అంతా మంచికే అన్పించేది,
ఎవ్వరు జన్మ ముగించినా ప్రాణం పోయినట్టయ్యేది,
ఎవ్వరి తొలి ఊపిరి విన్పించినా గొంతు పాడినట్టయేది,
ఎక్కడ జల్లు తడిపినా ఒళ్ళు పులకరించేది,
ఎందుకు గుండె తడిసినా ఆవిరి చేసే వేడి రక్తం పారేది,
ఎలాగ కాలం కలహించినా, ఓర్చి వేచే ఆశ ఆయుధమయ్యేది,
ఎలాగోలా బ్రతికే జీవితానికి ఇలాగే అని దిశనిచ్చే ధైర్యముండేది,
ఏ చోట అవమానం దులిపేసినా, బాధ పడని నవ్వు అంటి ఉండేది,
ఏ మాత్రం అనుమానం దరిచేరినా, బదులిచ్చే నమ్మకమంటూ ఉండేది,
ఏమిటిదంతా అన్పించినా, "నీకోసమే" అని ఆనందించే వీలుండేది
మరిప్పుడు,
ఏమైనా వినడానికెవరి మాటలు తాకట్లేదు,
ఏదైనా అనడానికెవరి చూపులు తడమట్లేదు,
ఎప్పుడైనా పంచడానికెవరి మనసులు తెరవట్లేదు,
ఏడుపైనా ముంచడానికెవరికీ సమయం తీరట్లేదు,
అంతటా,
శూన్యం, నా లాగే,
శూన్యం, నా లోనే,
శూన్యం, నా తోనే,
శూన్యం,నా నేనే...

Tuesday, 3 April 2012

సమయమా


సమయమా,
నిన్నలోకి పంపవూ,
రేపటి నా రోజు నీదే, కానీ,
కాసేపు గతంలోకొదిలెయ్యవూ,
చాలిన్నాళ్ళూ చేసింది,
కొన్నాళ్ళైనా నిన్నింకోసారి తడమనీ,
ఆపు నీ ఆరాటం రేపటికై,
గెలవనీ నా నిన్నటి పోరాటం నేటికై,

జవాబుల్లేని ప్రశ్నల్నించి,
నిజంకాని ఊసుల్నించి,
మోసపుచ్చే మాటల్నించి,
పునాదుల్లేని కలల్నించి,
మనసు చచ్చిన క్షణం నుంచి,
మౌనం ముంచిన స్వనం నుంచి,
దూరంగా పరిగెత్తడానికి,
ఒక్కసారి నిన్నలోకి పంపవూ,

కనపడని గమ్యాలకి,
కనుగొనని గమనాలకి,
మర్చిపోయిన నవ్వులకి,
మార్చి పోయిన మనుషులకి,
పోగొట్టుకున్న స్పర్శల ఙ్నాపకాలకి,
ప్రాణంలో కలిసిన తనువుల పరిమళానికి ,
దగ్గరగా నడిచేందుకు, ఒకేఒక్కసారి నిన్నలోకి పంపవూ.....

Monday, 2 April 2012

* నా అక్షరాలు *


నా అక్షరాలు.
అగ్నిని భస్మించే అవిశ్రాంత హవిస్సులు,
ఆత్మని రక్షించే అవిరళ తపస్సులు.
అంతరంగావిష్కరణలో అస్పష్ఠ ఆర్తనాదాలు,
అసహజ సహజాతాల సహజ సంవాదాలు

నా అక్షరాలు.
వెన్నెల్లో ఆడుకునే నీ రూపాలు,
నీ కన్నుల్లో నాకోసమెగసే సంద్రాలు.
నేను లేకున్నా నీతో అనగలిగే మాటలు,
నువ్వున్నపుడు చెప్పలేకపోయిన భావాల నీడలు,
నీ వల్ల కలిగిన అనుభూతుల సాక్ష్యాలు,
మనసు మోయలేక బైటికి దూకే సంతోషపు కెరటాలు,
అనుక్షణం నడిపించే నీ పిలిపులు,

నా అక్షరాలు.
ఇన్నాళ్ళూ కనపడని,
ఇక చేరలేనేమో అనుకున్న గెలుపుల ఆహ్వానాలు,
నీ మీద చూపించికోగలిగే చిట్టి కోపాలు,
నన్ను నేను పొగుడుకునే,
నిన్ను నాలో పొదుముకునే,
నాకు నేనే పంపించుకునే,
నీకు నేనందివ్వగలిగే,ఆశల అనుబందాలు.....

Sunday, 1 April 2012

ఎప్పట్లాగే


నాకూ నవ్వులేరుకోవాలనున్నా
లోకం చెట్టు రాలుస్తుంటే,
నిన్ను తాకి మిగిలిన చేతులవంటుకోనంటుంటే,

నాకూ మాటలందుకోవాలనున్నా
స్నేహపు సంగీతం రవళిస్తుంటే,
నువ్ తట్టి విడిచిన నిశ్శబ్దమే, నా గీతమౌతుంటే

నాకూ కలలాహ్వానించాలనున్నా
మోహపు సాంగత్యం విరులిస్తుంటే,
నువ్ తీగ నిలిపిన మైకమే ఇంకా కమ్ముకుంటుంటే,

నాకూ బ్రతకాలనున్నా
రేపటి ఊహ రమ్మంటుంటే,
నువ్ తీయగా తీసిన ప్రాణమెప్పుడో కనుమరుగై ఉంటే,

స్వాంతన కోరుతున్న కాలిన అక్షరం
పుస్తకాల్ని దాచుకున్న మస్తకాల మూటలో,
సాక్ష్యమడుగుతున్న కూలిన ఆ క్షణం
నిజాల్ని నిక్షిప్తించుకున్న అస్థిత్వపు దాగుడుమూతలో,
సాయం రమ్మంటున్న శిలాజ స్ఫటికపు ఏకాంతం
మాట మింగిన మౌనమాడిస్తున్న ఆటలో,
సర్వం కోల్పోతున్న విరాగస్ఫోరక జీవితాంకం
ఆశాసమాధిని రాలే ఎండుటాకుల మోడు నీడలో,

జీవం కోసం ఆత్మలా,
ఙ్నానం కోసం తృష్ణలా,
ఆధారం కోసం మొక్కలా,
ఆవృతం కోసం భూమిలా,వెతుకుతూ,
కనిపించని కాంతిరేఖకై తపిస్తూ,
వినిపించని ఆకాశవాణిని ఊహిస్తూ,
వికసించని పసిమొగ్గల్ని జోకొడుతూ,
ముంచేసిన చిక్కటి చీకటిని ఛీకొడుతూ......
ఎప్పట్లాగే నాలో నేను...